ETV Bharat / state

Dalitha bandhu: హుజురాబాద్‌లో దళిత బంధుకు మరో రూ.200 కోట్లు

author img

By

Published : Aug 24, 2021, 3:35 PM IST

దళితబంధు(Dalitha bandhu) పథకం కోసం మరో రూ.200 కోట్లు విడుదలయ్యాయని కరీంనగర్ జిల్లా కలెక్టర్ కర్ణన్ తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.1200 కోట్లు ఇచ్చిందని వెల్లడించారు. పైలెట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.రెండు వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు.

Dalitha bandhu funds, funds released for Dalitha bandhu scheme
దళిత బంధుకు మరో రూ.200 కోట్లు, దళితబంధుకు నిధులు విడుదల

దళితబంధు(Dalitha bandhu) పథకం కింద కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.200 కోట్లు విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం రూ.1,200 కోట్లు ఇచ్చిందని కలెక్టర్ కర్ణన్ వెల్లడించారు. ఈ పథకం పైలెట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.రెండు వేల కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్(cm kcr) ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా రూ.500 కోట్లు... అనంతరం మరో రూ.500 కోట్లు విడుదల చేశారు. మంగళవారం మరో రూ.200 కోట్లు ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితబంధు పైలెట్ ప్రాజెక్టు కోసం రూ.1200కోట్లు నిధులు విడుదలయ్యాయి.

ప్రతిష్ఠాత్మకంగా అమలు

రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి వంద చొప్పున పేద దళిత కుటుంబాలను ఎంపిక చేసి పథకం కింద ఈ ఏడాది ఆర్థికసాయం అందిస్తారు. మిగతా వారికి దశల వారీగా అమలు చేస్తారు. వచ్చే ఏడాది బడ్జెట్​లో దళితబంధు కోసం రూ.30 వేల కోట్లు వరకు కేటాయించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అఖిలపక్షం, హుజురాబాద్ దళిత ప్రతినిధులతో ఇప్పటికే సమావేశమై దళితబంధు పథక తీరుతెన్నులు, అమలుపై సీఎం కేసీఆర్ చర్చించారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయంతో జీవనోపాధి, వ్యాపారం కోసం కొన్ని యూనిట్లను కూడా సిద్ధం చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంత అవసరాలను దృష్టిలో ఉంచుకొని యూనిట్ల జాబితాను సిద్ధం చేశారు. లబ్ధిదారులు వారికి నచ్చిన ఉపాధిమార్గాన్ని ఎంచుకునే వెసులుబాటు కల్పించారు. లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మార్గానిర్ధేశం, పర్యవేక్షణ ఉంటుంది. కొంత మంది లబ్ధిదారులు కలిసి ఎక్కువ పెట్టుబడితో పెద్ద యూనిట్ పెట్టుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

అండగా దళిత రక్షణ నిధి

దళిత బంధు ద్వారా లబ్ధి పొందిన కుటుంబం, కాలక్రమంలో ఏదైనా ఆపదకు గురైతే అండగా నిలిచేందుకు వీలుగా దేశంలోనే ప్రప్రథమంగా "దళిత రక్షణ నిధి"ని ఏర్పాటు చేస్తోంది. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షల రూపాయల్లో రూ.10 వేలను లబ్ధిదారుని వాటా కింద జమ చేసుకొని దానికి మరో రూ.10 వేలు కలిపి ప్రభుత్వం దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఎవరికి ఏ ఆపద వచ్చినా దళిత రక్షణనిధి నిధి నుంచి వారికి ఆర్థికమద్దతు ఇచ్చేలా ఏర్పాటు చేయనున్నారు. దళిత బంధు ద్వారా లబ్ధిదారులు పొందుతున్న ఫలితాలను పర్యవేక్షణ కోసం ప్రత్యేక చిప్ అమర్చిన గుర్తింపు కార్డుతో ఫలితాలను పర్యవేక్షిస్తారు. తెలంగాణ దళితబంధు ఒక పథకంగా మాత్రమే కాకుండా, ఒక ఉద్యమంగా ముందుకు తీసుకుపోవాలన్న దృఢసంకల్పంతో ముందడుగు వేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.