ETV Bharat / state

తొలిరోజున జిల్లాల్లో పకడ్బందీగా లాక్‌డౌన్ 2.0

author img

By

Published : May 12, 2021, 10:05 PM IST

రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ పక్కాగా అమలవుతోంది. అన్ని జిల్లాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 వరకు ఆంక్షలు సడలించిన పోలీసులు... నిత్యావసరాల కొనుగోలు కోసం ప్రజలకు అవకాశం కల్పించారు. అనంతరం లాక్‌డౌన్‌ నిబంధనలు అమల్లోకి వచ్చిన దగ్గర్నుంచి కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించిన పోలీసులు... అకారణంగా బయటకు వచ్చిన వారికి జరినామాలు విధిస్తున్నారు.

lockdown in telangana today
lockdown in telangana today

జిల్లాల్లోనూ పకడ్బందీగా తొలిరోజు లాక్‌డౌన్ 2.0

కరోనా రెండో దశ ఉద్ధృతమైన తరుణంలో.. సర్కారు తెచ్చిన లాక్‌డౌన్‌ రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాల్లో ఎక్కడికక్కడ పోలీసులు మోహరించి... తనిఖీలు చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ అన్ని కార్యకలాపాలకు అనుమతించిన పోలీసులు... అనంతరం నిబంధనలను పక్కాగా అమలుచేస్తున్నారు. తొలిరోజు ఉదయమే అన్ని దుకాణాలు తెరుచుకున్నాయి. కూరగాయలు, నిత్యావసర మార్కెట్ల వద్ద ప్రజల రద్దీ నెలకొంది. ఉదయం 10గంటల తర్వాత ప్రధాన కూడళ్లు బోసిపోయాయి. పలు జిల్లాల్లో లాక్‌డౌన్ అమలు తీరును కలెక్టర్లు, పోలీసు కమిషనర్‌లు పరిశీలించారు. తొలిరోజు కావడంతో... కొన్ని జిల్లాల్లో పోలీసులు వాహనదారులకు అవగాహన కలిగించే ప్రయత్నం చేయగా... మరికొన్ని జిల్లాల్లో ... నిబంధనలను అతిక్రమించినవారిపై కేసులు నమోదు చేసి చలాన్లు విధించారు.

సరిహద్దుల వద్ద చెక్​పోస్టులు..

ఉదయం 6 నుంచి 10 గంటల వరకూ గమ్యస్థానాలకు చేరుకునే బస్సుల్నే నడిపారు. దీంతో కొందరు బస్టాండ్ల వద్ద పడిగాపులు కాయగా... మరికొందరు కాలినడకన గ్రామాలకు బయలు దేరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్ అమలు తీరును మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరిశీలించారు. బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై వచ్చివెళ్లే వాహనదారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అత్యవసరమైతే తప్ప బైటకు రావద్దని ప్రజలకు సూచించారు. ముందస్తు అనుమతులు, మినహాయింపులున్న, అత్యవసర సేవలకు అనుమతులు ఇస్తున్న పోలీసులు... జిల్లాలు, అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పలు దేవాలయాల్లో నిర్ణీత సమయంలో దర్శనాలకు అనుమతించి... ఆ తర్వాత మూసివేశారు. జనం ఇబ్బందులు పడేందుకు లాక్‌డౌన్‌ పెట్టలేదన్న పోలీసులు... వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకే అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలందరూ లాక్‌డౌన్‌కు సహకరించాలని కోరారు.

ఇదీ చూడండి: 'ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పరిస్థితులు మెరుగు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.