ETV Bharat / state

huzurabad by election: ప్రచారానికి ఇక మూడు రోజులే.. పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీల నజర్​!

author img

By

Published : Oct 24, 2021, 2:31 PM IST

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ప్రచారానికి మరో మూడు రోజులే గడువు ఉంది. దీనితో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు చివరి రెండు రోజుల పోల్​ మేనేజ్​మెంట్​పై తలమునకలై ఉన్నాయి. అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. హుజూరాబాద్‌ ఎన్నికలు అతి ఖరీదైనవిగా పేరు రావడంతో అదే తరహాలో తాయిలాలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

huzurabad by election: ప్రచారానికి ఇక మూడు రోజులే.. పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీల నజర్​!
huzurabad by election: ప్రచారానికి ఇక మూడు రోజులే.. పోల్​ మేనేజ్​మెంట్​పై పార్టీల నజర్​!

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గత నాలుగు నెలలుగా జోరుగా ప్రచారం చేసుకున్న పార్టీలు ఇక ఆ చివరి రెండు రోజుల పోల్‌ మేనేజ్‌మెంట్​పై దృష్టి సారించాయి. ఎన్నికల ప్రచార పర్వంలో అత్యంత కీలకమైన ఆ రెండు రోజులపైనే ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. సాధారణంగా చివరి రెండు రోజుల్లో నేరుగా ఓటర్లను కలిసే ప్రక్రియను కొనసాగిస్తుంటాయి ఆయా పార్టీలు. ఈ క్రమంలో పోలింగ్​కు ముందు రెండు రోజులు అన్ని పార్టీలు సమీకరణాలు మార్చేందుకు ప్రత్యేక దృష్టి పెడతాయి. ప్రచార హోరులో ఓటర్లు నేరుగా పట్టించుకోని పార్టీలు చివరి రోజుల్లో మాత్రం ఎక్కడెక్కడి ఓటర్లలో తమకు వ్యతిరేకత ఉందో గుర్తించి ఆయా ప్రాంతాల్లోని ఓటర్లను తమవైపు తిప్పుకొనే యత్నం చేస్తాయి.

పోల్​ మేనేజ్​మెంట్​ పనిలో..

ఈసారి హుజూరాబాద్‌ ఎన్నికలు అతి ఖరీదైనవిగా పేరు రావడంతో అదే తరహాలో తాయిలాలకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే ఎన్నికల కమిషన్ ఈసారి మాత్రం నాన్ లోకల్ ఓటర్లు 72గంటలు ముందే హుజూరాబాద్ వదిలి వెళ్లాలని సూచించింది. దీంతో ఈ నెల 27 తర్వాత స్థానికేతర నాయకులు, పార్టీ శ్రేణులు ఎవరూ కూడా హుజూరాబాద్ నియోజవకర్గంలో ఉండకూడదు. అయితే ఎన్నికల అధికారుల కళ్లుగప్పి పోల్‌ మేనేజ్‌మెంట్‌ చేసుకునే పనిలో వివిధ పార్టీలు నిమగ్నం అయినట్టు తెలుస్తోంది. అధికారులకు తెలియకుండా నియోజకవర్గంలో తమ పార్టీ సానుభూతి పరులను కలుసుకొనేందుకు షెల్టర్లను గుర్తించే పనిలో పడ్డట్టు సమాచారం.

పట్టణాల నుంచి పల్లెల వైపు దృష్టి

ఎన్నికల ప్రచారం కోసం హుజూరాబాద్, జమ్మికుంట, కమలాపూర్‌ పట్టణాలతో పాటు ప్రధాన సెంటర్లలో షెల్టర్ తీసుకున్న నాయకుల్లో కొంతమంది పల్లెబాట పట్టే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తమ పార్టీ సానుభూతి పరుల ఇళ్ల వివరాలను సేకరించి ఎక్కడెక్కడ మకాం వేయాలో నిర్ణయిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఆయా పార్టీల నాయకుల గ్రామాల్లో ఖాళీగా ఉన్న ఇండ్లు, పెద్ద భవంతులు అనుకూలమైన ప్రాంతాల వివరాలను సేకరిస్తున్నారు. 27వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గాన్ని వదిలిపెట్టాలన్న ఎన్నికల కమిషన్‌ నిబంధనలు పాటిస్తూనే తిరిగి ఇదే నియోజకవర్గంలో తలదాచుకునే ప్రయత్నాల్లో మునిగిపోయారు.

పోల్ మేనేజ్‌మెంట్‌లోను క్విడ్‌ప్రోకో పద్దతే...

ఎన్నికల ప్రచారం మొదలుకొని అన్నింటా ప్రధాన పార్టీలు నిబంధనల విషయంలో ఎవరు ఫిర్యాదుల జోలికి వెళ్లడం లేదు. ఈ పోల్‌ మేనేజ్‌మెంట్‌లోను ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొనే అవకాశం లేక పోవచ్చనే ప్రచారం సాగుతోంది. రోడ్‌ షోతో పాటు ప్రచార తారల మీటింగ్‌ నిబంధనలు అమలు చేయకపోయినా ఏ పార్టీ కూడా ఫిర్యాదు చేయక పోవడం గమనార్హం. ఎన్నికల అధికారుల దృష్టికి వచ్చినప్పుడు మాత్రమే కేసులు నమోదు చేశారు. అసలే సమయం తక్కువ అందులోను ఫిర్యాదులు ధర్నాలు గొడవలు అంటే మరింత సమయం వృధా అవుతుందన్న ఉద్దేశ్యంతో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. మొత్తమ్మీద ఎన్నికల అధికారులకు చిక్కకుండా ఉంటూ ఎవరికి వారు షెల్టర్లు ఏర్పాటు చేసుకోవడంలో అన్ని పార్టీలు క్విడ్‌ప్రోకో రూల్ పాటించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రచారానికి ఇక మూడు రోజులే..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తున్న హుజూరాబాద్ ప్రచారానికి మరో మూడు రోజులే గడువు ఉంది. దీనితో ప్రధాన పార్టీలు మరింత ముమ్మరం చేశాయి. 5 నెలలుగా సిట్టింగ్‌ ఎమ్మెల్యే, తెరాస నాయకులు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై నియోజకవర్గాన్ని హీటెక్కించారు. గడువు ముంగిట్లోకి రావడంతో ప్రధాన పార్టీలు ప్రచార తారలను రంగంలోకి దించి మరింత రక్తి కట్టిస్తున్నాయి. ప్రధానంగా తెరాస నుంచి మంత్రి హరీశ్​ రావు అన్నీ తానై నడిపిస్తుండగా.. భాజపా, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. ఒకవైపు ప్రచారం.. మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్లపై పార్టీలు తలమునకలై ఉన్నాయి.

ఇదీ చదవండి:

Huzurabad by election 2021: గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థుల ధీమా.. ఎవరు ఏమంటున్నారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.