ETV Bharat / state

జారాల ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు... త్వరలోనే టెండర్లు

author img

By

Published : Apr 18, 2021, 4:49 PM IST

జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లకు మూడు దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జీవో నెం.153 ద్వారా రూ.12.48 కోట్ల నిధులను మంజూరు చేస్తూ నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడు రోజుల్లో సాంకేతిక అనుమతులు తీసుకొని టెండర్లను పిలిచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.

funds-release-for-jurala-project-repairs
జారాల ప్రాజెక్టు మరమ్మతులకు నిధులు... త్వరలోనే టెండర్లు

జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టు నిర్మాణం చేసి 1990లో జూరాల ప్రాజెక్టుకు క్రస్టు గేట్లను ఏర్పాటు చేశారు. 1996లో ప్రాజెక్టును జాతికి అంకితం చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి నిర్వహణ చేయాల్సి ఉంటుంది. ఈ నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోలేదు. దాదాపు మూడు దశాబ్దాలు అవుతున్నా నేటి వరకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టలేదు. ఎట్టకేలకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయడంతో త్వరలోనే క్రస్టు గేట్ల మరమ్మతులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

తుప్పు పట్టే పరిస్థితి

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కృష్ణానదిపై ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు 62 క్రస్టు గేట్లు, ఆరు విద్యుదుత్పత్తి గేట్లతో నిర్మాణమైంది. పాలకులు ప్రాజెక్టు నిర్వహణ విషయంలో నిరాధరణతో గేట్లకు తుప్పు పట్టే పరిస్థితి వచ్చింది. నాలుగేళ్లకు ఓసారి మార్చాల్సిన రబ్బర్ సీలను మార్చకపోవడంతో 18 గేట్ల నుంచి నీటి లీకేజీలు వస్తున్నాయి. గేట్లను మరమ్మత్తులు చేయడం, గేట్లను ఎత్తడానికి అవసరమైన హాయిస్ట్ మోటార్ల నిర్వహణ, తుప్పు ఏర్పకుండా ఇసుకతో క్లీనింగ్ చేయించి రంగులు వేయడం, గేట్లను ఎత్తాల్సిన ఇనుప తాళ్లకు గ్రీజింగ్ చేయడం, రబ్బర్ సీల్స్ వేయడం వంటి వాటిని ప్రతి ఏటా వేసవిలో పరిశీలన చేసుకోవాల్సింది. కానీ ప్రభుత్వం నుంచి మెకానికల్ విభాగానికి నిధులు విడుదల కాకపోవడంతో పట్టించుకోలేదు.

నిధులు లేక..

నిధులు విడుదల కాకపోవడం జూరాల ప్రాజెక్టు గేట్ల నిర్వహణకు శాపంగా మారింది. ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకు ఇచ్చిన ప్రాధాన్యత ప్రాజెక్టు సమస్యలపై సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు ప్రజాప్రతినిధులు ఇవ్వకపోవడం కూడా ఒక కారణమే. ఆరేళ్ల నుంచి గేట్లకు సంబంధించిన రబ్బర్ సీలను మార్పు చేయకపోవడంతో ఏడు క్రస్టు గేట్ల నుంచి లీకేజీ ఎక్కువగా ఉండగా, మరో 11 గేట్లనుంచి లీకేజీ కొనసాగుతోంది.

కమిటీ సందర్శించి..

ప్రాజెక్టుపై ఉన్న గ్రాంటీ క్రేన్​ను అటుగా వెళ్తున్న వాహనం ఢీకొనడంతో చాలా ఏళ్ల క్రితం నుంచే పనిచేయడం లేదు. 2019లో జూరాల క్రస్టు గేట్లపై ఈటీవీ, ఈనాడులో కథనం ప్రచురితమైంది. దానిపై స్పందించిన ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. కృష్ణారావు నేతృత్వంలో ఇంజనీరింగ్ నిపుణుల బృందం జూరాల ప్రాజెక్టును సందర్శించింది. మరోసారి విశ్రాంత సీఈ సత్యనారాయణ నేతృత్వంలో కమిటీ మరోసారి సందర్శించి గేట్ల మరమ్మతులు చేపట్టాలని సూచించింది. ఇందుకోసం రూ.10.50 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ నివేదికను ప్రభుత్వానికి పంపారు. నివేదిక ఇచ్చి రెండేళ్లు కావడం వల్ల మరమ్మతుల ఖర్చు రూ.12.43 కోట్లకు చేరింది.

టెండర్ల కోసం పిలుస్తాం..

మరమ్మతులకు సంబంధించి సాంకేతిక అంశాల పరిశీలన మూడు రోజుల్లో పూర్తవుతుందని నీటిపారుదల శాఖ ఎస్​ఈ శ్రీనివాస్​రావు తెలిపారు. అనంతరం టెండర్లు పిలిచి వేసవిలోనే పనులు చేపట్టేలా ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద వచ్చే వరకు మరమ్మతులు కొనసాగుతాయని... వరదవచ్చే రోజు నుంచి మిగిలిపోయిన పనులను... వరద తగ్గిన తర్వాత పూర్తిచేస్తామని తెలిపారు. మరమ్మతులకు కీలకమైన గ్రాంటీ క్రేన్​ను ముందుగా అందుబాటులోకి తీసుకువచ్చి, గేట్ల మరమ్మతులు చేపడతామని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని... దానిపై ఇంజినీర్లకు ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రాజెక్టులు పూర్తయ్యే దశలో ఉన్నందున ఇక భవిష్యతు అంతా నిర్వహణనే కీలకం కానున్నది.


ఇదీ చూడండి: శ్రీమంతులు కాకపోయినా.. ఆకలి తీరుస్తున్న దాతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.