ETV Bharat / state

FedEx Courier Cyber Crimes : రూట్ మార్చిన కేటుగాళ్లు.. కొరియర్‌ సంస్థల పేరిట బెదిరింపు కాల్స్‌

author img

By

Published : Jun 14, 2023, 7:17 AM IST

Cyber Crime
Cyber Crime

FedEx Courier Cyber Crimes in Hyderabad : 'మేము ముంబయి నుంచి కస్టమ్స్ అధికారులం మాట్లాడుతున్నాము...మీ పేరుతో ముంబయి నుంచి తైవాన్​కు పార్శిల్ డెలివరీ వెళ్తోంది. అందులో మాదకద్రవ్యాలు ఉన్నాయి. నార్కొటిక్ అధికారులు సాయంత్రంలోగా మిమ్మల్ని అరెస్ట్ చేయబోతున్నారు.' ఇలా మీకు కూడా బెదిరింపు కాల్స్ వస్తున్నాయా. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఇలా కాల్స్ చేస్తూ.. అరెస్టు కాకుండా ఉండాలంటే తాము ఏం చెబితే అది చేయాలంటూ.. కొందరు సైబర్ కేటుగాళ్లు అమాయకుల వద్ద ఉన్న సొమ్మంతా కాజేస్తున్నారు. ఈ తరహాలోనే హైదరాబాద్ పరిధిలోనే ఇప్పటి వరకూ ఏడు కేసుల్లో కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు.

రూట్ మార్చిన కేటుగాళ్లు.. కొరియర్‌ సంస్థల పేరిట బెదిరింపు కాల్స్‌

FedEx Courier Cyber Crimes in Telangana : సైబర్‌నేరగాళ్లు మోసాల్లో కొత్త ఎత్తుగడలకు తెగబడుతున్నారు. ఫెడెక్స్ కొరియర్ సంస్థ పార్శిల్‌ పేరుతో బురిడీ కొట్టించిన దోపిడీ బయటపడింది. హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళకు ఫోన్ కాల్ వచ్చింది. మీ పేరుపై ఫెడెక్స్‌ కొరియర్ ఉందని... ముంబై నుంచి తైవాన్​ కు డెలివరీ అడ్రస్‌ ఉందని చెప్పారు. ఆశ్చర్యానికి గురైన మహిళ తాను ఎలాంటి పార్శిల్ పంపలేదని వారికి తెలిపింది. మీ ఫోన్ నంబర్‌తో పాటు ఆధార్ కార్డు వివరాలు కూడా నమోదై ఉన్నాయని...కావాలంటే మీ ఆధార్ కార్డును వాట్సప్ చేశామని ఆమెకు చెప్పారు. వాట్సాప్ సందేశాన్ని చూసిన మహిళ తన ఆధార్ కార్డును చూసి కంగారు పడింది. ఇంతలో ఫోన్ నార్కొటిక్ కంట్రోల్ బ్యూరో అధికారికి ఇస్తున్నామని వారు తెలిపారు. పార్శిల్​లో మాదకద్రవ్యాలు ఉన్నాయని...తైవాన్​కు ఎందుకు పంపుతున్నారని ఆమెను ప్రశ్నించారు. తనకు ఎలాంటి సంబంధం లేదని మహిళ తెలిపింది.

Cyber Crimes in the name of FedEx Courier in Telangana : సాయంత్రం మీ ఆధార్‌ అడ్రస్‌ ద్వారా మీ ఇంటికి తమ అధికారులు వచ్చి అరెస్ట్ చేస్తారని చెప్పడంతో ఆ మహిళ కంగుతింది. కేసు కాకుండా ఉండాలంటే తాను ఏం చేయాలో చెప్పమని మహిళ వారిని అడగగా... తమ అధికారులతో మట్లాడి ఫోన్ చేస్తామని చెప్పి కట్‌ చేశారు. కొంత సేపటి తర్వత ఫోన్ చేసి రూ.5 లక్షలు కస్టమ్స్ వారికి, మరో రూ.5 లక్షలు నార్కొటిక్స్ విభాగానికి ఇవ్వాలని తెలిపారు. వెంటనే మహిళ వారు చెప్పిన ఖాతాలో జమచేసింది. అయినా కూడా మరికొంత డబ్బు కట్టాలని విడతల వారీగా మహిళను బెదిరించి సైబర్ నేరగాళ్లు రూ.80లక్షలు గుంజారు. అనంతరం ఫోన్​కు స్పందించలేదు. తన ఇంటికి ఏ పోలీసులు రాలేదు. ఇదంతా మోసమని గ్రహించిన మహిళ సైబర్ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే తరహాలో బేగంపేటకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని మోసపోయింది. సైబర్ నేరగాళ్లకు 5లక్షలు కట్టింది. మరో యువతి రూ.2.5 లక్షలు, మరో యువకుడు రూ.1.5 లక్షలు సమర్పించకున్నాడు. గత వారం రోజులుగా సైబర్ క్రైం పోలీసులకు ఇదే తరహాలో సుమారు 10 ఫిర్యాదులు అందాయి. మొత్తం కోటి రూపాయలకు పైగా సొమ్మును నేరగాళ్లు కాజేశారు.

ప్రాథమిక దర్యాప్తులో భాగంగా నేరగాళ్లు ముంబై నుంచి దందా నడిపిస్తున్నట్లు గుర్తించారు. భాధితుల వివరాలు.... వారు గతంలో ఇతర మాధ్యమాలు, ఉద్యోగ సైట్లలో అప్‌లోడ్‌ చేసిన రెజ్యూమ్‌లు, ఆధార్ వివరాలను సేకరించి ఆ డేటా ద్వారా బాధతులకు ఫోన్ చేస్తున్నట్లుగా గుర్తించారు. కొంత మంది ఉద్యోగం కోసం ఆన్‌లైన్‌లో అడిగిన వారికి పాన్‌కార్డులు సైతం పంపిస్తున్నారని పోలీసులు తెలిపారు. దీని వల్ల వ్యక్తిగత వివరాలు బయటకు వెళ్ళి సైబర్ నేరగాళ్లకు చేరుతున్నట్లు పోలీసులు చెబతున్నారు.

' బాధితులందరికి తెలుసు వారు ఏ మోసం చెయ్యలేదని. తప్పచేయనప్పుడు ఇలాంటి ఫోన్​కాల్స్​ వస్తే స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేయాలి లేదా సైబర్ క్రైమ్​లో రిపోర్ట్​ చేయాలి. తొందర పడి డబ్బులు మాత్రం ట్రాన్స్​ఫర్​ చేయకూడదు. ఇలా ట్రాన్స్​ఫర్​ చేస్తే ఆ ఖాతాలు ఎక్కడెక్కడివో ఉంటాయి. అక్కడికి వెళ్లి విచారణ జరపడం కష్టం. అవి ఫేక్​ ఖాతాలు.. తప్పుడు అడ్రెస్​లు పెట్టి ఖాతాలు తెరుస్తారు. కాబట్టి ఇలాంటి కాల్స్​ వస్తే బయపడి డబ్బులు ట్రాన్స్​ఫర్​ చేయకండి'. - కె.వి.ఎం.ప్రసాద్‌, ఏసీపీ.

తాజాగా జరిగిన నేరాల్లో కూడా అధికారులమని చెబుతున్న నేరగాళ్లు వాట్సాప్ డీపీలను కూడా అధికారక సంస్థలకు సంబంధించినవి పెడితే భయపడవద్దని చెబుతున్నారు. చేయని తప్పుకు భయపడాల్సిన అవసరం లేదని... ఇలాంటి కాల్స్ వస్తే వాటని పట్టించుకోవద్దని లేదా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరుతున్నారు. దీంతోపాటు వ్యక్తి గత సమాచారానికి సంబంధిచిన ఏ డాక్యుమెంటును కూడా ఆన్‌లైన్‌లో తెలియని వారికి షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. ఇదే తరహా కేసులు ముంబైలో కూడా 30కి పైగా నమోదయ్యాయని గుర్తించారు. ఇదొక కొత్త ముఠాగా పోలీసులు భావిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.