ETV Bharat / state

Cyber Fraud In Kamareddy : సైబర్ నేరగాళ్ల నయా ట్రెండ్​... సీఎస్ పేరుతో...

author img

By

Published : Jul 5, 2023, 12:42 PM IST

Cyber Crimes in Kamareddy : రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో ఎత్తుగడతో ప్రజల సొమ్మును కాజేస్తున్నారు. ఇన్నాళ్లూ సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు దండుకున్నారు. కానీ ఇప్పుడు అలా కాదు నయా ట్రెండ్​ ఫాలో అవుతూ.. డబ్బులు కాజేస్తున్నారు. ఏసీబీ అధికారులమంటూ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో వాట్సప్ చాటింగ్, కాల్స్ చేస్తున్నారు. బాగోగులు తెలుసుకుని మరీ డబ్బులు అడిగి ఖాతాల్లో జమ చేసేలా చేస్తున్నారు. మరికొందరిని బెదిరింపులకు గురి చేసి అడిగినంత దోచుకుంటున్నారు. కామారెడ్డి జిల్లాలో వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కొత్త పంథాల్లో రెచ్చిపోతున్న సైబర్ మోసాలపై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం..

Cyber Crimes
Cyber Crimes

New Trends in Cyber Crime in Kamareddy : సైబర్ నేరగాళ్ల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రభుత్వం ప్రజలకి ఎంత అవగాహన కల్పిస్తున్నా, రోజుకి వందల మంది సైబర్​ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలను సృష్టిస్తున్నారు. ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలను తెరిచి తెలిసిన వారందరికీ రిక్వెస్టులు పంపి డబ్బులు అడుగుతారు. అత్యవసరం అని అనడంతో తెలిసిన వాడే కదా అని స్నేహితులు, బంధువులు, సహచరులు డబ్బులు చెప్పిన అకౌంట్‌లో జమ చేస్తున్నారు. ఆ తర్వాత అది ఫేక్ అకౌంట్‌ అని సదరు వ్యక్తి చెప్పినప్పుడు మోసపోయాం అని గ్రహిస్తున్నారు. ఇన్నాళ్లూ ఇలాంటి పనులతో డబ్బులు కాజేసిన సైబర్ మోసగాళ్లు తాజాగా కొత్త ఎత్తుగడలతో ముందుకు వస్తున్నారు. ఉన్నతాధికారులు, ఏసీబీ అధికారులమని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు.

Continuous Cyber Crimes in Kamareddy : కామారెడ్డి జిల్లాలో సైబర్ నేరగాళ్లు చేసిన నయా మోసాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి కామారెడ్డి కలెక్టరేట్ ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారుల పేర్లతో సైబర్ మోసగాళ్లు చాటింగ్ చేస్తున్నారు. ముందుగా పరిచయం చేసుకుని వారి బాగోగులు తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత అత్యవసరం ఉందని డబ్బులు పంపాలని అడుగుతున్నారు. కొందరికి నేరుగా ఫలానా అధికారినంటూ వాట్సప్ కాల్స్ చేసి డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారు.

సైబర్ మోసాల మీద అవగాహన ఉన్నవారు జాగ్రత్త పడి వాటిని పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. నిజమేనని అనుకుంటున్న ఉద్యోగులు మాత్రం చెప్పిన ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నారు. గత పదిహేను రోజుల కింద ఇలాగే డబ్బులు అడగడంతో డిప్యూటీ తహశీల్దార్ స్థాయి అధికారి రూ.2 లక్షలు ఇచ్చేశాడు. గత రెండు రోజులుగా మళ్లీ ఇలాగే కాల్స్ వస్తుండటంతో అనుమానం వచ్చిన ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రజలంతా ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీసులు సూచిస్తున్నారు.

కామారెడ్డి కలెక్టరేట్, ఉతర ఉద్యోగులకు వాట్సప్ ద్వారా తాము ఏసీబీ అధికారులమని చెప్పారు. మీరు చేస్తున్న వసూళ్లు, అవినీతి, అక్రమాల వివరాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పి డబ్బులు డిమాండ్​ చేస్తున్నారు. దీంతో భయాందోళనకు గురవుతున్న ఉద్యోగులు నిజమే అనుకుని అడిగినన్ని డబ్బులు ఇచ్చేశారు. పలువురు ఉద్యోగులు ఇలాంటి ఫోన్​కాల్స్​ రావడంతో డబ్బులు పంపినట్లు సమాచారం.

ఉద్యోగులు అవినీతి గురించి బయటపడితే వారి పరువు పోతుందని ఎవరికీ చెప్పలేదని తెలుస్తోంది. దీంతో పాటు గతంలో ఓ న్యాయవాదికి ఆగంతకుడి రూపంలో సైబర్ నేరగాళ్లు వాట్సప్‌ ద్వారా ఫోన్‌ చేశారు. ఇటీవల మీరు వాదించిన కేసును తప్పుదోవ పట్టించారని.. ఈ విషయంపై న్యాయమూర్తికి ఫిర్యాదు చేస్తానంటూ చెప్పడంతో రూ.30వేలు వారు చెప్పిన ఖాతాలో జమ చేశాడు. ఇలా నిత్యం కామారెడ్డి జిల్లాలో ఎవరో ఒకరు సైబర్ నేరగాళ్ల బారిన పడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. నిరక్షరాస్యులే కాదు చదువుకున్న వారు సైతం వీరి బారిన పడుతున్నారు.

కొత్త ఆలోచనతో ప్రజల నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేస్తున్నారు. ప్రభుత్వాధికారులమని ఎవరైనా కాల్స్​ చేసి డబ్బులు అడిగితే వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలని సూచించారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.