ETV Bharat / state

Womens Hotel: ఆ హోటల్​లో పూర్తిగా మహిళలే పనిచేస్తారు.. ఎక్కడో తెలుసా?

author img

By

Published : Mar 6, 2022, 11:00 PM IST

Updated : Mar 8, 2022, 5:31 AM IST

Womens Hotel: ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగాల్లో తమదైన పాత్రను పోషిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన మునిపల్లి ప్రణీత విదేశాల్లో ఉంటూనే సేవా కార్యక్రమాలు కొనసాగించారు. తోటి మహిళలకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ఆవకాయ హోటల్ పెట్టారు. అన్ని పనులను మహిళలు చేస్తూ వినియోగదారులకు సేవలందిస్తున్నారు. మహిళా దినోత్సవ సందర్భంగా హోటల్‌ రంగంలో రాణిస్తున్న వారిపై కథనం.

Womens Hotel: ఆ హోటల్​లో పూర్తిగా మహిళలే పనిచేస్తారు.. ఎక్కడో తెలుసా?
Womens Hotel: ఆ హోటల్​లో పూర్తిగా మహిళలే పనిచేస్తారు.. ఎక్కడో తెలుసా?

ఆ హోటల్​లో పూర్తిగా మహిళలే పనిచేస్తారు.. ఎక్కడో తెలుసా?

Womens Hotel: శ్రీసేవా మార్గ్‌ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రణీత మునిపల్లి కరీంనగర్‌లో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కరోనా సమయంలో నిస్సహాయులకు భోజనాలు పంపిణీ చేస్తున్న క్రమంలో ఉపాధి కోసం చూస్తున్న మహిళలు ఆమెకు తారసపడ్డారు. ఇలాంటి వారి సంఖ్య అధికంగా ఉండటంతో వారికి ఉపాధి కల్పించడానికి ప్రణాళిక రూపొందించారు. ప్రజలకు సాంప్రదాయ పద్ధతిలో పౌష్టికాహారం అందించేందుకు గానూ మహిళల కోసమే హోటల్ ఏర్పాటు చేయడమే కాకుండా ఆ హోటల్‌కు ఆవకాయ అని పేరు పెట్టారు. దీంతో భోజన ప్రియుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఇందులో వంట చేయడం నుంచి మొదలుకొని అన్నింటా మహిళలే సేవలందిస్తారు. అందులోనూ ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థినులతో పాటు కుటుంబ పెద్దలను కోల్పోయి నిస్సహాయులుగా ఉన్న వారు ఇక్కడ ఉపాధిని పొందుతున్నారు.

అన్ని రంగాల్లో రాణించాలి..

'పార్ట్​టైం ఉద్యోగం చేసుకుంటూ చదువుకుంటున్నాను. మహిళలంటే ఎందులో తక్కువ కాదు. ఈ రోజుల్లో చదువులోనైనా, ఉద్యోగాల్లో పురుషుల కంటే మహిళలే ముందుంటున్నారు. మహిళలు ఇంకా అన్ని రంగాల్లో రాణించాలని కోరుకుంటున్నాను. మహిళలు అంటే వంటింటికే పరిమితం కాదు.. అన్నింటిలోనూ మహిళలే ముందుంటున్నారు.'

-సహజ,ఎంబీఏ విద్యార్థిని,కరీంనగర్‌

ఎందులో తక్కువ కాదు..

'మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేక ఇక్కడ హోటల్​లో పని చేస్తున్నాను. ఇక్కడ వచ్చే జీతంతో మా ఇంటిని పోషించుకోగలుగుతున్నాను. మహిళలు ఎందులో తక్కువ కాదని.. పని చేసేందుకు ముందుకొస్తున్నాం.'

-మానస, డిగ్రీ విద్యార్థిని, కరీంనగర్​

ధైర్యం కలిగింది..

'ఇంతకు ముందు ఏజెన్సీ ఉండేది. కరోనా సమయంలో ఆర్థికంగా నష్టపోయి ఇక్కడకి వచ్చాం. ఇక్కడ పది మంది మహిళలం పనిచేస్తున్నాం. ఇక్కడ పనిచేయడం వల్ల జీవనోపాధే కాకుండా.. మా కాళ్ల మీద మేము నిలబడగలం అన్న ధైర్యం కలిగింది. ఒక్కప్పుడు మహిళలు బయటికి వచ్చి పని చేయాలంటే ఇబ్బందులు ఉండేవి. ఇప్పుడు అలా లేదు.. అన్ని రంగాలు మహిళలు ముందుంటున్నారు.'

-శ్రీలత,జర్నలిజం విద్యార్థిని,కరీంనగర్‌

మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరు..

'నా భర్త అనారోగ్య కారణాల వల్ల చనిపోయాడు. ఆ సమయంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న మాకు ప్రణీత తోడుగా నిలిచారు. ఈ ఆవకాయ హోటల్​ పనిచేసేందుకు అవకాశమిచ్చారు. ఇక్కడ వచ్చే జీతంతో పిల్లలను చదివించుకోగలుగుతున్నాను. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కష్టపడుతున్నాను. మహిళలు తలచుకుంటే ఏదైనా చేయగలరు.'

-రజిత, గృహిణి,కరీంనగర్‌

అపోహల నుంచి బయటకు రావాలి..

శ్రీసేవామార్గ్‌ ద్వారా నిరంతరం వంటలు చేయడంలో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఉపాధి మార్గాలను చూపుతున్నట్లు నిర్వాహకురాలు ప్రణీత తెలిపారు.కేవలం ఉన్నత చదువులు ఉంటేనే ఉపాధి లభిస్తుందన్న అపోహల నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉందని సూచించారు.

విజయవంతంగా ముందుకెళ్తున్నాం..

'5 ఏళ్ల క్రితం శ్రీసేవా మార్గ్​ అనే సంస్థను స్థాపించాను. ఆ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్నపుడు చాలా మంది మహిళలు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న మహిళలు తారసపడ్డారు. అలాంటి సమయంలో వీరందరికీ ఏదైనా ఉపాధి చూపించాలనుకున్నాను. కొవిడ్​ సమయంలో ఆవకాయ అనే సాంప్రదాయ భోజనం లభించే హోటల్​ను ప్రారంభించాను. పాత తరం వంటలను ఇప్పటి తరానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించాను. నాకు తారసపడిన మహిళల్లో ఇతర ఏ పనులు చేయలేని.. వంటలు మాత్రమే చేయగలిగే వారున్నారు. వివిధ వంటల్లో నిష్ణాతులైన మహిళలు ఉన్నారు. వారందరికీ ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో ఈ ఆవకాయ ఫుడ్​ కోర్టును ప్రారంభించాను. 15 మంది మహిళలతో ఈ హోటల్​ను విజయవంతంగా నడిపిస్తున్నాను. కొవిడ్​ సమయంలో చాలా హోటళ్లు నష్టపోయాయి.. కానీ ఈ ఆవకాయ హోటల్​ విజయవంతంగా ముందుకెళ్తోంది. ఎందుకంటే ఇక్కడి ఉన్న వాళ్లమంతా.. ఓనర్లు, పనివాళ్లు అనే తేడా లేకుండా అందరం కలిసి పనిచేస్తున్నాం. ఉన్నత చదువులు ఉంటేనే ఉపాధి లభిస్తుందన్న అపోహల నుంచి బయటికి రావాలి. తమకు తెలిసిన ఏ పనైనా చేసేందుకు మహిళలు ముందుకు రావాలి. ప్రతి మహిళ తమ కుటుంబాన్ని ముందుకు నడిపించేందుకు ముందుకు రావాలని కోరుకుంటున్నా.

-ప్రణీత మునిపల్లి, శ్రీసేవా మార్గ్‌ నిర్వాహకురాలు

శిక్షణతో పాటు ఉపాధిని కల్పిస్తాం..

నిస్సహయులతో పాటు కుటుంబానికి చేయూతగా నిలవాలనుకునే మహిళలు తమ వద్దకు వస్తే క్యాటరింగ్‌లో శిక్షణతో పాటు ఉపాధిని కల్పిస్తామని ప్రణీత మునిపల్లి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 8, 2022, 5:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.