ETV Bharat / state

FLOOD REPORT: భారీగా చేరుతున్న వరద నీరు... నిండుకుండలా జలాశయాలు

author img

By

Published : Jul 22, 2021, 6:15 PM IST

Updated : Jul 22, 2021, 7:50 PM IST

PROJECTS REPORT ON FLOODS
ప్రాజెక్టులకు భారీ వరద

తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీ వరద చేరుతోంది. నదుల్లో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగులు, చెరువులు ఉప్పొంగడం వల్ల పలు ప్రాంతాల్లో గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలతో జలాశయాలు నిండుతున్నాయి. దాదాపు అన్ని జలాశయాల్లో నీటిమట్టం గరిష్ఠస్థాయికి చేరుకుంది. కడెం, మిడ్ మానేరు, తాలిపేరు, ఎల్లంపల్లి నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలంలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో అధికారులు 35 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

ఎల్లంపల్లి జలాశయం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎగువ ప్రాంతంలో ఉన్న కడెం జలాశయం నుంచి నీటిని విడుదల చేయడంతో శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలోకి 1,90,107 క్యూసెక్కుల వరద నీరు చేరుకుంది. దీంతో అధికారులు 35 గేట్లను ఎత్తి 2,28,690 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదిలారు. మొదట ఇరవై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు. కానీ ఎగువ నుంచి వరద నీరు అధికమవడంతో మరో పదిహేను గేట్లను ఎత్తారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల కోసం గోదావరిలోకి రావద్దని సూచించారు.

శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు

శ్రీరాంసాగర్ జలాశయానికి భారీగా వరద ప్రవాహం వస్తుంది. ఇన్​ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు ఉండగా... 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 1090.40 అడుగులు ఉంది. విద్యుదుత్పత్తి చేస్తూ... 8 వేల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు వద్దకు మంత్రి ప్రశాంత్​ రెడ్డి వెళ్లారు. కలెక్టర్​, ఇతర అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఎస్‌ఆర్‌ఎస్పీకి వరద, నీటి విడుదలపై చర్చించారు. లోతట్టు గ్రామాల సర్పంచ్‌లతో ఫోన్‌లో మాట్లాడి... అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఎగువ మానేరు..

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావు పేట మండలంలోని నర్మాల వద్ద ఎగువమానేరు జలాశయం వరద నీటితో నిండింది. పాల్వంచ, కూడవెల్లి వాగుల నుంచి భారీగా చేరిన వరద నీటితో... జలాశయం నిండుకుండను తలపిస్తోంది. 31 అడుగుల నీటి నిల్వ సామర్థ్యం కలిగిన ఎగువమానేరు పూర్తిగా నిండి అలుగు పారుతోంది. అప్రమత్తమైన పోలీసులు నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రాజెక్టును సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. భారీ వర్షాల దృష్ట్యా అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు.

మధ్య మానేరు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్య మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు 22 గేట్లను ఎత్తి... లక్షా 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 82 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో రావడంతో... అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

దిగువ మానేరు

కరీంనగర్​లోని దిగువ మానేరుకు భారీగా వరద ప్రవాహం వస్తోంది. మిడ్​ మానేరు, మోయ తుమ్మెద వాగు నుంచి నీటి ప్రవాహం ఎక్కువగా వస్తుండడంతో దిగువ మానేరు నిండుకుండను తలపించింది. అక్కడి పరిస్థితులను పరిశీలించేందుకు మంత్రి గంగుల కమలాకర్​ వెళ్లారు. ప్రస్తుత పరిస్థితులపై అధికారులను అడిగి ఆరాతీశారు. అనంతరం దిగువ మానేరు 12 గేట్లు ఎత్తి... లక్ష క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. మరింత నీటి ప్రవాహం వస్తే... మరో రెండు గేట్లు ఎత్తుతామని మంత్రి వెల్లడించారు.

ఉమ్మడి ఖమ్మంలో ప్రాజెక్టులు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులకు క్రమంగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో ఖమ్మంలోని మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాత్రి నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహంతో జలకళను సంతరించుకుంది. వైరా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరి అలుగు పారుతోంది.

పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 16 అడుగులు కాగా.. 10.3 అడుగులకు చేరింది. సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువు పూర్తిస్థాయి నీటి మట్టం దాటి ప్రవహిస్తోంది. పాల్వంచ మండలంలోని కిన్నెరసాని నీటి మట్టం 407 అడుగులు కాగా... 401 అడుగులకు చేరింది. అశ్వారావుపేటలోని పెదవాగు ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరగడంతో.. గేట్లను ఎత్తారు.

తాలిపేరు జలాశయం

భద్రాద్రి జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఎగువన ఉన్న ఛత్తీస్​ఘడ్​ నుంచి భారీగా వరద నీరు రావడంతో జలాశయం నిండుకుండలా మారింది. వరద నీరు అధికంగా రావడంతో పూర్తిస్థాయి నీటిమట్టం 75 మీటర్లను దాటేసింది. దీంతో అధికారులు 12 గేట్లను ఎత్తి దిగువకు 14,148 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

కృష్ణా బేసిన్​లో వరద ఉద్ధృతి

ఎగువ నుంచి వస్తున్న వరదతో పాటు... ఉమ్మడి నల్గొండ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో అక్కడి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. నాగార్జునసాగర్​కు 5 వందల క్యూసెక్కుల స్వల్ప ఇన్ ఫ్లో ఉండగా... అంతే మొత్తాన్ని పులిచింతలకు పంపుతున్నారు. సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా... 534.90 అడుగుల మేర నీరు ఉంది. 45.77 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యం గల పులిచింతల జలాశయంలో... 43.54 టీఎంసీల మేర నిల్వ ఉంది. పులిచింతలకు 13,800 వందల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉంటే... అంతే మొత్తంలో కిందకు విడిచిపెడుతున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావంతో మూసీ ప్రాజెక్టు వరద పోటెత్తింది. దీంతో అధికారులు 8 గేట్లను 9 అడుగుల మేర ఎత్తి... 26, 848 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రాజెక్టులకు భారీ వరద

ఇదీ చూడండి: Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్​

Last Updated :Jul 22, 2021, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.