ETV Bharat / state

గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియపై గందరగోళం

author img

By

Published : Dec 24, 2022, 6:58 AM IST

Group-4 Notification: లక్షలాది మంది ఎదురుచూస్తున్న గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తుల ప్రక్రియపై గందరగోళం నెలకొంది. మూడు వారాల ముందుగానే ప్రకటన జారీ చేసిన టీఎస్​పీఎస్సీ చెప్పినట్లుగా శుక్రవారం దరఖాస్తు ప్రక్రియ మాత్రం ప్రారంభించలేకపోయింది. సాంకేతిక కారణాల పేరిట ఈనెల 30కి వాయిదా వేసింది. జిల్లాల నుంచి సమగ్ర ప్రతిపాదనలు రాకపోవడంతోనే ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలుస్తోంది.

TSPSC
TSPSC

Group-4 Notification: గ్రూప్‌-4 ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియలో అస్పష్టత నెలకొంది. లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్నఈ ప్రక్రియను సాంకేతిక కారణాల వల్ల ఈనెల 30కి వాయిదా వేసినట్లు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. శుక్రవారం దరఖాస్తుల కోసం వెబ్‌సైట్‌ చూసిన అభ్యర్థులకు వాయిదా నోటీసు కనిపించింది. గ్రూప్-4 దరఖాస్తులు ఈనెల 30 నుంచి 2023 జనవరి 13 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు.. సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో ఉంది. మూడు వారాల ముందుగానే గ్రూప్ ప్రకటన జారీ చేసిన టీఎస్​పీఎస్సీ శుక్రవారం దరఖాస్తు ప్రక్రియను మాత్రం ప్రారంభించలేకపోయింది.

గ్రూప్-4 ప్రకటన జారీకి 33 జిల్లాలు 74 విభాగాల మధ్య సమన్వయం అవసరం. జిల్లా స్థాయి పోస్టులు కావడంతో సమగ్ర ప్రతిపాదనలు తెప్పించుకుని పరిశీలించేందుకు సమయం పడుతుంది. అయితే ఈ విషయాన్ని పట్టించుకోకుండా కమిషన్ వెంటనే ప్రకటన జారీ చేసింది. అనంతరం 23 రోజుల వ్యవధిలో ప్రతిపాదనలు తెప్పించుకుని సమగ్ర ప్రకటన జారీ చేసి దరఖాస్తులు స్వీకరించాలని భావించింది. కానీ ఇవి అందించడంలో కొన్ని ప్రభుత్య విభాగాధిపతులు జాప్యం చేశారు.

పోస్టుల హోదాలో మార్పులు ఇతర కారణాల పేరిట గురువారం రాత్రి వరకు అందించలేదు ప్రతిపాదనలకు మరో వారం సమయం పట్టనున్నట్లు తెలిసింది. ప్రతిపాదనల్లో జాప్యం జరిగితే గ్రూప్-4 నుంచి ఆ పోస్టులను తప్పిస్తామని టీఎస్​పీఎస్సీ వర్గాల హెచ్చరికలతో.. వీలైనంత త్వరగా పంపిస్తామని సంబంధిత విభాగాలు హామీ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో వారం తరువాత ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

ఉద్యోగాల ప్రకటనల జారీలోనూ అస్పష్టత నెలకొంది. ప్రకటన జారీకి ముందుగా అందులో ప్రకటనలో ఉద్యోగాలెన్ని? జిల్లా జోనల్‌, మల్టీ జోనల్ కింద ఎన్ని వస్తాయి? రోస్టర్ రిజర్వేషన్ల ప్రకారం ఎవరికి ఎన్ని పోస్టులు కేటాయించారు? అనే వివరాలన్నీ స్పష్టంగా పేర్కొనాలి. కానీ టీఎస్​పీఎస్సీ ఇటీవల చేస్తున్న ఉద్యోగ ప్రకటనల్లో స్పష్టత కనిపించడం లేదు. వెబ్‌నోట్ జారీ చేసి రెండు మూడు రోజుల తరువాత సమగ్ర ప్రకటన ఇస్తామని చెబుతోంది. ఇటీవల జారీ చేసిన ప్రకటనలన్నీ ఇదేవిధంగా వచ్చాయి. తాజాగా గ్రూప్-4 ప్రకటన డిసెంబరు 1న జారీ అయింది. 23న సమగ్ర ప్రకటన ఇస్తామని తెలిపింది. ఈ లెక్కన ఒక నోటిఫికేషన్‌లో సమగ్ర సమాచారం కోసం మూడు వారాలకు పైగా ఎదురుచూడాలని ఉద్యోగార్థులకు కమిషన్ పరీక్ష పెడుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.