ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు

author img

By

Published : Jul 21, 2022, 6:17 PM IST

Updated : Jul 21, 2022, 7:52 PM IST

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదు: హైకోర్టు

18:16 July 21

వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఉత్తర్వులు

high court on Plaster Of Paris Idols: వినాయక విగ్రహాల తయారీ, నిమజ్జనంపై స్పష్టతనిస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్​తో విగ్రహాల తయారీపై నిషేధం లేదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. పీవోపీ విగ్రహాలపై నిషేధం విధిస్తూ.. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి గతేడాది మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మార్గదర్శకాలను సవాల్ చేస్తూ గణేశ్​ మూర్తి కళాకార్ సంఘ్ దాఖలు చేసిన పిటిషన్​పై సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎస్.నంద ధర్మాసనం విచారణ చేపట్టింది.

శాస్త్రీయ అధ్యయనం లేకుండా సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది దుర్గాప్రసాద్ వాదించారు. పీవోపీపై నిషేధం లేదని.. అలాంటప్పుడు కేవలం విగ్రహాల తయారీలో వినియోగించొద్దని చెప్పడం సమంజసం కాదన్నారు. జీహెచ్ఎంసీ బేబీ పాండ్లను సరిగా నిర్వహించలేక.. పీవోపీ విగ్రహాల తయారీ, విక్రయాలు నిలిపి వేయాలని కళాకారులపై దాడి చేస్తోందన్నారు. కొవిడ్​కు ముందు తయారు చేసిన విగ్రహాలనైనా విక్రయించేందుకు అనుమతివ్వాలని కోరారు.

ఉపాధి దెబ్బతినేలా ఉత్తర్వులు ఇవ్వలేం..: వాదనలు విన్న ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీపీసీబీ మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ.. పీవోపీ విగ్రహాలను నిషేధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వలేదని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల మేరకు మార్చి వరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. ప్రభుత్వం ఇప్పటి వరకు జీవో ఇవ్వలేదని తెలిపింది. ఫలితంగా ప్రస్తుతం నిషేధం లేనందున.. కొందరి ఉపాధి దెబ్బతినేలా ఉత్తర్వులు ఇవ్వమని హైకోర్టు స్పష్టం చేసింది.

నదులు, సముద్రాలు లేకపోవడం వల్లే సమస్య..: అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్​సాగర్​లో మాత్రం నిమజ్జనం చేయరాదని ధర్మాసనం స్పష్టం చేసింది. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసే బేబీ పాండ్లలోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. బేబీ పాండ్లలో నిమజ్జనం చేసి.. వెంటనే తొలగించేలా ఏర్పాటు చేయాలని తెలిపింది. హైదరాబాద్​లో నదులు, సముద్రాలు లేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తుతోందని పేర్కొంది. దుర్గామాత పూజ, నిమజ్జనంపై పశ్చిమ బంగాల్​ ప్రభుత్వం మార్గదర్శకాలను పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది.

కొత్త అంశాలు తెరపైకి తేవొద్దు..: కనీసం విగ్రహాల ఎత్తును నియంత్రించేలా ఉత్తర్వులు ఇవ్వాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు.. కొత్త అంశాలను తెరపైకి తేవద్దని వ్యాఖ్యానించింది. సీపీసీబీ మార్గదర్శకాల చట్ట బద్ధతను తుది విచారణలో తేలుస్తామంటూ విచారణను వాయిదా వేసింది.

ఇవీ చూడండి..

Plaster Of Paris Idols: ప్లాస్టర్​ ఆఫ్​ పారిస్​పై నిషేధం... మరి మేమెలా బతకాలి?

CCTV Video: పెట్రోల్​ బంక్​లోకి దూసుకొచ్చిన బస్సు

Last Updated :Jul 21, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.