ETV Bharat / state

TRS MLAs Buying Case: నెల రోజుల్లో ప్రభుత్వ పతనం!

author img

By

Published : Oct 29, 2022, 7:09 AM IST

నెల రోజుల్లో ప్రభుత్వ పతనం
నెల రోజుల్లో ప్రభుత్వ పతనం

AUDIO TAPS REALEASED: తెరాస ఎమ్మెల్యే ఎర కేసులో కొత్త కొత్త ట్విస్ట్​లు కనిపిస్తున్నాయి. కథ ఎటువైపు తిరుగుతుందో అర్థం కావడం లేదు. అయితే తాజాగా తెరాస ఎమ్మెల్యే ముగ్గురు నిందితులతో మాట్లాడిన రెండు ఆడియో టేప్​లు బయటపడ్డాయి. అయితే అందులో విలువైన సమాచారం ఉందని తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించిన బేరసారాలు అన్నీ ఉన్నాయి. అయితే ఆ ఆడియో టేప్​ల సంభాషణలో ఏమి ఉందో చూసేద్దామా..

AUDIO TAPS VIRAL: నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం వ్యవహారంలో మరో మలుపు.. ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టారంటూ నమోదైన కేసులో నిందితులు రామచంద్రభారతి, నందుకుమార్‌, సింహయాజిలు.. తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డితో జరిపినట్లు చెబుతున్న ఫోన్‌ సంభాషణల ఆడియోలు రెండు శుక్రవారం వెలుగులోకి రావడంతో కలకలం రేగింది. మొదటి ఆడియోలో ఓ కీలకనేత పేరు ఉండగా, రెండోదాంట్లో పార్టీ మారే ఎమ్మెల్యేలకు ఇచ్చే డబ్బులు, ఈడీ, ఐటీ సహా ఎవరూ జోలికి రాకుండా చూసుకోవడంతో సహా పలు అంశాలున్నాయి.

రెండో ఆడియో పూర్తిగా ఆర్థిక లావాదేవీల చుట్టూ సాగింది. రోహిత్‌తోపాటు ఎంత మంది వస్తారు? ఎంత ఇవ్వాలి? అనే విషయాలను చర్చించారు. వాళ్లు వస్తే ప్రభుత్వం పడిపోవడం ఖాయమని చెప్పినట్లుగా ఉంది. తుషార్‌, బీఎల్‌ సంతోష్‌, నంబరు 1, 2 పేర్ల గురించీ చర్చించుకున్నారు. అయితే ఈ ఆడియోలు అనధికారికంగా వెలుగులోకి వచ్చాయి. వీటిపై నిందితులు కానీ, పోలీసులు కానీ స్పందించలేదు. ఆడియోటేపుల్లోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

.

తొలి ఆడియోలో దాగి ఉన్న సంభాషణలు..

రామచంద్రభారతి: హలో
రోహిత్‌రెడ్డి: స్వామీజీ ఎలా ఉన్నారు?

రామచంద్ర: బాగున్నాను. మీరెలా ఉన్నారు?
రోహిత్‌: జీ.. నందూజీకి, మాకు మధ్య చర్చలు జరుగుతున్నాయి. నేను ఇప్పటికే వారితో మాట్లాడాను. వారు ఒప్పుకొన్నారు.

రామచంద్ర: నాకు ఒకసారి పేర్లు ఖరారు చేస్తే సులభమైపోతుంది.
రోహిత్‌: స్వామిజీ ఇప్పుడే పేర్లు చెప్పడం కష్టం. ఇప్పటికైతే ఇద్దరు కన్‌ఫర్మ్‌ చేశారు. ఓసారి కలిసి మాట్లాడుకుంటే మంచిది.

రామచంద్ర: కచ్చితంగా కలుద్దాం. 24 వరకు నేను బెడ్‌రెస్ట్‌లో ఉంటాను. హైదరాబాద్‌ వద్దు ఇంకెక్కడైనా కలుద్దామా?
రోహిత్‌: అలా కాదు స్వామిజీ. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. మా మీద కూడా దృష్టి ఉంటుంది. మేమంతా హైదరాబాద్‌లోనే ఉంటాం కాబట్టి ఇదే అనువైన ప్రదేశం మనకు. మీరు కలవాలనుకున్న రోజు బి.ఎల్‌.సంతోష్‌జీ కూడా చార్టర్‌లో వస్తారని నందూ చెప్పారు. ఒక అరగంట మాట్లాడుకొని ముగించుకోవచ్చు.

రామచంద్ర: రేపు బీఎల్‌ సంతోష్‌తో మాట్లాడతా. బల్క్‌గా ఉంటే ఆయన వస్తారు.
రోహిత్‌: ఓకే స్వామీజీ. మనం అలాగే చేద్దాం కానీ..

రామచంద్ర: మీరు నందూజీతో ఏదైతే మాట్లాడారో అందులో ఎలాంటి సమస్యా లేదు. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకోవచ్చు.
రోహిత్‌: నందూజీ నాకు ఈ ప్రతిపాదన ఇచ్చారు. నేను ఓకే అనుకున్నా. నా రక్షణ, భవిష్యత్‌పై ఆయన హామీ ఇచ్చారు.

రామచంద్ర: కచ్చితంగా ఇదే విషయం మరోసారి మీ ముందే మాట్లాడుకుందాం. ముందు వచ్చిన వారే ముందు వరుసలో ఉంటారు. మీరు వ్యవస్థను బాగా చదివారు. అసలు విషయమేంటో కచ్చితంగా తెలుసు. అందుకే మిమ్మల్ని ప్రమోట్‌ చేయడం మాకు చాలా సులభం.

రోహిత్‌: నేను కూడా ఆసక్తిగానే ఉన్నా. ఇప్పటికే నా గురించి మీ అందరికీ తెలుసు.

రామచంద్ర: తప్పకుండా మీకు మేం మద్దతుగా ఉంటాం. మనం ఫోన్‌లో మాట్లాడుకోవడం మంచిది కాదు. ఇందులో ఎలాంటి సందిగ్ధత లేదు. మిగిలిందంతా మేం చూసుకుంటాం. మీరు ఎలాంటి ప్రతిపాదన ఇచ్చినా దాని ప్రకారమే ముందుకెళ్తాం.
రోహిత్‌: నాకేమీ తొందరలేదు. నందూయే తొందరపెడుతున్నారు.

రామచంద్ర: మునుగోడు ఎన్నిక తేదీ కంటే ముందే చేరితే మరోలా ఉంటుంది. మాకు బలమైన లీడర్‌ కావాలనుకున్నాం. నేనే నందూపై ఒత్తిడి తెస్తున్నా. 4, 5 రోజులుగా నందు నిద్ర కూడా పోవడం లేదు. మరో ఇద్దరు, ముగ్గురి పేర్లు కూడా నందూ తీసుకొచ్చాడు కానీ వద్దనుకున్నాం. ఈ నెల 26న కూర్చుంటే బాగుంటుంది. 25న అయినా ఫర్వాలేదు.

నందుకుమార్‌: ఈ నెల 25న గ్రహణం ఉంది. ఆ తర్వాత మనం ఎప్పుడు కూర్చున్నా బాగుంటుంది. మేం కూడా ఎక్కువమందిని తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. ఎలాగూ దీపావళి కూడా ఉంది.

.

రామచంద్ర: నేను ఇప్పటికే ఇద్దరికీ విషయం చెప్పాను.
నందు: ఇద్దరికీ చెప్పారా స్వామీజీ..? వాళ్లు ఈరోజు అనుకుంటున్నారు కదా.

రామచంద్ర: అవును. అందుకే దిల్లీలో ఉన్నారు. సాయంత్రం 4 గంటలకు చార్టర్‌లో అహ్మదాబాద్‌ వెళ్తున్నారు.
నందు: నంబర్‌ 2తోనా? నంబర్‌1తోనా?

రామచంద్ర: నంబర్‌2తో..
రోహిత్‌: స్వామీజీ.. ఎక్కువమందిని ప్రయత్నం చేయొద్దు. మా సీఎం గురించి మీకు తెలుసు కదా. చాలా దూకుడు స్వభావం గల వ్యక్తి. మా సీఎంకు తెలిస్తే మా పని పడతారు.

రామచంద్ర: ఆ ముగ్గురి పేర్లు నేను తెలుసుకుంటే ముందుకెళ్లడానికి మరింత సులభం. అధిష్ఠానం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ ఉంది. మనం ఈ నెల 26న కూర్చొని మాట్లాడుకుందాం. ఎవరెవరు ఓకే అన్నారో నంబర్‌2 ఎదుట పేర్లు చెబుతారా?
రోహిత్‌: నంబర్‌2 ఎదుట పేర్లు చెప్పడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. ప్లీజ్‌.. ప్లీజ్‌.. ఈ విషయం బయటకు రావొద్దు.

రామచంద్ర: మీకు ఈడీ నుంచి ఐటీ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ భద్రత, భవిష్యత్‌ అంతా కేంద్రం చూసుకుంటుంది. మా సంస్థలో సంతోష్‌ చాలా కీలకం. నంబర్‌1, 2లే ఆయన ఇంటికి వస్తుంటారు. ఆయన వారి దగ్గరకు వెళ్లరు. అది మా సంస్థలో ప్రొటోకాల్‌. ఇలాంటి విషయాలను హ్యాండిల్‌ చేయడంలో బెంగాల్‌ ఎపిసోడ్‌ మాకు మంచి అనుభవం.
నందు: స్వామీజీ మరొక్క విషయం. రోహిత్‌కు శరత్‌ చాలా దగ్గరి వ్యక్తి.

రామచంద్ర: అరబిందో ఫార్మా శరతేనా..? అది చాలా సంక్లిష్టమైన కేసు. మనం వారితో కూర్చొని డీల్‌ చేయాలి.

నందు: స్వామీజీ, మీరు వచ్చినప్పుడు వాళ్లతో మీటింగ్‌ ఏర్పాటు చేస్తాం.

రోహిత్‌: నందన్నా ఈ తప్పుడు వాగ్దానాలు వద్దు. స్వామీజీ.. అతను నాకు మంచి మిత్రుడే కానీ, ప్రస్తుతానికి ఆ విషయంలో ఇన్‌వాల్వ్‌ కాలేను.

రామచంద్ర: సరే, ఫర్వాలేదు, మనం ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిద్దాం.

రెండో ఆడియో టేప్​లో ఇలా...

నందుకుమార్‌: నిన్న ఉదయం పైలట్‌తో సమావేశం జరిగింది. దాదాపుగా ఓకే చెప్పాడు. మీకు ఏం కావాలన్నా.. చూసుకుంటామని చెప్పాను. నువ్వే మొదట వస్తే టీంలీడర్‌గా ఉంటావని చెప్పా. నాకు ఒక రేటు చెప్పండి. మిగిలిన వారికి నేను చూసుకుంటా.. అన్నాడు.

రామచంద్రభారతి: అతనికి ఎంత కావాలట?

నందు: వంద రూపాయలు ఆశిస్తున్నాడు.

రామచంద్ర: అతనితో ఎంత మంది వచ్చే అవకాశం ఉంది?
నందు: ఇప్పుడైతే అతనితో కలిపి నలుగురు వస్తారు.

రామచంద్ర: వారికీ విడిగా డబ్బులివ్వాలా?
నందు: అవన్నీ తర్వాత చర్చిద్దాం. వాళ్లు కలిసినప్పుడో.. మీరు కలిసినప్పుడో..!

రామచంద్ర: సంతోష్‌కు చెప్పడానికి నాకు ఓ స్పష్టత ఉండాలి కదా! వాళ్లు ఇంత కోరుకుంటున్నారని చెప్పాలి కదా? ఒక పనిచేస్తా. పైలట్‌ కీలకవ్యక్తి. అతనితో కలిపి నలుగురు వస్తారు. మనమేం చేద్దామని సంతోష్‌ని అడుగుతా. కాంగ్రెస్‌ నుంచి కూడా పెద్దసంఖ్యలో రావడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతాం. దాసోజును కాస్త ప్రోత్సహించండని చెబుతా.

నందు: దాసోజు ఇప్పుడు లేడు. ఈ సాయంత్రం నాలుగు గంటలకే టీఆర్‌ఎస్‌లో చేరాడు. ఇద్దరు పెద్ద వ్యక్తులైన స్వామిగౌడ్‌, భిక్షమయ్యగౌడ్‌తో కలిసి చేరాడు. అతడు తనని ప్రోత్సహించాలని చాలా రోజుల నుంచి మీకు విజ్ఞప్తి చేస్తున్నాడు. ఇక్కడ సంస్థ సరిగా లేదు. కాస్త వారికి చెప్పండి. పైలట్‌ కూడా మంచి పరిజ్ఞానం, సామర్థ్యం ఉన్న వ్యక్తి.

రామచంద్ర: ఒకటి మీకు తెలియాలి.. మనం వాళ్ల ముందు కూర్చోవడానికి ముందే ఒక స్పష్టత ఉండాలి. చిన్న విషయాలకు కూర్చోకూడదు. కమిట్‌మెంట్‌ ఇవ్వడం బండి సంజయ్‌నో, కిషన్‌రెడ్డి వంటి నాయకుల చేతుల్లోనో లేదు.
నందు: మీరు దిల్లీలో చేసేది ఇక్కడ తెలియకూడదు స్వామిజీ!

రామచంద్ర: స్టేట్‌ నుంచి బైపాస్‌ తీసుకుని నేరుగా కేంద్రమే చేస్తోంది.

నందు: ఇదంతా మునుగోడు ఉప ఎన్నిక ముందు జరగాలి. ఆ తర్వాత ఉపయోగం ఉండదు.

రామచంద్ర: మునుగోడు ఉప ఎన్నికలోపు ‘100’కు ఓకే చెప్పి వస్తానంటే నేను మాట్లాడతా. పక్కా కదా? సంతోష్‌ మూడు రోజులుగా వేచిచూసి ఇవాళే గుజరాత్‌ వెళ్లిపోయారు. రేపు ఉదయం సంతోష్‌కు మెసేజ్‌ ఇస్తా. ఆయన ఒకపని కోసం పదిరోజులు ఒకేచోట ఉండరు. చార్టర్‌లో వచ్చి వెళుతుంటారు. గుజరాత్‌ ఎన్నికల్లో ఆయన బిజీగా ఉన్నా, నేను పిలిపించా.

నందు: రేపంటే.. రేపే వస్తారు. నగరానికి వంద కిలోమీటర్ల పరిధిలో అయిదు నియోజకవర్గాలున్నాయి. చేవెళ్ల, పరిగి, కొడంగల్‌, తాండూరు ఎమ్మెల్యేల వద్దకు వెళతా.

రామచంద్ర: సరే.. సంతోష్‌తో మాట్లాడతా. రోహిత్‌, అతనితో మరో ఇద్దరు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకదా..?

నందు: హా.. కానీ తర్వాత వీరి సంఖ్య ఇంకా పెరగొచ్చు.

రామచంద్ర: సంతోష్‌ వెంటనే అమిత్‌షాతో కాన్ఫరెన్స్‌ కాల్‌ కలుపుతారు. ఒకరు లేదా ముగ్గురు అంటే అక్కడికి వెళ్లడం మంచిదికాదు ఆయన అంటుంటారు. వాళ్లనే దిల్లీకి రమ్మనండి కలుద్దామని చెబుతుంటారు. 5-6 మంది ఉంటే అప్పుడు ఇక్కడే ప్లాన్‌ చేస్తారు. సంతోష్‌ చాలా పెద్ద వ్యక్తి. మంత్రులూ అతనితో అపాయింట్‌మెంట్‌ తీసుకుంటేనే కలుస్తాడు. పెద్దసంఖ్యలో ఉంటే తప్ప అతనికి కాల్‌చేసి రమ్మనడం సాధ్యం కాదు. పేమెంట్‌తో ఎలాంటి సమస్య లేదు.

నందు: నలుగురు సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు మొత్తం పది మంది అవుతారు. పైలట్‌ కూడా ప్రత్యేకంగా సిమ్‌ తీసుకోమని చెప్పాడు.

రామచంద్ర: అది ఎంతో ముఖ్యం. సొంత నంబరుతో కాకుండా వేరే నంబరు తీసుకుని మాట్లాడడం మంచిది.
నందు: నేను ప్రామిస్‌ చేస్తున్నా. మిషన్‌ కంప్లీట్‌ అయ్యి విజయవంతమైతే.. మీరు ఆలోచించుకోండి ప్రభుత్వం పడిపోయినట్టే!

రామచంద్ర: అది నాకు తెలుసు. అదే విషయం నంబరు 2కు, సంతోష్‌కు చెప్పా. చాలా లోతుగా చర్చించాం. వాళ్లు మాత్రం పెద్దసంఖ్యలో ఉంటే బాగుంటుంది కదా అంటున్నారు.
నందు: తుషార్‌ను ఎక్కడికైనా తీసుకువస్తాను. మీరు, తుషార్‌ రండి.. ఈ ముగ్గురితో మాట్లాడండి.. ఆ తర్వాత పదిమంది వస్తారు.

రామచంద్ర: వాళ్లు తుషార్‌తో చర్చకు సిద్ధంగా ఉన్నారా..?
నందు: హా.

రామచంద్ర: తుషార్‌ అంటే నంబరు 1, 2లకు చెందిన వ్యక్తి. మొదట నేను వచ్చి చర్చిస్తా. ఒకవేళ వాళ్లు సిద్ధంగా ఉంటే తుషార్‌ను రమ్మని చెబుతా. 26వ తేదీ ఉదయం వస్తా. అంతా ఓకే అంటే.. 25న తుషార్‌కు కాల్‌ చేసి 26వ తేదీ సాయంత్రానికి రమ్మని చెబుదాం. ఆ తర్వాత 27వ తేదీన సంతోష్‌, అమిత్‌షాల అపాయింట్‌మెంట్‌ అడుగుదాం.
నందు: రోహిత్‌తో మాట్లాడాను. మిగిలిన వారికి 30 అయినా సరిపోతుందన్నారు.

రామచంద్ర: ఒకవేళ రోహిత్‌ పార్టీకి రాజీనామా చేస్తే నెల రోజుల్లో ప్రభుత్వం పడిపోతుంది. మీరు చెప్పినట్లుగా సెకండ్‌రౌండ్‌లో మాజీలను చూద్దాం. దిల్లీలోనూ ఆపరేట్‌ చేస్తున్నాం. అక్కడ కూడా 43 మంది ఉన్నారు. వారూ సభ్యత్వానికి రాజీనామా చేస్తారు.
నందు: సెక్యూరిటీ వంటి విషయాలు చూడండి..

రామచంద్ర: రఘు(రఘురామకృష్ణంరాజు)కు ఎలాంటి భద్రత కల్పించామో. అదే తరహాలో వైప్లస్‌ సెక్యూరిటీ ఉంటుంది.
సింహయాజి: జై శ్రీమన్నారాయణ.. స్వామిజీ! ఎలా ఉన్నారు..!

రామచంద్ర: బాగున్నాను. నేను 26న ఉదయం వస్తా. ఒకసారి వచ్చాక తుషార్‌కు కాల్‌ చేస్తా. సాయంత్రానికి వస్తాడు. అంతా ఓకే అయితే.. 27వ తేదీ తెల్లవారుజామున చార్టర్‌లో దిల్లీకి వెళ్దాం. వంద కోట్లు అడిగినా.. ఇబ్బంది లేదు. కలిశాక మాట్లాడతా.
సింహ: మిగిలిన ముగ్గురు వస్తారు కానీ వంద అక్కర్లేదు. ఎంతో కొంత ఇవ్వాలి.

రామచంద్ర: ఒకసారి కూర్చుంటే.. ఆ తర్వాత బీజేపీ ఎంత పెట్టుబడికైనా సిద్ధంగా ఉంది.
సింహ: నందు రక్షణ గురించి భయపడుతున్నాడు.

రామచంద్ర: ఇబ్బందేం లేదు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించడం మాకు తెలుసు.
సింహ: ఒక పోస్టు నందుకు ఇవ్వాలని నా విజ్ఞప్తి.

రామచంద్ర: సంతోష్‌తో మీటింగ్‌లో నందూ ఉంటాడు. కచ్చితంగా మంచి పోస్టు ఉంటుంది.
సింహ: ఇప్పుడు ముగ్గురు వస్తే వెనువెంటనే 15 మంది వచ్చేస్తారు.

రామచంద్ర: ఒకసారి ముగ్గురు నలుగురు రాజీనామాకు సిద్ధపడితే.. కేవలం నెల రోజుల్లో అతను ప్రభుత్వాన్ని రద్దు చేస్తాడు. ఆ సమయంలో మన పని మనం చేద్దాం. అందుకే రోహిత్‌పై పెట్టుబడి పెట్టేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడున్న సంఖ్యను రహస్యంగా ఉంచండి. ఏ స్థానిక నాయకులతోనూ చర్చించవద్దు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.