ETV Bharat / city

KTR ON REVANTH: 'టీ కాంగ్రెస్​ను చంద్రబాబు ఫ్రాంచైజీలా తీసుకున్నారు'

author img

By

Published : Aug 27, 2021, 3:03 PM IST

Updated : Aug 27, 2021, 7:13 PM IST

రాజీనామా చేద్దామన్న మంత్రి మల్లారెడ్డి సవాల్​కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ముందుగా సమాధానం చెప్పాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సంస్కారవంతమైన భాష మాట్లాడాలన్నారు. చర్య ఎలా ఉంటుందో ప్రతిచర్య అలా ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను గుర్తించి ప్రధాని మోదీకి చెప్పి అమ్మించేందుకే బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR
KTR

రాజీనామా చేద్దామన్న మంత్రి మల్లారెడ్డి సవాల్​పై సమాధానం చెప్పిన తర్వాతే రేవంత్​రెడ్డి మిగతా విషయాలు మాట్లాడాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావు డిమాండ్ చేశారు. రాజకీయాల్లో సంస్కార భాష ఉండాలని.. అయితే తప్పని పరిస్థితి నెలకొందన్నారు. చర్యను బట్టి ప్రతిస్పందన ఉంటుదని.. మంత్రి మల్లారెడ్డికి ఆవేశం, జోష్ ఎక్కువ కాబట్టి ఓ మాట అన్నారని అందులో తప్పేంటని సమర్థించారు. తమ నాయకులు, కార్యకర్తల సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందన్నారు.

చిలక మనదే కానీ.. పలుకు మనది కాదు..

టీ కాంగ్రెస్​ను చంద్రబాబు ఫ్రాంచైజీలా తీసుకున్నారని.. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి ఏజెంట్ అన్నారు. చిలక మనదే కానీ.. పలుకు మనది కాదని రేవంత్​ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో సీఎంను చెంపమీద కొడతా అన్నందుకే కేంద్ర మంత్రిని అరెస్టు చేశారని.. తమనూ అలాగే చేయమంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు.

ఆస్తుల అమ్మకానికా పాదయాత్ర..?

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేపట్టాలో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. బండికి పెట్రోల్ దండగ ఎందుకని పాదయాత్ర చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. హైదరాబాద్​కు వరద సాయంలో కేంద్రం మొండి చేయి చూపిందని చెప్పేందుకే నగరంలోకి భాగ్యలక్ష్మి ఆలయం వద్ద పాదయాత్ర ప్రారంభిస్తున్నారా అని ప్రశ్నించారు. మోదీ చెప్పిన ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయో యాత్రలో బండి సంజయ్ ప్రజలకు చెప్పాలన్నారు.

బండి సంజయ్ పాదయాత్ర ఎందుకు చేయబోతున్నారో చెప్పాలి. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా?. కేంద్ర ప్రభుత్వ సంస్థల అమ్మకం ద్వారా రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు. ఏమైనా కేంద్ర ప్రభుత్వ ఆస్తులు మిగిలి ఉంటే అమ్మడానికి యాత్ర చేస్తున్నారా? ఏమైనా ఆస్తులు మిగిలి ఉంటే మోదీకి చెప్పి అమ్మిస్తారా? - కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

మేకిన్ ఇండియా అని చెప్పిన కేంద్ర సర్కారు.. బేచో ఇండియాలా మార్చిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను గుర్తించి మోదీకి చెప్పి అమ్మించేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేపట్టారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఉద్యోగాలపై ఇప్పటికే శ్వేత పత్రం విడుదల చేశామని.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఎందుకు భర్తీ చేయడం లేదో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


సెప్టెంబర్​లో పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం..

తెరాస సంస్థాగత కమిటీల నిర్మాణం సెప్టెంబరు 2న ప్రారంభించనున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. సెప్టెంబర్ 2న పంచాయతీలు, మున్సిపాలిటీల్లో జెండా పండగ నిర్వహించి.. అదే రోజున గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందన్నారు. అదే రోజున దిల్లీలో పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. సెప్టెంబరు 2 నుంచి 12 వరకు గ్రామ, వార్డు కమిటీలు.. సెప్టెంబరు 12 నుంచి 20 వరకు మండల కమిటీలు.. సెప్టెంబరు 20 తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీలు, అనుబంధ సంఘాల నిర్మాణం చేపడాతని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్ లో డివిజన్ కమిటీలతో పాటు బస్తీ కమిటీలు కూడా ఉంటాయన్నారు. అన్ని కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 51 శాతం ఉంటారన్నారు. హైదరాబాద్​లో కమిటీల నిర్మాణం కోసం త్వరలో జీహెచ్ఎంసీ నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు.

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లో బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌లో 1,400 బస్తీల కమిటీలను ఏర్పాటు చేస్తాం. పార్టీ కమిటీల్లో 51 శాతానికిపైగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యం. సోషల్ మీడియా కోసం ప్రత్యేకంగా కమిటీలు ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌ కోసం రెండు, మూడ్రోజుల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. తెలంగాణ భవన్‌ కంటే ఉన్నతంగా దిల్లీలో భవన్‌ను నిర్మిస్తాం. కార్యకర్తలు, కమిటీలు దృఢంగా ఉంటేనే పార్టీ పటిష్ఠంగా ఉంటుంది. పార్టీ అనుబంధ సంఘాలను కూడా మరింత పటిష్ఠం చేస్తాం. కమిటీలకు శిక్షణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తాం - కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఇవీ చూడండి: CM KCR REVIEW: దళిత బంధుపై ముగిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష

Last Updated :Aug 27, 2021, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.