ETV Bharat / state

నెలలు గడుస్తున్నా రైతుబంధు సొమ్ము అందక రైతుల ఇక్కట్లు

author img

By

Published : Apr 8, 2023, 4:07 PM IST

formers problems due to non payment of money from government by rythu bandu scheme
అందని పెట్టుబడి సాయం.. రైతు బంధు సొమ్ము అందక రైతుల ఇక్కట్లు

Rythu Bandhu Scheme Issues : అన్నదాత సాగుకు దన్నుగా ఉండేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న పంట పెట్టుబడి సాయం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇంకా వేలాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు పథకం కింద యాసంగి సీజన్​కు అందించే సర్కారు పెట్టుబడి సాయం దాదాపు 3 నెలలు దాటుతున్నా ఖాతాల్లో చేరకపోవడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉభయ జిల్లాలో కలిపి సుమారు 9 వేల మందికి రైతు బంధు సొమ్ము అందలేదని తెలిసింది. వీరిలో ప్రధానంగా 11 ఎకరాలకు పైబడి సాగు భూములు ఉన్న రైతులకు అందలేదని తెలిసింది. గత సీజన్ వరకు మొత్తం 20 రోజుల్లోనే రైతు బంధు సొమ్ము ప్రక్రియ అంతా పూర్తయ్యేదని..ఈ సారి 3నెలలు దాటుతున్నా తమకు ప్రభుత్వ సాయం అందడం లేదని రైతులు వాపోతున్నారు.

Rythu Bandhu Scheme Issues : ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పంటల సాగు కోసం ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం సుమారు 9 వేల మంది రైతులకు అందాల్సి ఉంది. ఖమ్మం జిల్లాలో సుమారు 4 వేల మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 5 వేల మంది రైతులకు వానాకాలం సీజన్​కు అందించాల్సిన పెట్టుబడి సాయం అందలేదు. వాస్తవానికి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్ లో పెట్టుబడి సాయం ఖాతాల్లో వేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. యాసంగి సీజన్​కు ప్రభుత్వం అందించే రైతుబంధు సాయం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 28న ప్రారంభమైంది. ఈ మేరకు ఖమ్మం జిల్లాలో సీజన్​లో మొత్తం 3,0,7611 మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రూ.355.43 కోట్లు అందాల్సి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 1,45,000 మందికి రూ.214 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది.

ప్రక్రియలో తీవ్ర జాప్యం: ఎకరం లోపు ఉన్న రైతులకు తొలి రోజు, రెండెకరాలలోపు ఉన్నవారికి రెండో రోజు..ఇలా పదెకరాలలోపు రైతులకు పది రోజుల్లోగా రైతు బంధు సొమ్ము ఖాతాల్లో చేరేది. ఈ ప్రక్రియ సుమారు 15 నుంచి 20 రోజుల్లోపు పూర్తిగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేసేవారు. ఈసారి కూడా మొదట్లో ప్రక్రియ వేగంగానే సాగింది. 10 ఎకరాల్లోపు సాగు భూమి ఉన్న రైతులకు తొలి పది రోజుల్లోనే పెట్టుబడి సాయం అందింది. కానీ, ఆ తర్వాత నుంచీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ సారి 3 నెలలు దాటుతున్నా ఉభయ జిల్లాల్లో రైతు బంధు సొమ్ము ఖాతాల్లో వేసే ప్రక్రియ పూర్తి కావడం లేదు.

నెలలు గడిచినా సాయం లేదు: రోజుల వరకు సజావుగానే డబ్బులు రైతుల ఖాతాల్లో వేశారు. ఆ తర్వాత నుంచీ వేలాది మంది పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో వ్యవసాయ శాఖ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ల చుట్టూ రైతులు ప్రదక్షిణలు చేస్తున్నారు. రోజూ తమ ఖాతాల్లో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోవడం, ఖాతాలో సొమ్ము లేదని తెలిసి రైతులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

అసలే ఈ సారి సీజన్ రైతులకు పరీక్ష పెట్టింది. సాగు చేసిన పంటలు గణనీయంగా దిగుబడులు తగ్గిపోయాయి.పత్తి, మిర్చి పంటలకు గిట్టుబాటు ధర అందలేదు. ఇది చాలదన్నట్టు ఈ సారి అకాల వర్షాలు రైతుల్ని నిండా ముంచాయి. గాలివానతో కూడిన అకాల వర్షాలతో పంటలపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో..సాగు కలిసి రాక, ప్రభుత్వ పెట్టుబడి సాయం అందక కర్షకులకు ఇబ్బందులు తప్పడం లేదు.

ట్రెజరీలో పెండింగ్: అయితే..ఇదే విషయంపై వ్యవసాయ శాఖ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. ఆన్ లైన్ లో పొందుపరిచిన వివరాల ప్రకారమే రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సాయం చేరుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. కొంతమంది రైతులకు అందాల్సిన సొమ్ము వివరాలు ట్రెజరీలో పెండింగ్ అని చూపిస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవచూపి రైతు బంధు సొమ్ము అందరికీ అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.

అందని పెట్టుబడి సాయం.. రైతు బంధు సొమ్ము అందక రైతుల ఇక్కట్లు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.