ETV Bharat / state

puvvada: 'అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే ఊరుకునేది లేదు'

author img

By

Published : Jun 16, 2021, 7:48 AM IST

అభివృద్ధి పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నిధులు కేటాయించినా పనులు పూర్తి చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు.

minister puvvada ajay kumar, khammam
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం

అభివృద్ధి పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తప్పవని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం జిల్లా వైరా పురపాలక కేంద్రంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక ద్వారా రూ.2.5 కోట్లతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే రాములు నాయక్‌తో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం పురపాలక అభివృద్ధిపై ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకమండలి సభ్యులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది క్రితం చేపట్టిన రూ.20 కోట్ల పనులు ఇంకా పూర్తి చేయకపోవడంపై మున్సిపల్ కమిషనర్​ను ప్రశ్నించారు.

పనుల్లో జాప్యం చేస్తే గుత్తేదారుడిని తొలగించాలని, అలసత్వం వహిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. నిధులు కేటాయించినా పనులు చేయకపోవడం ఏంటని మండిపడ్డారు. ఎమ్మెల్యేతో పాటు పురపాలక ఛైర్మన్‌ దృష్టిపెట్టాలని ఆదేశించారు. రెండు నెలల్లో పనులు పూర్తి చేయకపోతే గుత్తేదారులను బ్లాక్‌ లిస్టులో పెట్టి చర్యలు చేపడతామన్నారు. మిషన్‌ ఖమ్మం పనులు పూర్తి చేసుకున్నామని… అదే తరహాలో వైరా పురపాలక అభివృద్ధికి కృషిచేస్తామన్నారు. మినీ ట్యాంక్​ బండ్‌ పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.

మున్సిపాలిటీ పరిధిలో నేటి వరకు డంపింగ్‌ యార్డు లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పురపాలక అధికారులకు తక్షణమే భూమిని ఎంపిక చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బొర్ర రాజశేఖర్, మున్సిపల్ ఛైర్మన్ సూతగాని జైపాల్, వైస్ ఛైర్మన్ ముళ్లపాటి సీతారాములు, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొత్తగా ఏ వైరస్​ వచ్చినా ఎదుర్కోడానికి సిద్ధం: సోమేశ్​కుమార్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.