ETV Bharat / state

TAL Transformer of the Year 2021 winners: ట్రాన్స్‌ ఫార్మర్స్‌-2021 పోటీల్లో ప్రతిభ చాటిన తెలుగు విద్యార్థులు

author img

By

Published : Nov 29, 2021, 1:05 PM IST

Updated : Nov 29, 2021, 1:12 PM IST

TAL Transformer of the Year 2021 winners: తరగతి గది… విద్యను అందించే వ్యవస్థ మాత్రమే కాదు. ఒక నిండైన తరాన్ని రూపొందించే మార్గం. అలాంటి తరగతి గదిలో సామాజిక సమస్యల పట్ల విద్యార్థులు స్పందించేలా, అవగాహన కలిగేలా, పరిష్కారాలు కనుగొనేలా వారిని ప్రోత్సహించేందుకు అమెరికాలోని టచ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌, టాల్‌ స్కౌట్స్‌ (Touch-A-Life Foundation, TALScouts) విభాగాన్ని ఏర్పాటు చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించే మార్గాలను చూపిన విజేతలకు పలు రకాల ప్రోత్సాహకాలను సైతం అందిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రెండు విభాగాల్లో తృతీయ స్థానంలో నిలవడం విశేషం.

TAL Transformer of the Year 2021 winners
TAL Transformer of the Year 2021 winners

జీవితంలో గెలిచేందుకు కావల్సిన విజ్ఞానంతో పాటు, మెరుగైన సమాజాన్ని నిర్మించుకోవడానికి కావల్సిన విలువలను అందించే అద్భుత ప్రపంచం తరగతి గది. అలాంటి తరగతి గదుల్లో విద్యార్థులకు సామాజిక సమస్యల పట్ల సృహ కల్పించేందుకు అమెరికాలోని టచ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌(Touch-A-Life Foundation) ముందుకొచ్చింది. విద్యార్థులకు, సమాజానికీ మధ్య ఉండే అనుబంధానికి వారధిగా ఉండేందుకు టచ్‌ ఏ లైఫ్‌ ఫౌండేషన్‌... టాల్‌ స్కౌట్స్‌ విభాగాన్ని(TALScouts) ఏర్పాటు చేసింది. మన చుట్టూ ఉన్న సమస్యలను గుర్తించి, స్పందించి, పరిష్కరించే దిశగా టాల్‌ స్కౌట్స్‌ విద్యార్థులను ప్రోత్సహిస్తోంది. ఈ లక్ష్యం కోసం టాల్‌ స్కౌట్స్ చేపట్టిన కార్యక్రమాలు, రూపొందించిన ప్రణాళికలు మంచి ఫలితాలనే ఇస్తున్నాయి. అందులో భాగంగానే ట్రాన్స్‌ ఫార్మర్స్‌ 2021 (TAL Transformer of the Year 2021)పోటీని మొదలుపెట్టింది.

TAL Transformer of the Year 2021 winners
పోటీలో పాల్గొన్న 4 వేల మంది విద్యార్థులు..

సామాజిక సమస్యల పట్ల స్పందించేలా...

ప్రపంచవ్యాప్తంగా 22 ఏళ్ల లోపు విద్యార్థులందరికీ అందుబాటులోకి వచ్చిన కార్యక్రమమే ఈ ట్రాన్స్‌ ఫార్మర్స్‌ 2021(Transformers 2021 - TAL Scouts). సామాజిక సమస్యల పట్ల విద్యార్థులు స్పందించేలా, అవగాహన కలిగేలా, పరిష్కారాలు కనుగొనేలా ప్రోత్సహించే ఆన్‌ లైన్‌ పోటీ ఇది. ఈ పోటీ కోసం ఐక్యరాజ్య సమితి(UNO) సర్వతోముఖాభివద్ధి కోసం గుర్తించిన 17 లక్ష్యాలను ఎంచుకున్నారు. వీటినే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (Sustainable Development Goals) లేదా ఎస్​డీజీగా పేర్కొంటున్నాం.

17 సమస్యల నివారణకు మూడు మార్గాలు...

మానవ జీవితానికి శాపంగా పరిణమించిన పేదరికం, ఆకలి, అనారోగ్యం లాంటి 17 సమస్యల (17 Goals to Sustainability) నివారణే ఈ ఎస్ డీజీల లక్ష్యం. ఈ లక్ష్యాలను సాధించే ఉపాయాలతో విద్యార్థులు ముందుకు రావాల్సి ఉంటుంది. ఇందుకోసం టాల్‌ స్కౌట్స్ మూడు విభాగాలను పేర్కొంది. విద్యార్థులు తమ సృజన ద్వారా సమస్యల గురించి సమాజానికి అవగాహన కల్పించడం (advocacy), వాటి కోసం దాతలను కదిలించగలగడం (philanthropy), పరిష్కారానికి తమదైన ఓ వ్యాపార మార్గాన్ని ఆవిష్కరించడం (social entrepreneurship) అనే మూడు మార్గాలలో విద్యార్థులు తమ ఆలోచనలను ఆవిష్కరించాల్సి ఉంటుంది.

నిపుణులతో ఉచిత ఆన్​లైన్‌ చర్చలు...

ట్రాన్స్‌ ఫార్మర్స్‌-2021 ప్రకటించినప్పటి నుంచి విద్యార్థులు, విద్యాసంస్థల నుంచి మంచి ఆదరణ లభించింది. గడువు తేదీలోగా ప్రపంచవ్యాప్తంగా, నాలుగువేల మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. వారి నుంచి 300 జట్లు, తమవైన ఆవిష్కరణలతో ముందుకు వచ్చాయి. టాల్‌ స్కౌట్స్‌ పోటీ ఆసాంతం విద్యార్థులకు అండగా నిలబడింది. 17 ఎస్​డీజీలకు సంబంధించిన నిపుణులతో ఆన్​లైన్‌ చర్చలు నిర్వహించడం, దృశ్యశ్రవణ మాధ్యమాల ద్వారా సామాజిక సమస్యల మీద అవగాహన కల్పించడం… సోషల్‌ మీడియా, వెబ్‌ సైట్‌, యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ అనుమానాలను నివృత్తి చేయడం లాంటి చర్యలతో వారికి అండగా నిలబడింది. అంతేకాదు! ప్రతి జట్టుకూ ఓ నిపుణుడైన మార్గదర్శినిను అందుబాటులో ఉంచింది. ఈ ప్రక్రియ అంతా ఉచితంగా సాగడం విశేషం!

ప్రతిభలో విద్యార్థుల పోటా పోటీ...

విశ్వవిద్యాలయాల నుంచి ప్రభుత్వ పాఠశాలల వరకూ ఈ పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. వారి నుంచి తుది జట్లను ఎంపిక చేయడం అసాధ్యంగానే మారింది. ఈ ఎంపిక కోసం విశ్వవ్యాప్తంగా ఉన్న న్యాయనిర్ణేతలు ఎందరినో సంప్రదించారు. చివరికి 55 జట్లను తుది దశకు ఎంపిక చేశారు. తుది దశకు చేరుకున్న విద్యార్థులందరూ నవంబరు 27న జరిగిన ఆన్‌ లైన్ కార్యక్రమం ద్వారా… న్యాయనిర్ణేతల ముందు తమ ఆవిష్కరణల గురించి వివరించారు.

విజేతలను ప్రకటించిన న్యాయనిర్ణేతలు..

ఎట్టకేలకు అటు విద్యార్థులు, ఇటు టాల్‌ స్కౌట్స్ ఎదురుచూసిన సమయం వచ్చేసింది. నవంబరు 28న విజేతల(TAL Transformer announces winners in five categories) ప్రకటన జరిగింది. ప్రముఖ సాఫ్ట్‌ వేర్‌ సలహాదారు జె.ఎ.చౌదరి, బ్లాక్‌ చెయిన్‌ నిపుణులు జోర్డన్‌ ఉడ్స్‌, ప్రముఖ విద్యావేత్త క్రిస్‌ ఫంక్‌, అజిట్‌ రంగనేకర్‌ (డైరక్టర్‌ జనరల్‌, రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌- హైదరాబాద్‌), ప్రపంచ బ్యాంక్‌ మాజీ సలహాదారు రణదీప్‌ సుడాన్‌, టచ్‌ ఏ లైఫ్‌ బోర్డ్‌ మెంబర్‌ సాయి గుండవల్లి, టాల్‌ స్కౌట్స్‌ ఛైర్‌ పర్సన్‌ వీణ గుండవల్లి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజేతలను ప్రకటించారు.

అయిదు విభాగాల్లో ప్రకటించిన విజేతలు వీరే..

  • సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌- ఇంటర్నేషనల్‌ దిల్లీ పబ్లిక్‌ స్కూల్‌
  • సోషల్‌ ఆంత్రప్రెన్యూర్‌ షిప్‌ - ప్రకాశం ఇంజినీరింగ్‌ కాలేజ్‌
  • సోషల్‌ అడ్వికసీ – ద శ్రీరామ్‌ యూనివర్సల్‌ స్కూల్‌
  • సోషల్‌ అడ్వికసీ – హైదరాబాద్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఉమెన్‌
  • సోషల్‌ ఫిలాంత్రపీ - లిబర్టీ హైస్కూల్‌

తృతీయ స్థానంలో తెలంగాణ విద్యార్థులు...

తెలంగాణ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు రెండు విభాగాల్లో తృతీయ స్థానంలో నిలవడం విశేషం. వీరితో పాటుగా యంగెస్ట్‌ పార్టిసిపెంట్‌ అవార్డ్‌, మెంటార్‌ ఆఫ్‌ ద ఇయర్‌, లీడర్‌ అవార్డ్‌ లాంటి పలు పురస్కారాలను కూడా అందించారు. విజేతందరికీ కూడా టాల్‌ స్కౌట్స్‌ తరఫున పలు రకాల ప్రోత్సాహకాలు అందనున్నాయి. ఈ సమాజాన్ని మరింత మెరుగ్గా మార్చేందుకు ట్రాన్స్‌ ఫార్మర్స్‌ 2021 ఓ చిరు సాధనంగా మారే ప్రయత్నం జరిగిందనే ఆశతో ఈ వేడుక పూర్తయింది. ఇక నుంచి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని టాల్‌ స్కౌట్స్‌ యాజమాన్యం ప్రకటించింది.

ఇదీ చదవండి: Dharani Modules: 46 అంశాలతో జాబితా.. మాడ్యూళ్ల ఏర్పాటు తప్పనిసరి!

Last Updated : Nov 29, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.