ETV Bharat / state

Singareni Coal Mining: నిబంధనలు పాటించని సింగరేణి.. ఆపదలో జనావాసాలు

author img

By

Published : Apr 3, 2022, 10:39 AM IST

Pollution by Singareni Coal Mining: గనుల తవ్వకాల విషయంలో ప్రైవేటు కంపెనీలు పర్యావరణ నిబంధనలను తుంగలో తొక్కడం మామూలే.. కానీ ఇక్కడ ప్రభుత్వ రంగ సంస్థ కూడా అదే తీరుగా వ్యవహరిస్తుండటమే దారుణం! కేంద్ర పర్యావరణ నిబంధనలను పాటించాల్సిన సింగరేణి.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోంది. జలవనరులను కలుషితం చేస్తోంది.. ఇది స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కుమురంభీం అసిఫాబాద్‌ జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో ఓపెన్‌కాస్ట్‌ కోల్‌ మైనింగ్‌ వల్ల పలు గ్రామాలు ప్రకంపనలు, వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయి.

singareni coal mines
సింగరేణి బొగ్గు తవ్వకాలు

Pollution by Singareni Coal Mining: కేంద్ర పర్యావరణ నిబంధనలను పాటిస్తూ గనుల తవ్వకాలు జరపాల్సిన సింగరేణి.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతోంది. జలవనరులను కలుషితం చేస్తుండటంతో.. స్థానికుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెల్లంపల్లి ప్రాంతంలో ఓపెన్‌కాస్ట్‌ కోల్‌ మైనింగ్‌ వల్ల ఉల్లిపిట్ట, ఖైరాగూడ గ్రామాల్లో వాయు కాలుష్యం, వట్టివాగు బ్యాక్‌వాటర్‌ వల్ల ధంపూర్‌, చందుగూడ గ్రామాలు ఇబ్బంది పడుతుండగా, గనుల్లో జరిపే పేలుళ్లతో సాలెగూడ, సొప్డి, ఆరెగూడ, తోయగూడ, దేవాయ్‌గూడ, జెండాగూడ గ్రామాలు ప్రకంపనలు, వాయు కాలుష్యంతో సతమతమవుతున్నాయి.

.

గనుల పేలుళ్లతో ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. సరైన పర్యవేక్షణ లేకుండానే సబ్‌ కాంట్రాక్టర్లు పేలుళ్లు చేపడుతున్నారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా భారీ ఎత్తున బొగ్గు తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇది పర్యావరణంతోపాటు పంటలను కూడా దెబ్బతీస్తోంది. మానవులు, జంతువుల ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతోంది. ఓపెన్‌కాస్ట్‌ తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందంటూ స్థానికుల తరఫున న్యాయవాది ఎస్‌.వివేకానంద జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో ఫిర్యాదు చేయగా, ట్రైబ్యునల్‌ విచారణకు కమిటీని ఏర్పాటు చేసింది. దీనిపై ‘ఈనాడు- ఈటీవీ భారత్​’ పరిశీలించగా దారుణమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

.

వ్యర్థాలతో కాలుష్యం: బొగ్గు దుమ్ము, వ్యర్థాలను సింగరేణి విచక్షణరహితంగా డంపింగ్‌ చేస్తోంది. గుట్టగా పోసిన వ్యర్థాలు పెద్ద కొండలా మారిపోయాయి. వర్షాకాలంలో నీటితో కలిసి చెరువులు, వాగులు, వంకల్లోకి చేరుతున్నాయి. వట్టివాగు నీటిని మళ్లించడం వల్ల దంపూర్‌, చందుగూడ గ్రామాల్లోని ఇళ్లు, పొలాలు గత వర్షాకాలంలో ముంపునకు గురయ్యాయి. గతంలో 25 వేల ఎకరాలకు సాగు నీరందించే వట్టివాగు నుంచి ఇప్పుడు 10 వేల ఎకరాలకు కూడా నీరందడంలేదు. కాలువలన్నీ పూడిపోయాయి. నీటిపారుదల శాఖకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడంలేదు. కలుషిత జలాల వల్ల ప్రజలను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. వట్టివాగులోకి చేరుతున్న వ్యర్థాల వల్ల జలచరాలే కాకుండా పశువులు కూడా చనిపోతున్నాయి. బొగ్గు ధూళి కారణంగా భూసారం తగ్గి పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి.

నిబంధనలకు తిలోదకాలు: ఇక్కడ పర్యావరణ అనుమతులకు మించి బొగ్గు తవ్వకాలు జరుగుతున్నాయి. కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం పచ్చదనం లేదు. వాయు కాలుష్యంపై పీసీబీ నోటీసులు జారీ చేసి చేతులు దులిపేసుకుంటోంది. మొత్తం ప్రాజెక్టు ప్రాంతం 1,200 హెక్టార్ల వరకు ఉండగా.. అందులో అటవీ ప్రాంతం 296 హెక్టార్లు, అటవీయేతర భూమి 920 హెక్టార్లు ఉంది. 296 ఎకరాల అటవీ ప్రాంతం ఉన్నప్పటికీ వన్యప్రాణులకు సమస్యలే లేవని సింగరేణి చెబుతోంది. 882 హెక్టార్లలో అటవీ పెంపకం ప్రణాళిక చేపట్టలేదు. 231 హెక్టార్లలో గ్రీన్‌బెల్ట్‌ అభివృద్ధి చేయాల్సి ఉండగా పట్టించుకోవడంలేదు. ఇక్కడ పునరావాస ప్రక్రియ సరిగా జరగడంలేదు.

వ్యర్థాల డంపింగ్​తో నష్టపోతున్న గ్రామాలు

అధికారులు బెదిరిస్తున్నారు.. ఇక్కడి 15 గ్రామాల్లో కాలుష్యంపై సర్వే చేయాలని పీసీబీకి వినతి పత్రం ఇస్తే కేవలం రెండింటిని పరిశీలించి వెళ్లిపోయారు. కలెక్టర్‌ను కలిసినా ప్రయోజనం లేకపోయింది. కాలుష్యంపై ఎన్జీటీని ఆశ్రయించినవారిని సింగరేణి అధికారులు కొందరు బెదిరిస్తున్నారు. వట్టివాగు కలుషితం కావడంతోపాటు కుంచించుకుపోతుండటంపై నీటిపారుదల శాఖ అధికారులను కలిసినా ప్రయోజనం లేకపోయింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చేస్తున్నామని అంటున్నారు. 500 మీటర్ల దూరంలో ఉన్న గౌరుగూడ గ్రామ ప్రజలు పేలుళ్ల శబ్దాలతో వినికిడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. -ఎస్‌.వివేకానంద, స్థానిక న్యాయవాది

ఇదీ చదవండి: కేంద్రంపై తెరాస ఉద్యమం.. ఈనెల 4 నుంచి 11 వరకు ఐదంచెల్లో నిరసనలు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.