ETV Bharat / state

దిల్లీ లిక్కర్‌ స్కామ్‌.. మాగుంట రాఘవకు 10 రోజుల ఈడీ కస్టడీ

author img

By

Published : Feb 11, 2023, 5:07 PM IST

Updated : Feb 11, 2023, 6:56 PM IST

Delhi Liquorscam Case Updates
Delhi Liquorscam Case Updates

Delhi Liquorscam Case Updates: దిల్లీ మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు బాలాజీ గ్రూప్ యజమానిగా ఉన్న రాఘవరెడ్డికి కోర్టు కస్టడీ విధించింది. ఈ కేసులో రాబట్టాల్సిన ఆధారాలు, వివరాలు చాలా ఉన్నాయని.. రాఘవను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరగా.. రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతిచ్చింది.

Delhi Liquorscam Case Updates: దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన దిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో అరెస్టు చేసిన ఏపీలోని ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి కుమారుడు మాగుంట రాఘవకు రౌస్ అవెన్యూ కోర్టు కస్టడీ విధించింది. ఈడీ కోరిన 10 రోజుల కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. సౌత్ గ్రూప్ తరఫున చెల్లించిన రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారంలో రాఘవ పాత్ర ఉందని, ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ వాదనలు వినిపించింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని.. తదుపరి విచారణ కోసం రాఘవను కస్టడీకి ఇవ్వాలని కోరింది. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకున్న రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 10 రోజుల ఈడీ కస్టడీకి అనుమతిచ్చింది.

మాగుంట రాఘవకు తయారీ, హోల్‌సేల్‌ వ్యాపారం, 2 రిటైల్‌ జోన్స్‌ కూడా ఉన్నాయని విచారణ సందర్భంగా ఈడీ కోర్టుకు వివరించింది. రూ.100 కోట్ల ముడుపుల్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఈ కేసులో ఇప్పటికే శరత్‌ చంద్రారెడ్డి, విజయ్‌నాయర్‌, అభిషేక్‌, సమీర్‌, అమిత్‌ అరోరా, బినోయ్‌ అరెస్టు అయ్యారని పేర్కొంది. శరత్‌రెడ్డితో రాఘవకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపింది. ముడుపుల సమీకరణలో సమీర్‌ మహేంద్రు కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ఇండో స్పిరిట్‌ కంపెనీలో రాఘవకూ భాగస్వామ్యం ఉందని.. దీన్నుంచి ఆయనకు వాటా వెళ్తోందని పేర్కొంది. మద్యం విధానంతో లబ్ధి పొందేందుకు ముడుపులు ఇచ్చారని.. ఈ ముడుపులను హవాలా మార్గంలో చెల్లించారని కోర్టుకు వివరించింది. ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో వివరాలు పొందుపరిచామని కోర్టుకు తెలిపింది. సుమారు 30 మంది సాక్షుల వాంగ్మూలం కూడా నమోదు చేశామని వివరించింది. ఇంకా రూ.30 కోట్లకు సంబంధించిన వివరాలు తీసుకోవాల్సి ఉందని న్యాయస్థానానికి తెలిపింది. ఈ కేసులో రాబట్టాల్సిన ఆధారాలు, వివరాలు చాలా ఉన్నాయని ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు.

ఈడీకి అరెస్టు చేసే అధికారం లేదు: మాగుంట రాఘవ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. ఈడీ ఏర్పడిన ప్రత్యేక చట్ట ప్రకారం అరెస్టుకు ముందస్తు సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అరెస్టు చేస్తూ కనీసం దాఖలు చేసిన అప్లికేషన్‌ ఇవ్వలేదని, రిమాండ్ అప్లికేషన్‌ కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, దీనిపై అభ్యంతరం తెలిపిన ఈడీ తరఫు న్యాయవాది అరెస్టు చేస్తున్నట్లు నిందితుడికి ముందుగానే చెప్పినట్లు పేర్కొన్నారు. నిందితుడి సంతకాలు తీసుకున్న తర్వాతే.. కస్టడీలోకి తీసుకున్నట్లు వివరించారు. దీనికి అభ్యంతరం తెలిపిన రాఘవ తరఫు న్యాయవాది.. అదేమీ ఒకటి, రెండు పదాలు కాదు.. కొన్ని పేజీలు ఉందన్నారు. అంత పెద్ద డాక్యుమెంట్‌ ఎలా గుర్తుంచుకుంటారని ప్రశ్నించారు. అరెస్టు చేసింది పోలీసులు కానప్పుడు.. పోలీస్‌ కస్టడీ కుదరదని వాదనలు వినిపించారు. ఈడీలో పోలీసు కస్టడీ లేకపోవడంతో సీఆర్పీ చట్టం అమలవుతుందని తెలిపారు. అరెస్టు చేసే అధికారం లేనప్పుడు ఈడీ ఎలా అరెస్టు చేస్తుందన్నారు. కస్టమ్స్‌ చట్టం ప్రకారం అరెస్టు చేసే అధికారం ఉన్నా.. ఇక్కడ ఆ సెక్షన్లు లేవని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భంలో మెజిస్ట్రేట్‌ తన కస్టడీలోకి తీసుకోవచ్చు లేదా జ్యుడిషియల్‌ కస్టడీకి పంపాలని రాఘవ తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు.

‘‘జీఎస్‌టీ చట్టం తరహాలోనే.. ఈడీ చట్టం కూడా ఉంది. ఒకవేళ అరెస్టు చేస్తే.. 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టాలి. మేజిస్ట్రేట్ అయితే తన కస్టడీలో ఉంచాలి లేదా జ్యుడిషియల్ కస్టడీకి పంపాలి. అంతే కానీ, ఈడీ కస్టడీకి తీసుకునే అధికారం లేదు. తాతలు, తండ్రుల నుంచి జరుగుతున్న వ్యాపారం కొనసాగించడంలో తప్పు ఏముంది? అదే సందర్భంలో.. కుటుంబంలో మరొకరు రిటైల్ వ్యాపారం చేయకూడదా? ఇప్పటికిప్పుడు ఈడీ విచారణ మొదలు పెట్టలేదు. జరుగుతున్న విచారణలో అరెస్టు చేసే అధికారం ఈడీకి లేదు. తప్పు అంశాలను ఈడీ రుద్దుతోంది’’ అని రాఘవ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. గతంలో పలు కేసుల సందర్భంగా.. అధికారులు నిందితుడిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించే అధికారం ఉందని ఈడీ తరఫు న్యాయవాది తెలిపారు. తగిన పత్రాలు, ఆధారాలు ఉన్నప్పుడు ఇతర అంశాల్లో సమాచారం రాబట్టాల్సి ఉన్నప్పుడు నిందితుడిని కనీసం 9 రోజులు కస్టడీకి తీసుకోవచ్చని ఒక జడ్జిమెంట్ ఉందని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈడీ వాదనలను పరిగణనలోకి తీసుకుని రాఘవను 10 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది.

ఇవీ చదవండి:

దిల్లీ లిక్కర్ స్కామ్.. వైసీపీ ఎంపీ కుమారుడు అరెస్టు

దిల్లీ లిక్కర్ స్కామ్.. మరొకరిని అరెస్టు చేసిన ఈడీ

Last Updated :Feb 11, 2023, 6:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.