ETV Bharat / state

KTR School in konapur : నాయనమ్మకు ప్రేమతో.. రెండున్నర కోట్ల సొంత ఖర్చులతో స్కూల్

author img

By

Published : Jul 11, 2023, 8:12 AM IST

KTR Construct School
KTR Construct School

KTR School in konapur : తమ పూర్వీకుల జీవితంతో ఎవరికైనా మధురానుభూతులు పెనవేసుకుని ఉంటాయి. తాతముత్తాతల జీవన విధానం, నడయాడిన ప్రాంతం, వదిలివెళ్లిన జ్ఞాపకాలు కాలం గడుస్తున్నా మదిని స్పృశిస్తూనే ఉంటాయి. అలా తన నాయనమ్మ పుట్టిన నేల, తాతయ్యతో కలిసి ఆమె నివసించిన ఊరు చుట్టూ అల్లుకున్న స్మృతులతో ఉద్వేగపూరితబంధం పెంచుకున్నాడో వారసుడు. వారి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచేలా.. ఊరి బాగు కోసం సంకల్పించాడు. ఒక్కొక్క జ్ఞాపకానికి వందేళ్ల ఆయువుందనేలా అద్భుత విద్యాకేంద్రం, అనేక అభివృద్ధి పనులతో తాతా-నాయనమ్మపై ప్రేమను చాటుకున్నాడు. ఇంతకీ ఇదంతా చేసింది ఎవరనుకుంటున్నారా.. ఆయన మరెవరో కాదు.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌.

నాయనమ్మకు ప్రేమతో.. రెండున్నర కోట్ల సొంత ఖర్చులతో స్కూల్

KTR School in konapur : బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ నాయనమ్మ వెంకటమ్మ పుట్టిన ఊరు కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం కోనాపూర్‌ గ్రామం. గతేడాది మే 10న ఈ గ్రామంలో పర్యటించిన కేటీఆర్.. సొంత డబ్బులతో నాయనమ్మ వెంకటమ్మ పేరుతో పాఠశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రెండున్నర కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో భవనం నిర్మించారు. పనులు ఇటీవలే పూర్తి చేసుకున్న విద్యాకేంద్రాన్ని కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తీర్చిదిద్దారు. ఈ భవనాన్ని ప్రారంభించేందుకు మంత్రి కేటీఆర్‌ను ఇటీవలే కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో పూర్తైన పాఠశాల భవనం ఫోటోలు, వీడియోను కేటీఆర్ ప్రజలతో పంచుకున్నారు. నాయనమ్మ పేరున నిర్మించిన ఈ భవనాన్ని తల్లి శోభతో కలిసి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు.

  • My grandmother Venkatamma Garu will be pleased for sure 😊

    As promised, have completed the construction of the Government School at Konapur village of Kamareddy constituency

    Will be inaugurating it soon https://t.co/OgyQxLNDtk pic.twitter.com/PA0DOzJRZD

    — KTR (@KTRBRS) July 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

KTR School in Memory of His Grand Mother : కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా మంత్రి కేటీఆర్ తన నాయనమ్మ వెంకటమ్మ, తాత రాఘవరావులను గుర్తు చేసుకుంటూ ఉంటారు. కోనాపూర్‌లో నివసించిన కేటీఆర్ నాయనమ్మ కుటుంబం.. ఎగువ మానేరు జలాశయం నిర్మాణంలో ముంపు బాధితులుగా సిద్దిపేట జిల్లా చింతమడకకు వలస వెళ్లారు. నాయనమ్మ యాదిలో కేటీఆర్ కోనాపూర్ గ్రామానికి ఏదైనా చెయ్యాలని భావించారు. ఈ క్రమంలోనే గ్రామస్థులు సైతం పలుమార్లు హైదరాబాద్ వెళ్లి కేటీఆర్‌ను గ్రామానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

KTR Government School With Own Funds : కోనాపూర్‌కు గతేడాది వచ్చిన కేటీఆర్ ఊరంతా కలియ తిరిగారు. నాయనమ్మ పుట్టి పెరిగిన ఇంటిని చూసి మురిసిపోయారు. ఆ రోజు ఊరి ప్రజలతో మమేకమయ్యారు. సొంత డబ్బులతో పాఠశాలను పునర్నిర్మిస్తానని చెప్పి శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ పాఠశాల భవనంతో పాటు గ్రామానికి అవసరమైన పనులన్నీ పూర్తి చేయించారు. కేటీఆర్ గ్రామానికి వచ్చి వెళ్లిన తర్వాత కోనాపూర్ గ్రామం రూపురేఖలే మారిపోయాయి. గ్రామానికి వచ్చినప్పుడే సీఎం కేసీఆర్‌తో ఫోన్లో మాట్లాడి గ్రామాభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. దీంతో 10 కోట్లతో అభివృద్ధి పనులు చేయించారు. గ్రామానికి వెళ్లే దారిలో రెండున్నర కోట్ల వ్యయంతో వంతెన, 75 లక్షలతో సీసీ రోడ్లు, 24 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించారు. అలాగే ఎస్‌డీఎఫ్‌ నిధుల నుంచి 5 కోట్లు మంజూరు చేయగా.. గ్రామం మొత్తం సీసీ రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. గ్రామంలో కుల సంఘాల భవనాలు, పలు ఆలయాల నిర్మాణాలు సైతం చేపట్టారు.

KTR Gets A Govt School Constructed With Own Funds : శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనం స్థానంలో కార్పొరేట్‌ను తలపించేలా కొత్త భవనం నిర్మించారు. రెండంతస్తుల భవనంలో గ్రౌండ్‌ ఫ్లోర్‌, పైఅంతస్తులోనూ 9 గదుల చొప్పున నిర్మించారు. పాఠశాలలో అన్ని సౌకర్యాలను కల్పించారు. విశాలమైన ఆట స్థలం, ఆట వస్తువులు, సైన్స్‌ ల్యాబ్, తరగతి గదులు, మూత్రశాలలు.. ఇలా ప్రతి ఒక్క సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం పాఠశాలలో ఒకటి నుంచి ఐదు తరగతులు ఉండగా.. 85 మంది విద్యార్థులు ఉన్నారు. ఇద్దరు ఉపాధ్యాయులు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పాఠశాల భవనంతో పాటు, అనేక అభివృద్ధి పనులు చేసి ఊరి రూపురేఖలు పూర్తిగా మార్చేసినందుకు మంత్రి కేటీఆర్‌కు గ్రామస్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు. పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి రానున్న కేటీఆర్ రాక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.