ETV Bharat / state

Jagtial: ఆ మెడికల్ కళాశాలకు వరుసగా రెండో ఏడాది జాతీయ వైద్య మండలి అనుమతి

author img

By

Published : May 1, 2023, 10:56 AM IST

Jagtial
Jagtial

Jagtial Medical College Latest Update: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన జగిత్యాల వైద్యకళాశాలకి అన్ని వసతులు సమకూరుతున్నాయి. రాష్ట్రంలో తొలిసారిగా వరుసగా రెండో ఏడాది జాతీయ వైద్య మండలి అనుమతి లభించడంతో విద్యార్థుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మంచివిద్యతో పాటు ల్యాబ్‌ వంటి మౌలిక వసతులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jagtial Medical College Latest Update: ప్రతిజిల్లాకు ఒక వైద్యకళాశాల ఉండేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో 2022-23 సంవత్సరానికి రాష్ట్రంలో ఒకేసారి 8 వైద్యకళాశాలలను ప్రారంభించారు. అందులోభాగంగా... జగిత్యాల జిల్లా ధరూర్‌ క్యాంపులో 28 ఎకరాల విస్తీర్ణంలో వైద్యకళాశాల ఏర్పాటుచేశారు. గతంలోని భవనాలను వాడుకుంటూ తరగతులను కొనసాగిస్తున్నారు. తొలిబ్యాచ్‌లో 150 మంది విద్యార్థులతో... గత అక్టోబర్‌లో కోర్సులు ప్రారంభమయ్యాయి.

ఒక్కో విద్యార్థికి ఐదు కుటుంబాల ఆరోగ్య పరిశీలన: వైద్యకళాశాలలో 86 మంది టీచింగ్‌, 65 మంది నాన్‌ టీచింగ్‌ సిబ్బంది, 140 మంది ఇతర సిబ్బంది ఇప్పటికే విధుల్లో చేరారు. ప్రస్తుతం అక్కడ విశాలమైన తరగతిగదులు, చదువుకునేందుకు అనుకూలంగా లైబ్రరీ, క్రీడామైదానం, వసతిగృహం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయటంతో విద్యార్థుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. వైద్య విద్య కోసం గ్రామీణ ప్రాంతవాసులు పట్టణాలకు, నగరాలను పరుగులు తీయాల్సిన అవసరం లేకుండా.. ఈ మెడికల్ కళాశాలలో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కళాశాలలో జాతీయ వైద్య మండలి పరిశీలనతో సీట్లు పెంచారు. ఒక్కో విద్యార్థికి ఐదు కుటుంబాల ఆరోగ్య పరిశీలన అప్పజెప్పారు. సరికొత్త పరికరాలతో ల్యాబ్​ను అందుబాటులోకి తీసుకువచ్చారు.

చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం కోసం చక్కటి సౌకర్యాలు: ప్రభుత్వం ప్రారంభించిన ఆ కాలేజీ వల్ల పేదలు... వైద్యవిద్య అభ్యసించేందుకు అవకాశం కలిగిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ కలను సాకారం చేసుకోవడానికి... ప్రభుత్వం తోడ్పాటు ఎంతో ఉపయోగపడుతుందంటున్నారు. చదువుతో పాటు క్రీడలు, వ్యాయామం కోసం చక్కటి సౌకర్యాలు కల్పించినట్లు కళాశాల వైస్‌ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డేవిడ్‌ తెలిపారు. రాష్ట్రప్రభుత్వం అందిస్తున్న సహకారంతో... వైద్యవిద్యలో రాణిస్తామంటూ విద్యార్థులు ధీమాగా చెబుతున్నారు.

'ఎన్​ఎంసీ( నేషనల్ మెడికల్ కౌన్సిల్) నుంచి కొత్తగా వచ్చిన మెడికల్ కళాశాలలో జగిత్యాల కాలేజీకి రెండోసారి అనుమతి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. కాలేజీలో ఉన్నటువంటి సౌకర్యాలు చాలా చక్కగా ఉన్నాయి. మొదటి బ్యాచ్​ కోసం 150 మందికి పర్మిషన్ రాగా.. ఈసారి కూడా 150 మందికి అనుమతి వచ్చింది. ప్రైవేటు కళాశాలలకు ధీటుగా అన్ని వసతులతో ఈ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి స్టూడెంట్​కి చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న ఐదు కుటుంబాల ఆరోగ్య పరిశీలన అప్పజెప్పాం. ఐదు సంవత్సరాల వరకు వారు ఆ కుటుంబాల ఆరోగ్య పరిస్థితిని గమనిస్తుంటారు.'-డాక్టర్‌ డేవిడ్‌, కళాశాల వైస్‌ ప్రిన్సిపల్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.