ETV Bharat / state

రేవంత్​ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు.. పోరాటానికి ప్రతిపక్షాల మద్దతు

author img

By

Published : Jan 25, 2022, 12:57 AM IST

teachers met revanth reddy
రేవంత్​ను కలిసిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు

USPC representatives met Revanth Reddy: రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల పోరాటానికి వివిధ పార్టీల నేతలు మద్దతు ప్రకటించారు. జీవో 317 కు వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు కోరుతూ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ సభ్యులు.. వివిధ పార్టీల నేతలను కలిశారు. తమ ఆందోళన కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉపాధ్యాయులకు కాంగ్రెస్​ అండగా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి భరోసా ఇచ్చారు.

USPC representatives met Revanth Reddy: రాష్ట్రంలో జీవో 317 తో జరుగుతున్న అన్యాయాలపై పోరాటం చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు. హైదరాబాద్​ జూబ్లీహిల్స్​లోని క్యాంపు కార్యాలయంలో తనను కలిసిన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులకు.. అధైర్యపడొద్దని రేవంత్‌ రెడ్డి సూచించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల కోసం తెచ్చిన 317 జీవో రద్దు కోసం తాము చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్‌ మద్దతుగా నిలవాలని రేవంత్ రెడ్డిని.. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు కోరారు. అదేవిధంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు రమ గోవర్ధన్, సీపీఎం, టీజేఎస్ నాయకులను కలిసి 317 జీవోలోని లోపాలను, ఆ జీవో అమలు తీరు, బాధిత ఉపాధ్యాయుల విజ్ఞప్తులు, పరిష్కారంలో జాప్యం తదితర అంశాలను వివరించారు. తాము కలిసిన నేతలందరూ తమ ఆందోళనలకు మద్దతు ప్రకటించారని ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు.

teachers met revanth reddy
రేవంత్​ రెడ్డితో సమావేశమైన ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ప్రతినిధులు
teachers met revanth reddy
సీపీఐ నాయకులతో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా..

317 జీవో వల్ల జరుగుతున్న అన్యాయాలను, స్థానికతను కోల్పోతున్న వైనాన్ని రేవంత్‌ రెడ్డికి సంఘాల ప్రతినిధులు వివరించారు. జీవో మార్గదర్శకాలకు అనుగుణంగా జరుగుతున్న బదిలీలు, కేటాయింపుల కారణంగా మనస్తాపం చెంది ఉద్యోగులు చనిపోతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరవడం లేదని రేవంత్‌ రెడ్డి ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర, జిల్లా విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ తిరిగినా, పోరాటాలు చేసినా ప్రయోజనం లేదని ఆరోపించారు.

కలిసికట్టుగా పోరాటం చేద్దాం

ఈ నెల 29న జిల్లా కలెక్టరేట్‌ల వద్ద చేపట్టే ధర్నాకు కాంగ్రెస్ శ్రేణుల మద్దతు ఉండాలని కోరిన ఉపాధ్యాయ సంఘాలు.. తమ పోరాటంలో భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు. ఫిబ్రవరి 5న ఇందిరాపార్క్‌ వద్ద జరిగే మహాధర్నాలో పాల్గొనాలని రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఉద్యోగులు ఎవరూ అధైర్య పడొద్దని, 317 జీవో రద్దు కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని రేవంత్‌ రెడ్డి.. ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. ఈ విషయాన్ని పార్లమెంట్​లో ప్రస్తావించడమే కాకుండా ప్రధానమంత్రి, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఫిబ్రవరి 5న హైదరాబాద్​కు విచ్చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీల బృందం అపాయింట్​మెంట్ కోరతామని తెలిపారు. 13న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతిని కూడా కలిసే ప్రయత్నం చేస్తామని వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు మైస శ్రీనివాసులు, ఎం.రఘుశంకర్ రెడ్డి, టి. లింగారెడ్డి, యు. పోచయ్య, డి. సైదులు, సయ్యద్ షౌకత్ అలీ, ఎన్ యాదగిరి, లక్ష్మణ్ నాయక్​లు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: AP Employees Strike: 'ఇదేదో ఆషామాషీ ఉద్యమం కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.