ETV Bharat / state

త్రివిధ దళాల్లో...త్రిబుల్‌స్టార్‌

author img

By

Published : Mar 5, 2020, 6:51 PM IST

womens day special story etv bharat
త్రివిధ దళాల్లో...త్రిబుల్‌స్టార్‌

బలంగా అనుకో...అయిపోతుంది’... అనే మాట మాధురి కనిత్కర్‌కు సరిగ్గా సరిపోతుంది. వైద్యవృత్తి స్వీకరించాలనుకున్నారు. స్వీకరించారు. సైన్యంలోనే సేవలందించాలనుకున్నారు. అందించారు. మిలటరీ నేపథ్యం ఏ మాత్రం లేని సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఆమె త్రివిధ రక్షణ దళాల వైద్య విభాగానికి డిప్యూటీ ఛీప్‌గా పదోన్నతి పొందారు. దేశంలోనే ఈ హోదా సాధించిన మూడో మహిళా లెఫ్టినెంట్‌ జనరల్‌గా నిలిచారు. తాజాగా మూడు నక్షత్రాలను దక్కించుకున్న ఆర్మీ మహిళా అధికారిణిగా చరిత్ర సృష్టించారు.

అనుకున్నది సాధించాలంటే అకుంఠిత దీక్ష, అందుకు తగ్గ నిరంతర శ్రమ అవసరం. అవి రెండూ అణువణువునా నిండిన మాధురి కర్ణాటక రాష్ట్రం ధార్వాడ్‌లో చంద్రకాంత్‌ గోపాల్‌రావు, హేమలత దంపతులకు పుట్టిన ముగ్గురు ఆడపిల్లల్లో ఒకరు. తండ్రి గోపాల్‌రావు రైల్వేవిభాగంలో ఇంజినీరు. తల్లి హేమలత అప్పట్లోనే డిగ్రీ చదివారు. పెళ్లైన తర్వాత గృహిణిగా ఉంటూ, తమ ముగ్గురు ఆడపిల్లలను ఉన్నత లక్ష్యాలవైపు నడిపించారు.

నాన్నకు చెప్పకుండా..!

డాక్టర్‌ అవ్వాలన్నది మాధురి చిన్ననాటి కల. పుణెలోని ఫెర్గుసన్‌ కళాశాలలో ఇంటర్‌ చదివేటప్పుడే ఆమె స్నేహితులు కొందరు నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో ఉండేవారు. తరచూ వాళ్లను కలవడానికి అక్కడికి వెళ్లేవారు. ఆ వాతావరణం తనని బాగా ప్రభావితం చేసింది. తప్పకుండా సైన్యంలోనే వైద్యసేవలు అందించాలని నిర్ణయించుకున్నారు. ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కళాశాల(ఏఎఫ్‌ఎంసీ)లో చేరాలనుకున్నారు. అక్కడికి వెళ్లి అందులో చదివేవారితో మాట్లాడి ఎన్నో విషయాలు తెలుసుకునేవారు. ఏఎఫ్‌ఎంసీలో చేరతానంటే తొలుత వాళ్ల నాన్న ఒప్పుకోలేదు. పుణె బీజీ మెడికల్‌ కాలేజీలో చేరాల్సిన ఆమె తండ్రికి చెప్పకుండా ఏఎఫ్‌ఎంసీకి దరఖాస్తు చేశారు. సీటు వచ్చింది. ఆ తర్వాత వివరాలతో ఇంటికి ఉత్తరం రాశారు. మిలటరీ అంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని అందరూ వద్దన్నారు. అయినా ఆమె వెనక్కి తగ్గలేదు. అమ్మ తనకు మద్దతు పలకింది.. తర్వాత నాన్న ఓకే అన్నారు. అలా పీడియాట్రిషన్‌ అయ్యారు. ఆర్మీ వైద్యకళాశాలల్లో, ఆసుపత్రుల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.

"మహిళలందరూ సవ్యసాచులే. వారిలో ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం నిండుగా ఉంటాయి. వారిలోని శక్తియుక్తులను గుర్తించి, సాన పెడితే చాలు. మహిళలు అనుకున్న లక్ష్యాలను అలవోకగా సాధిస్తారు."

కొవ్వొత్తి వెలుతురులో ప్రపోజ్‌

మేజర్‌ జనరల్‌ రాజీవ్‌ కనిత్కర్‌ మాధురికి చిన్ననాటి స్నేహితుడు. పుణె మహాత్మాగాంధీ రోడ్డులో ‘ద ప్లేస్‌’ అనే రెస్టారెంట్‌ ఉండేది. అక్కడ మాధురి తన పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారు. ఆ వేడుకలోనే కొవ్వొత్తి కాంతుల్లో రాజీవ్‌ తన మనసులోని ప్రేమను బయటపెట్టారు. విషయం పెద్దలకు చెబితే... ‘ఇది ఆకర్షణ... మీ చదువు పూర్తయ్యే వరకూ మీ ప్రేమ ఇలాగే ఉంటే అప్పుడు చూద్దాం’ అన్నారు. మాది నిజమైన ప్రేమేనని నిర్ధారణకు వచ్చి మాకు పెళ్లి చేశారు. ఎన్డీఏలో కోర్సు పూర్తిచేసిన రాజీవ్‌ స్వర్ణపతకం సాధించగా, ఏఎఫ్‌ఎంసీలో రాష్ట్రపతి చేతులమీదుగా మాధురి బంగారుపతకం అందుకున్నారు.

ఇప్పటికీ ఫ్రెండ్సే..

ఇప్పటికీ ఇద్దరూ భార్యభర్తల్లాగా కంటే... స్నేహితులుగానే ఉంటారు. ఈ జంట ప్రేమకు సాక్ష్యాలు నిఖిల్‌, విభూతి. వృత్తిబాధ్యతల రీత్యా ఇద్దరూ ఎక్కువ కాలం వేర్వేరు చోట్ల పనిచేయాల్సి వచ్చేది. చాలాసార్లు మాధురి ఉద్యోగం మానేస్తానన్నా.. రాజీవ్‌ ఒప్పుకోలేదు. ఈ స్థాయికి రావడానికి తన భర్త సహకారం ఎంతో ఉందంటారామె. తనకంటే ముందే మూడు నక్షత్రాల స్థాయిని చేరుకున్న లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజీవ్‌ ఇటీవల పదవీ విరమణ పొందారు. ‘నువ్వూ నాలా పదోన్నతి పొందినప్పుడు నా టోపీ బహుమతిగా ఇస్తానన్నారు. అలాగే నా తలపై టోపీ ఉంచి గౌరవించార’ని గర్వంగా చెబుతారామె.

ఇదీ చూడండి: నిర్భయ దోషులకు డెత్​ వారెంట్​- మార్చి 20న ఉరి అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.