ETV Bharat / state

'బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు రెండు పడక గదుల ఇళ్లను అమ్ముకుంటున్నారు'

author img

By

Published : Mar 3, 2023, 5:28 PM IST

Updated : Mar 3, 2023, 7:32 PM IST

Bandi Sanjay
Bandi Sanjay

Bandi Sanjay comments on KCR: సీఎం కేసీఆర్​పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయకపోవటంతో కిసాన్‌ సమ్మాన్‌ నిధులను బ్యాంకులు రైతులకు ఇవ్వట్లేదని ఆరోపించారు. ఉపాధి నిధుల మళ్లింపుపై కేంద్రం లేఖ రాస్తే జవాబు ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు రెండు పడక గదుల ఇళ్లు అమ్ముకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు.

'బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు రెండు పడక గదుల ఇళ్లను అమ్ముకుంటున్నారు'

Bandi Sanjay comments on KCR: ముఖ్యమంత్రి కేసీఆర్​పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. తల్లిని చంపి ఫొటోకు దండేసే తీరుగా కేసీఆర్ వ్యవహారం ఉందని ఆరోపించారు. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెబుతూనే ముఖ్యమంత్రి.. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడూ హాజరు కాలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులైన కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్లను కేసీఆర్ అవమానించారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా రాంసాగర్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో రైతు రుణమాఫీ చేయకపోవటంతో కిసాన్‌ సమ్మాన్‌ నిధులను.. అన్నదాతలకు బ‌్యాంకులు ఇవ్వట్లేదని బండి సంజయ్​ ఆరోపించారు. ఉపాధి హామీ డబ్బులు దారి మళ్లిస్తున్నారని కేంద్రం ప్రభుత్వానికి లేఖ రాస్తే.. కనీసం సంజాయిషీ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రం నిధులను దారి మళ్లించటంతోనే దాదాపు రూ.150 కోట్ల నిధులు తిరిగి వెళ్లిన దుస్థితి ఉందని తెలిపారు. కేంద్రం 8 ఏళ్లుగా ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ.24,000 కోట్లు ‌అందించిందని బండి సంజయ్​ తెలిపారు.

బీఆర్​ఎస్ ఎమ్మెల్యేలు రెండు పడక గదుల ఇళ్లను అమ్ముకుంటున్నారని బండి సంజయ్​ ఆరోపించారు. రాష్ట్రంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. సర్పంచులను కాదు.. పరిపాలన సరిగ్గా చేయని కేసీఆర్​ను సస్పెండ్‌ చేయాలని విమర్శించారు. గ్రామాల్లో సర్పంచ్​లకు.. ఎంపీపీలకు, జడ్పీటీసీలకు మధ్య ముఖ్యమంత్రి తగవు పెట్టారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తున్నామని సీఎం చెబితే.. ప్రజలు నవ్వుతున్నారని బండి సంజయ్​ దుయ్యబట్టారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారు: ప్రభుత్వం వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని బండి సంజయ్​ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అందరికీ అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తుందని బండి సంజయ్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమందికి మహిళలకు చోటు కల్పించారు: జగిత్యాల మాజీ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణికి మీరు ఇచ్చిన బహుమతి ఏమిటని బండి సంజయ్​ ప్రశ్నించారు. తోటి మహిళను గౌరవించకుండా వ్యవహరించారని మండిపడ్డారు. జంతర్‌ మంతర్‌ వద్ద కవిత ధర్నాను చూసి జనం నవ్వుకుంటారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఎంతమంది మహిళలకు చోటు కల్పించారని ప్రశ్నించారు. తెలంగాణలో పౌర విమాన పరిశోధన సంస్థ కోసం కేెంద్రం రూ.400 కోట్లు కేటాయించిందని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

"తల్లిని చంపి ఫొటోకు దండేసే తీరుగా కేసీఆర్ వ్యవహారం ఉంది. అంబేడ్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెబుతూనే ముఖ్యమంత్రి.. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఏనాడూ హాజరు కాలేదు. తెలంగాణ ఉద్యమకారులైన కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సార్లను కేసీఆర్ అవమానించారు." -బండి సంజయ్​, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఇవీ చదవండి: 'కేసీఆర్‌ ఏడడుగులు వేస్తే రాజ్‌భవన్‌ వస్తుంది.. ఆ ఓపిక లేకే సుప్రీంకు'

ఆసుపత్రిలో చేరిన సోనియా గాంధీ.. వైద్యుల కీలక ప్రకటన

Last Updated :Mar 3, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.