ETV Bharat / state

Roads Damaged in Jagtial : ఆ రోడ్లపై ప్రయాణమంటే.. నరకం చూడాల్సిందే..!

author img

By

Published : Jul 21, 2023, 3:17 PM IST

Damage Roads
Damage Roads

Roads Damaged in Jagtial Due to Rains : రాష్ట్రంలో గత 6 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రోడ్లను ఛిద్రం చేశాయి. నీళ్లు నిలిచి.. పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. గుంతల దారుల్లో ప్రయాణం.. వాహనదారులకు నరకం చూపిస్తోంది. మరమ్మతులు చేపట్టకపోవడంతో ప్రజలు నరకం చూస్తున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. గతంలో భగీరథ పైపులైన్ల కోసం రోడ్డును తవ్వి అలాగే వదిలేయటంతో పట్టణంలోని రోడ్లు మరింత అధ్వానంగా మారాయని స్థానికులు వాపోతున్నారు.

Jagtial Rains News : అక్కడ రోడ్లపై నడవాలంటే నరకమే. అడుగు అడుగుకో గుంత.. ఎక్కడ జారి పడతామోననే భయం. మిషన్​ భగీరథ పైపుల కోసం రోడ్డును తవ్వి వదిలేశారు. మూడున్నర సంవత్సరాల నుంచి నాయకులు, అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిస్తే చాలు.. తమ కష్టాలు రెట్టింపు అవుతున్నాయని వాపోతున్నారు.

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పురపాలక సంఘం పరిధిలో రోడ్లన్నీ అధ్వానంగా మారాయి. మూడున్నర ఏళ్ల నుంచి మిషన్ భగీరథ పనులు నడుస్తుండటంతో పైపులైన్ల కోసం రోడ్లన్నీ తవ్వి అలాగే వదిలేశారు. పట్టణంలో ఏ రోడ్డు చూసినా గుంతలతో దర్శనమిస్తోంది. ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ బురదమయంగా మారాయి. గుంతలలో నీరు నిండి ప్రమాదకరంగా తయారయ్యాయి. చిన్నారులు, వృద్ధులు.. బురద రోడ్లపై జారిపడి గాయాల పాలవుతున్నారు. ఏటా అభివృద్ధి పేరిట రూ.లక్షల నిధులు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. రోడ్లు మాత్రం బాగు చేయట్లేదంటూ పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

"అభివృద్ధి పనుల కోసం రోడ్లను తవ్విన మాట వాస్తవమే. గత మూడు సంవత్సరాలుగా మిషన్​ భగీరథ పనులు జరుగుతున్నాయి. కొన్ని రోడ్లకు స్వల్పంగా మరమ్మతులు నిర్వహించాం. మరికొన్ని అలానే ఉంచవలసి వచ్చింది. అందువల్ల భారీ వర్షాల ధాటికి ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రమాద స్థాయిని బట్టి అక్కడక్కడ తాత్కాలిక చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరిస్తాం."- జగదీశ్వర్ గౌడ్, పురపాలక కమిషనర్

అధికారుల నిర్లక్ష్య వైఖరి : చిన్నపాటి చినుకు పడినా చాలు రోడ్డంతా బురుద మయమై నడవడానికి నరకం కనిపించేలా చేస్తుంది. బురద గుంతలో ఉన్న రోడ్లలో రాకపోకలకు ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. పురపాలక అధికారులకు ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేరని ప్రజలు వాపోతున్నారు. గత 6 రోజుల నుంచి కురిసిన వర్షాలతో పట్టణంలోని రహదారులన్నీ బురద గుంతలమయంగా తయారై.. వచ్చిపోయే వారికి నానా అవస్థలు తెచ్చి పెడుతున్నాయి. ఇంత జరుగుతున్నా.. పురపాలక అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకవర్గం పట్టించుకుని రహదారులకు మరమ్మతులు చేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని ప్రజలు వేడుకుంటున్నారు.

"ఈ రోడ్లను చూస్తుంటే మెట్​పల్లి మున్సిపాలిటీనా లేక మారుమూల గ్రామమా అన్నట్లు ఉంది. రోడ్ల సమస్యలపై ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇకనైనా నాయకులు, అధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కారం చూపాలి."- స్థానికులు

రోడ్లు తవ్వారు.. మరమ్మతులు మరిచారు

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.