ETV Bharat / state

karimnagar Seeds Society : స్వయంగా విత్తనోత్పత్తి చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ధర్మరాజు పల్లి

author img

By

Published : Jul 11, 2023, 2:15 PM IST

Karimnagar Seed Society : ఒకనాడు వ్యవసాయ అవసరాల కోసం పట్టణాల బాట పట్టిన ఆ గ్రామస్థులంతా ఏకమయ్యారు. చేయిచేయి కలిపి.. సంఘంగా ఏర్పడ్డారు. విత్తనాలు కొనటం.. దళారుల చేతుల్లో మోసపోవటమెందుకని.. తామే స్వయంగా విత్తనోత్పత్తి ప్రారంభించారు. ఇలా.. మొదట్లో గ్రామానికే పరిమితమైన సంఘం.. నేడు మూడ్నాలుగు రాష్ట్రాల్లో విత్తనాలను ఎగుమతి చేస్తోంది. ఏటా రూ.8 కోట్ల మేర వ్యాపారాన్ని నిర్వహిస్తూ కరీంనగర్‌లోని ఓ గ్రామం ఆదర్శంగా నిలుస్తోంది.

Seeds
Seeds

స్వయంగా విత్తనోత్పత్తి చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్న ధర్మరాజు పల్లి

Dharmarajpalli Foundation seed society : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌ మండలంలో పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామం ధర్మరాజుపల్లి. రైతులు వ్యవసాయ అవసరాల కోసం నిత్యం హుజూరాబాద్‌, ముల్కనూరు, బాపట్ల తదితర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే సీజన్ ముంగిట్లోకి రావడంతో విత్తనాల కోసం గ్రామరైతులు పడే తాపత్రయాన్ని గమనించిన ముల్కనూరు సహకార బ్యాంకు.. పలు సూచనలు చేసింది. ఎక్కడి నుంచో విత్తనాలు కొనుక్కునే అవసరం లేకుండా.. స్వయంగా విత్తనోత్పత్తి చేసుకునేలా సూచనలు చేశారు.

Karimnagar Foundation seed society : ఇలా.. గ్రామంలో సంఘం ఏర్పాటుకు రైతులు ముందుకు వచ్చారు. 1999లో 70 మందితో ‘ధర్మరాజుపల్లి ధాన్య విత్తన రైతు పరస్పర సహాయ సహకార పరిమిత సంఘం’ అనే పేరుతో ప్రారంభించారు. ఇప్పుడు ఆ సంఘంలో సభ్యుల సంఖ్య 230 మందికి చేరింది. అధ్యక్షులు, జనరల్‌ మేనేజర్‌, పది మంది డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ప్రతినెల మొదటి వారంలో పాలకవర్గ సభ్యులు సమావేశమవుతారు. సంఘంలో జరిగే ప్రతి వ్యవహారాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. ఏటా జూన్‌లో మహాసభను నిర్వహిస్తున్నారు. వరి పరిశోధన స్థానాల నుంచి నూతన వరి వంగడాలను తీసుకువస్తున్నారు. రాజేంద్రనగర్‌, కూనారం, జగిత్యాల, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి సన్న, దొడ్డు రకాలకు సంబంధించిన ఫౌండేషన్‌ విత్తనాలను తీసుకొచ్చి విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని ప్రాసెసింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తుండటంతో సహకార సంఘానికి మంచి పేరు వచ్చింది.

"1990లో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశాం. పండించిన ధాన్యాన్ని విక్రయించాలన్నా, విత్తనాలు కొనాలన్నా కనీసం 30కిలో మీటర్లు వెళ్లాల్సిందే. మా విత్తనాల నాణ్యత బాగుందని మీరు ఇక్కడికి వచ్చి విక్రయించే బదులు మీ దగ్గరే విక్రయించుకోవచ్చు అని చెప్పిన అధికారుల సూచనల మేరకు మేమే ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం." - రమణా రెడ్డి, జనరల్ మేనేజర్, సహకార సంఘం, ధర్మరాజుపల్లి

Karimnagar Seed Production Society : ధర్మరాజుపల్లి విత్తనాలకు మంచి డిమాండ్ ఉండటంతో క్రమంగా వ్యాపారాన్ని విస్తరిస్తూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు ఏటా రూ.8కోట్ల మేర వ్యాపారం కొనసాగుతోంది. సంఘంలో ప్రసుత్తం 4 గోదాములు నిర్మించగా.. 3 ప్రాసెసింగ్‌ యంత్రాలను అందుబాటులో ఉంచారు. రైతులకు కావల్సిన పురుగు మందులు, ధాన్యం, విత్తనాలతో పాటు ఇతర పెట్టుబడులను సంఘం నుంచే అందిస్తున్నారు. తిరిగి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు మినహా మిగిలిన డబ్బులను చెక్కుల రూపంలో చెల్లిస్తున్నారు. ఇబ్బందులు లేకుండా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తూ ప్రాసెసింగ్‌ చేసి 30 కిలోల విత్తన సంచులను తయారు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలకు విత్తనాలను సరఫరా చేస్తూ ఏటా దాదాపు రూ.8 కోట్ల వ్యాపారం చేయడం ఆనందంగా ఉందని సహకార సంఘం ప్రతినిధులు చెబుతున్నారు.

"ప్రైవేటు వారితో పోటీ పడుతూ నాణ్యమైన విత్తనాలను తయారు చేస్తున్నాం. లాభాలు వచ్చినా, నష్టాలు వచ్చినా సంఘం వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రజలకు నాణ్యమైనా విత్తనాలను అందించాలన్న లక్ష్యంతో ఈ పనిని చేస్తున్నాం."-శ్రీనివాస్‌, అధ్యక్షుడు సహకార సంఘం, ధర్మరాజుపల్లి

విత్తనాల ప్రాసెసింగ్‌లో ప్రత్యేక జాగ్రత్తలు వహిస్తూ.. సభ్యుల సహకారంతో సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. గతంలో వ్యవసాయ అవసరాలకు చాలా ఇబ్బందులు పడేవాళ్లమని.. సంఘం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. గ్రామంలోనే అన్ని సమకూర్చుతున్నట్లు చెబుతున్నారు. పాలకవర్గ సభ్యులంతా ప్రతినెలా సమావేశమై.. కార్యాచరణ నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.