Central team visit: వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన.. మొరపెట్టుకున్న రైతులు

author img

By

Published : Jul 21, 2022, 7:47 PM IST

Central team visit

Central team visit: ‍వరదల వల్ల జరిగిన నష్టంపై అంచనా వేసేందుకు కేంద్రం బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన బృందం సభ్యులు... అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చిన వరదలతో తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు కేంద్ర బృందానికి మొరపెట్టుకున్నారు. రేపు హైదరాబాద్‌లో సీఎస్‌ సహా ఉన్నతాధికారులతో కేంద్ర ప్రతినిధులు సమావేశం కానున్నారు.

Central team visit: నెలరోజుల ముందే గోదావరికి భారీవర్షాలు రావడంతో ఉత్తర తెలంగాణచివురుటాకుల్లా వణికింది. పలు జిల్లాలు వరదగుప్పిట్లోనే చిక్కుకున్నాయి. పలు జిల్లాల్లో ప్రాజెక్టులు ఉప్పొంగి ప్రవహించగా పంట పొలాలను వరదనీరు ముంచెత్తింది. కొన్నిచోట్ల పొలాల్లో భారీగా ఇసుకమేటలు వేయగా బండరాళ్లు వచ్చిపడటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ప్రభుత్వమే సహకరించాలంటూ అన్నదాతలు విజ్ఞప్తి చేశారు. వివరాలు సేకరించిన అధికారులు దాదాపు 10 లక్షల హెక్టార్లలో పంటనష్టం జరగ్గా కోట్ల రూపాయల్లో రైతులు నష్టపోయినట్లు ప్రాథమికంగా నిర్ధరించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ తరుణంలో ప్రకృతి విపత్తు కింద సాయం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాలను అధ్యయనం చేసేందుకు కేంద్ర బృందం రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్‌రాయ్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరింస్తోంది. హైదరాబాద్‌కు వచ్చిన కేంద్ర బృందాన్ని రాష్ట్ర విపత్తు నిర్వహణాశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా కలిసి పరిస్థితిని వివరించారు. నష్టాలకు సంబంధించిన ప్రాథమిక అంచనాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు జిల్లాల పర్యటనకు వెళ్లారు.

వరద నష్టంపై కేంద్ర బృందం పర్యటన.. మొరపెట్టుకున్న రైతులు

నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఏర్పడిన నష్టాన్ని అంచనా వేసేందుకు జక్రాన్ పల్లి మండలంలోని పడకల్, మనోహరాబాద్ గ్రామాల్లో కేంద్ర బృందం పర్యటించింది. తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు, నష్టపోయిన పంటలు, జిల్లాలో తెగిన కుంటలు, చెరువుల వివరాలను కలెక్టర్ నారాయణ రెడ్డి వారికి వివరించారు. పడకల్ గ్రామ పెద్ద చెరువు తెగిన కట్టను పరిశీలించారు. అధిక వర్షాల కారణంగా దెబ్బతిన్న, నష్టపోయిన వివరాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను కేంద్ర బృందం తిలకించింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం దౌట్‌పల్లి గ్రామాన్ని కేంద్ర బృందం పర్యటించింది. వరదముంపుతో నష్టపోయిన పత్తి చేలుతోపాటు అక్కడ పేరుకుపోయిన ఇసుక మేటలను పరిశీలించింది. వరదలతో జరిగిననష్టాన్ని రైతులు కేంద్రబృందానికి వివరించారు. అనంతరం నిమ్మగూడెం సమీపంలో వరదకు కొట్టుకుపోయిన కాటారం... మేడారం రహదారి, కల్వర్టును కేంద్రం బృందం, కలెక్టర్ భవేష్ మిశ్రా పరిశీలించారు.

శుక్రవారం మరికొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిల పరిస్థితులను కేంద్రబృందం అధ్యయనం చేయనుంది. భారీ వర్షాలు, వరదలు మిగిల్చిన నష్టంపై ఓ అంచనాకు వస్తారు. అనంతరం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సహా ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.

ఇవీ చదవండి: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు

డిప్యూటీ కలెక్టర్​కు చేదు అనుభవం.. నడిరోడ్డుపై చితకబాదిన భార్యాభర్తలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.