ETV Bharat / state

CM KCR REVIEW: 'గట్టిగా పట్టుబడతా.. చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా'

author img

By

Published : Aug 27, 2021, 12:34 PM IST

Updated : Aug 27, 2021, 10:00 PM IST

CM KCR REVIEW
సీఎం కేసీఆర్ సమీక్ష

12:30 August 27

ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారం: సీఎం కేసీఆర్

దళిత బంధుపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

కరీంనగర్ కలెక్టరేట్‌లో దళితబంధు అమలుపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల, ఇద్దరు కలెక్టర్లు, ఏడుగురు డిప్యూటీ కలెక్టర్లు, సీఎంఓ కార్యదర్శులు  స్మితా సబర్వాల్, రాహుల్ బొజ్జా, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎస్సీ-ఎస్టీ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. రెండున్నర గంటలపాటు దళితబంధుపై అధికారులతో చర్చించిన సీఎం.. పథకం అమలుపై దిశానిర్దేశం చేశారు.

ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే  దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుబడతానని, "నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతా"నని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి సభ్య సమాజమే కారణమని, ఎన్నట నుంచి ఎవరు పెట్టిండ్రోగాని ఇది దుర్మార్గమైన ఆచారమన్నారు సీఎం. ఇప్పటికైనా దళితుల పట్ల  అనుసరిస్తున్న దురాచారాన్ని కట్టడి చేసి దళితుల ఆర్థిక, సామాజిక అభ్యున్నతికి తెలంగాణ సమాజమంతా కదిలిరావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

 

అదే తెలంగాణ సమాజం  లక్షణం.. 

పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదని సీఎం మరోమారు పునరుద్ఘాటించారు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నామని, అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, దళితుల సమగ్రాభివృద్ధి కూడా అంతే పట్టుదలతో సాధించుకుని తీరుతామని సీఎం  స్పష్టం చేశారు. పట్టుబడితే  తప్పకుండా సాధించే లక్షణం తెలంగాణ సమాజం ప్రత్యేకతని సీఎం అన్నారు.

రాష్ట్రం ఆకలిచావుల నుంచి అన్నపూర్ణగా.. 

దళిత అభివృద్ధిపై ఎప్పట్నుంచో ప్రణాళిక ఉంది. ప్రణాళిక కార్యాచరణకు ఇప్పుడు సమయం వచ్చింది. దళితబంధు గతేడాది మే నెలలో ప్రారంభం కావాల్సింది. కరోనా వల్ల దళితబంధు అమలు ఆలస్యమైంది. సిద్దిపేట ఎమ్మెల్యేగా దళిత చైతన్య జ్యోతి నిర్వహించాను. ఎస్సీల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశాను.ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం. తెచ్చుకున్న తెలంగాణను ఏడేండ్లలో అద్భుతంగా అభివృద్ధి చేసుకున్నాం. సాగు నీటి రంగాన్ని పునరుజ్జీవనం చేసుకున్నాం. దండగన్న వ్యవసాయాన్ని పండుగ చేసుకున్నాం. కరెంటును నిరంతరాయంగా ఇచ్చుకుంటున్నాం. ఒకనాడు కూలీ పనికి పోయిన రాష్ట్రంలో 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించుకొనే స్థితికి ఎదిగాం. రాష్ట్రం ఆకలిచావుల నుంచి అన్నపూర్ణగా ఎదిగింది. రాష్ట్రం వచ్చిన నాడు అర్థంకాని పరిస్థితుల నుంచి అర్థవంతమైన, గుణాత్మకాభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులేస్తోంది. కునారిల్లుతున్న కులవృత్తులను కోట్లాది రూపాయలు వెచ్చించి ఆర్థికంగా నిలబెట్టుకున్నాం. గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేతకు ఆసరా, ఎంబీసీలకు అండగా నిలబడింది ప్రభుత్వం. అన్ని రంగాలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాలను అండదండలు అందిస్తూ గత ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం నేనున్నాననే ధీమాను స్ఫూర్తిని అందిస్తోంది.   రైతుబంధు, రైతు బీమాతో రైతులకు వ్యవసాయానికి ఉపశమనాన్ని కలిగించినం. గత వలసపాలనలో అన్ని రంగాల్లో గాడి తప్పిన తెలంగాణ నేడు ఒక దరికి చేరుకుంది. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, బోదకాలు బాధితులకు పెన్షన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, అమ్మఒడి వాహనాలు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు పరుస్తున్నాము. ఇప్పుడిప్పుడే అన్ని రంగాలను సరిదిద్దుకుంటూ, సవరించుకుంటూ ఒక దరికి చేరుకున్నాం. - కేసీఆర్, ముఖ్యమంత్రి

ఇప్పటికే రూ.2 వేల కోట్లు జమ.. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుపై సీఎం కేసీఆర్ తొలి నుంచే ప్రత్యేక దృష్టి సారించారు. పథకం ప్రారంభం నుంచి అనేక సార్లు సమీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. పైలెట్ ప్రాజెక్టుగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించిన ఈ పథకానికి నిథుల కేటాయింపు కూడా జరిగిపోయింది. ఇప్పటికే కలెక్టర్ ఖాతాలో దళితబంధు నిధులు రూ.2 వేల కోట్లు జమ చేసింది ప్రభుత్వం. 

ఇవీ చూడండి: KTR ON FLAG FESTIVAL: 'సెప్టెంబరు 2 నుంచి తెరాస జెండా పండుగ'

Last Updated :Aug 27, 2021, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.