ETV Bharat / state

ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువకులు

author img

By

Published : May 7, 2021, 2:44 AM IST

Updated : May 7, 2021, 6:36 AM IST

రక్తదానమే కాదు ప్లాస్మా దానం కూడా ప్రాణదానమే అంటూ కొత్తపల్లవి అందుకున్నారు కరీంనగర్​కు చెందిన యువకులు.. కొవిడ్ బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ప్లాస్మా అవసరముందని పెద్దెత్తున వినతులు వస్తుండగా దానం చేసే వారి సంఖ్య మాత్రం నామమాత్రంగా ఉంటోంది. హైదరాబాద్‌ తదిరత ప్రధాన పట్టణాల్లో ప్లాస్మా దాతల నంబర్లు అందుబాటులో ఉన్నా జిల్లా కేంద్రాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. వైరస్‌తో భయపడి ప్లాస్మా దానం చేయడానికి కూడా చాలా మంది ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ప్లాస్మాదాతలకు అవసరార్దులకు వారధులుగా నిలుస్తున్నారు కరీంనగర్ యువకులు.

plasma donation
ప్లాస్మా దానం

ప్లాస్మా దానం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న యువకులు

రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉన్నవారిపై కొవిడ్-19 ప్రభావం చాలా తక్కువగా ఉంటోంది. ఎందుకంటే శరీరంలోకి వైరస్ ప్రవేశించగానే వారిలోని రోగనిరోధక కణాలు (తెల్ల రక్త కణాలు) దాడి చేసి ఆ వైరస్‌ను నాశనం చేస్తాయి. అందుకే కొవిడ్-19 నుంచి పూర్తిగా కోలుకున్న వారి రక్తంలో రోగనిరోధక కణాల సంఖ్య బాగా వృద్ధి చెంది ఉంటుంది. అయితే కొందరిలో రోగనిరోధక శక్తి చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటి వారిపై ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. వారి శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలిగితే వ్యాధిని ఎదుర్కొనే వీలుంటుంది.

బాధితుల ఇబ్బందులు

అందుకు పరిష్కారంగా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి వైరస్‌తో బాధపడుతున్న మిగతా రోగుల శరీరంలోకి ఎక్కిస్తున్నారు. ప్రస్తుతం ప్లాస్మాకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. హైదరాబాద్‌లో ప్లాస్మాదాతలకు సంబధించి అనేక చరవాణి నంబర్లు అందుబాటులో ఉన్నా కరీంనగర్ జిల్లాలో ప్లాస్మా గురించి ఎవరిని సంప్రదించాలో సమాచారం లేక బాధితులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించడమే కాకుండా తాను ప్లాస్మా దానం చేసినప్పుడు బాధితుని కుటుంబం పడ్డ సంతోషం అవసరార్ధులకు ఒక ప్లాట్‌ఫాం రూపొందించేందుకు దోహదపడిందని దూల కల్యాణ్ తెలిపారు.

ఫేస్‌బుక్‌ ద్వారా

ఒక వ్యక్తి ప్లాస్మా దానం చేయడానికి సిద్ధమైతే తమకు కావాలంటూ కనీసం 50మందికి పైగా ఫోన్లు చేస్తున్నారంటే ఎంత అత్యవసరంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొవిడ్ బారిన వారు వైద్యం కోసం పెద్దఎత్తున కరీంనగర్‌కు తరలి వస్తున్నారు. అయితే అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ప్లాస్మా అవసరమని చెప్పడంతో కుటుంబ సభ్యులు బెంబేలెత్తుతున్నారు. ఈ క్రమంలో ఆవిర్భవించిన ప్లాస్మాదాతల గ్రూప్‌ అవసరార్దులకు తన వంతు సాయం చేస్తోంది. గత వారం రోజులుగా ఇప్పటి వరకు 100మందికి పైగా అవసరార్థులకు ప్లాస్మా సమకూర్చింది.

'కరీంనగర్ ప్లాస్మాదాతలు' ఫేస్‌బుక్‌ ఖాతాలో తమకు ఫలానా గ్రూప్‌ ప్లాస్మా కావాలని సమాచారం పెట్టడంతోటే ఆ సమాచారాన్ని దాదాపు 200 మంది దాతలు వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేస్తున్నారు. దీనితో అందులో ఉన్న దాతలు తాము ప్లాస్మా దానం చేయడమో లేక తమ స్నేహితులను ఒప్పించి ప్లాస్మా దానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. కేవలం కరీంనగర్‌లోనే కాకుండా హైదరాబాద్‌, నిజామాబాద్, సంగారెడ్డి, మంచిర్యాల జిల్లాలోనూ యువకులు ప్లాస్మా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసరమైతే స్వయంగా ఆయా ప్రాంతాలకు వెళ్లి ప్లాస్మా దానం చేస్తూ మంచి మనసును చాటుతున్నారు.

ఇదీ చదవండి: పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన మోదీ

Last Updated : May 7, 2021, 6:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.