ETV Bharat / state

వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్లలేకపోతున్నారా? - హైదరాబాద్​ ఆలయంలో 400 ఏళ్లుగా ఉత్తర ద్వార దర్శనం!

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 13, 2023, 12:17 PM IST

Updated : Dec 22, 2023, 2:42 PM IST

Vaikunta Ekadashi 2023 : ప్రతి భక్తుడూ వైకుంఠ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలనుకుంటారు. అందుకే.. చాలా మంది తిరుమల వెళ్తారు. అయితే.. వెళ్లడం అందరికీ కుదరకపోవచ్చు. ఇలాంటి వారు హైదరాబాద్​ సమీపంలోని ఓ ఆలయంలో విష్ణుమూర్తిని ఉత్తద్వారం నుంచి దర్శించుకోవచ్చు. ఏకంగా 400 ఏళ్లుగా ఈ దర్శనం అందుబాటులో ఉంది!

Etv Bharat
Etv Bharat

Vaikunta Ekadashi 2023 at Jiyaguda Ranganatha Swamy Temple : వైకుంఠ ఏకాదశి అనగానే భక్తులకు ఠక్కున గుర్తువచ్చేది.. తిరుమల. ఆ పవిత్రమైన రోజున కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరస్వామిని ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకోవాలని భక్తులు ఆరాటపడుతారు. ఇలా దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని వేదవాక్కు. అందుకే.. భక్తులు పెద్దఎత్తున తిరుపతి వెళ్లడానికి సిద్ధమవుతుంటారు. అయితే.. తిరుమలలో ఏ విధంగానైతే వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi 2023) వేడుకలు నిర్వహిస్తారో అదే తరహాలో హైదరాబాద్ సమీపంలోని జియాగూడ రంగనాథ స్వామి ఆలయంలోనూ అంతే వైభవంగా జరుగుతాయి. ఇంతకీ ఈ ఆలయ విశిష్టత ఏంటి? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఈ టెంపుల్​లో వైకుంఠ ద్వార దర్శనం ఎప్పుడు కల్పించనున్నారు? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

ఆలయ చరిత్ర, విశిష్టత..

హైదరాబాద్‌లోని పురాతన దేవాలయాలలో జియాగూడ రంగనాథస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయం సుమారు 400 సంవత్సరాల నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయాన్ని మూసీ నది ఒడ్డున రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ద్రవిడ శైలిలో రాతితో నిర్మించారు. ఈ టెంపుల్ మూడు అంచెల రాజగోపురం కలిగి ఉంది. దేవాలయ గర్భగుడిలో రాతితో చెక్కిన శేషతల్పంపై సేదతీరుతున్న విష్ణువు అవతారుడైన శ్రీ రంగనాథస్వామి దర్శనమిస్తారు. అలాగే ఆంజనేయస్వామి, గరుడదేవుడు, లక్ష్మీదేవి (రంగనాయకి), అండాల్ అనే దేవతామూర్తుల ఆలయాలు ఉన్నాయి. గరుడ మందిరం వెనుకవైపు పంచలోహాలతో తయారుచేసిన ధ్వజస్తంభం ఉంది. గర్భగుడిపైన విష్ణుమూర్తి దశావతార చిత్రాలు చాలా చక్కగా చెక్కారు.

Vaikunta Ekadashi Speciality : వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?

ఇక ప్రతి సంవత్సరం ఈ జియాగూడ రంగనాథస్వామి దేవాలయంలో అనేక ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అందులో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు, శ్రీరామ నవమి పండగలను పురస్కరించుకుని ప్రత్యేక పూజలు జరగుతాయి. ఇక్కడ 2005 నుంచి వైకుంఠ ఏకాదశి వేడుకలను తిరుమల తరహాలో చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చి ఉత్తర ద్వారం నుంచి స్వామి వారిని దర్శించుకుంటారు. ఇక ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి ఎప్పుడొచ్చిందంటే..?

ఈ సంవత్సరం డిసెంబరు 22 శుక్రవారం రోజున ఉదయం 9 గంటల 38 నిమషాల వరకూ దశమి తిథి ఉంది. ఆ తర్వాత నుంచి ఏకాదశి తిథి ప్రారంభమై.. మరుసటి రోజు శనివారం ఉదయం 7 గంటల 56 నిముషాల వరకూ ఉంది. అయితే.. ఏకాదశిని 22న కాకుండా 23న పరిగణనలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. దీనికి కారణం ఏమంటే.. సూర్యోదయ సమయంలో ఏకాదశి తిథి ఉన్న రోజునే లెక్కలోకి తీసుకుంటారు. ఈ నేపథ్యంలో.. వేకువజాము నుంచే వైష్ణవ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. భక్తులు ఏకాదశి ఘడియలు దాటిపోకముందే ఉత్తర ద్వార దర్శనం చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​ - వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు విడుదల!

ఎన్నో ఆధ్యాత్మిక ప్రాశస్త్యాల రాశి.. పర్వదినాలకు ఆరంభం ఈ "ఏకాదశి"..!

Last Updated : Dec 22, 2023, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.