ETV Bharat / state

TSRTC revenue losses: వామ్మో.. ఆర్టీసీకి 9నెలల్లోనే ఇన్ని కోట్ల నష్టమా!

author img

By

Published : Jan 29, 2022, 8:01 AM IST

TSRTC revenue losses
వామ్మో.. ఆర్టీసీకి 9నెలల్లోనే ఇన్ని కోట్ల నష్టమా!

TSRTC revenue losses: నష్టాల నడవాలో తెలంగాణ ఆర్టీసీ ఉంది. 9 నెలల్లో.. రూ.1,787 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తే కానీ జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

TSRTC revenue losses: ఆర్టీసీ నష్టాల బాటలోనే సాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు లాభనష్టాల లెక్కలను అధికారులు సిద్ధం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు రూ.1,787.12 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. గతఏడాది ఇదేకాలంలో రూ.1,959.69 కోట్లు రాగా.. ఈ దఫా రూ.172.57 కోట్ల నష్టం తగ్గింది. కరోనా తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం నెలవారీగా నిధులు విడుదల చేస్తే కానీ జీతాలు చెల్లించలేని పరిస్థితి. అధికారులు బ్యాంకుతో ఒప్పందం చేసుకోవడంతో ఆర్టీసీ ఖాతాలోని నిధుల నిల్వలతో సంబంధం లేకుండా ప్రతి నెలా ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో సాఫీగా జీతాలను జమ చేయడం జరుగుతోంది. జనవరిలో సంక్రాంతి సర్వీసులు నడిచినప్పటికీ ఒమిక్రాన్‌ తీవ్రతతో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో ఆదాయం పెరగలేదు.

ప్రభుత్వ చేయూతతోనే ఊరట

ఒకపక్క అప్పులు, మరోవైపు నష్టాలతో ఆర్టీసీ కుంగుతోంది. నష్టాలు, అప్పులు రూ.వేల కోట్లలో ఉన్నాయి. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వందల కోట్లలో ఉన్నాయి. ఈ పరిస్థితుల నుంచి ఆర్టీసీ గట్టెక్కాలంటే ఏకమొత్తం సర్దుబాటు ప్రాతిపదికన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని, వెయ్యి బస్సుల కొనుగోలు కోసం ఆర్థిక సహాయం చేస్తేనే ఉపశమనం కలుగుతుంది. ఛార్జీలు పెంచినా సంస్థకు ఏడాదికి రూ.700 కోట్ల నుంచి రూ.800 కోట్లకు మించి అదనపు ఆదాయం వచ్చే అవకాశం లేదని అధికారులు అంగీకరిస్తున్నారు. ఆ మొత్తంతో నష్టాల నుంచి గట్టెక్కే అవకాశం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆర్టీసీపై దృష్టి సారించి ఆర్థిక ఉపశమనం కలిగించాల్సిన అవసరం ఉంది.

..

కార్గోలోనూ అదేబాట..

పార్సిళ్లు, లగేజీలను చేరవేసే ఆర్టీసీ కార్గో నష్టాల భారాన్ని మోస్తోంది. గత అక్టోబరు వరకు రూ.13 కోట్ల మేర నష్టాలు వచ్చినట్లు సంస్థ తెలిపింది. పలు దిద్దుబాటు చర్యలతో నవంబరు, డిసెంబరు నెలల్లో లాభం వచ్చినట్లు పేర్కొంది. ప్రత్యామ్నాయ ఆదాయాలకు కార్గో సేవలను నిర్వహించాలన్నా సీఎం కేసీఆర్‌ సూచనతో 2020 జూన్‌లో కార్గో ప్రారంభించారు. ప్రభుత్వ విభాగాలన్నీ ఈ సేవలను వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే 20 సంస్థలే వినియోగించుకుంటున్నాయి. అత్యధికంగా తెలంగాణ ఫుడ్స్‌, ఆ తరువాత మహిళా, శిశు సంక్షేమ శాఖ మాత్రమే ఉపయోగించుకుంటున్నాయి. తెలంగాణ ఫుడ్స్‌, మెడికల్‌ సర్వీసెస్‌, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థలు ఆర్టీసీతో ఒప్పందం చేసుకున్నాయి. ప్రభుత్వ సంస్థలు కార్గో సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న పక్షంలో ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అంచనా.

దిద్దుబాటుతో ఆశలు

నష్టాల నుంచి బయటపడేందుకు ఆర్టీసీ చేపట్టిన దిద్దుబాటు చర్యలతో ఇప్పుడిప్పుడే ఫలితాలొస్తున్నాయి. పార్సిల్‌ ధరల్లో మార్పులు చేయటంతో పాటు బుకింగ్‌ కేంద్రాలను అవుట్‌ సోర్స్‌ చేయటం ద్వారా భారం తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 177 కార్గో కేంద్రాలను ఆర్టీసీ నిర్వహించేది. ఇటీవల కాలంలో 140 కేంద్రాలను అవుట్‌సోర్స్‌ చేశారు. దీంతో ఖర్చులు కొంత మేరకు తగ్గాయి. గడిచిన నవంబరు, డిసెంబరు నెలల్లో సగటున రూ.30 లక్షల చొప్పున లాభం వచ్చింది. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత మెరుగుపడుతుందని అధికారులంటున్నారు. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీసీ మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు కోరగా గత ఏడాది నష్టాల వివరాలను సంస్థ తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నమోదైన నష్టాల వివరాలు (రూ.కోట్లలో..)

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.