ETV Bharat / state

Thefts in Hyderabad During Dussehra : పండక్కి ఊరెళ్తున్నారా.. దొంగలు ఊడ్చేస్తారు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

author img

By ETV Bharat Telangana Team

Published : Oct 18, 2023, 11:16 AM IST

Thefts in Hyderabad During Dussehra Festival : దసరా పండుగ సమీపిస్తోంది. భాగ్యనగరమంతా పండక్కి ఊరెళ్తోంది. పండగ సీజన్ కదా.. దొంగలకూ కొన్ని అవసరాలుంటాయి. దాని కోసం డబ్బు కావాలి. అందుకే పండుగకు ఊరెళ్లిన వారి ఇండ్లపై పడి దోచేస్తుంటారు. ఇంతకుముందు అయితే ఇలా పండుగల సమయంలో పోలీసులు ఇండ్లపై దృష్టి సారించి చోరీలు జరగకుండా చూసుకునే వారు. కానీ ఇప్పుడు ఎలక్షన్ టైం. పోలీసులంతా ఎన్నికల విధుల్లో బిజీబిజీగా ఉన్నారు. ఇంకేం ఇదే దొంగలకు మంచి టైం. ఇక దొరికినదంతా దోచేస్తారు. మీరు ఇలా ఊరెళ్లగానే మీ ఇండ్లన్నీ ఊడ్చేస్తారు. అందుకే పండక్కి ఊరెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి. మీ ఇంటిపై ఓ కన్నేసి ఉంచే ఉపాయం చేయండి. మరి అదెలా..?

Thieves Focus on Dussehra Festival Holidays
Thieves Focus on Dussehra Festival Holidays 2023

Thefts in Hyderabad During Dussehra Festival : దసరా పండుగ వచ్చిందంటే చాలు హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్ల పరిధిలోని చాలా కాలనీలు నిర్మాణుష్యంగా మారిపోతాయి. ఇదే అదునుగా భావించి అంతరాష్ట్ర, స్థానిక దొంగలు రెచ్చిపోతుంటారు. ఇప్పుడు దసరాకు తోడు.. ఎన్నికలు ఉండటంతో పోలీసులు ఎలక్షన్ విధుల్లో బిజీగా ఉంటున్నారు. ఓవైపు నగర శివారు ప్రాంతాలు, తాళం వేసిన ఇళ్లనే టార్గెట్​ చేస్తూ.. దొంగల ముఠాలు పడగవిప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలో పండక్కి ఊరెళ్లవారు కాస్త జాగ్రత్త వహించాలి.

Police Caution Against Thefts In Festival Season : హైదరాబాద్​లోని మూడు కమిషనరేట్ల పోలీసు ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. పండక్కి ఊరెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇండ్లకు తాళం వేసి.. ఇంటి సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేయాలని చెప్పారు. మరోవైపు సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ఈ మూడు కమిషనరేట్ల పరిధిలో ఏటా తొమ్మిది వేలకు పైగా చోరీలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ దసరాను సాధారణ సమయాలతో పోల్చలేమంటూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు.. రెండు చోట్ల భారీ మొత్తంలో బంగారం చోరీ

పోలీసుల అంచనా ప్రకారం.. దిల్లీ, సరిహద్దు రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు ఇప్పటికే నగరానికి చేరుకున్నాయి. గత నెల రోజుల్లో నమోదైన దొంగతనాలు వాటిలో నిందితుల డేటా సేకరించి.. సీసీఎస్​ బృందాలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. గత కొన్నేళ్లుగా నగరంవైపు కన్నెత్తి చూడని థార్​, చెడ్డీ, పార్థీ గ్యాంగ్​ తదితర కిరాతక ముఠాలు.. ఈ ఏడాది వేసవిలో వరుస చోరీలకు పాల్పడడం అలజడి రేపింది. మియాపూర్​లో చెడ్డీ గ్యాంగ్​, అల్వాల్​, బొల్లారం పోలీస్​ స్టేషన్లలో పార్థీ గ్యాంగ్​ సభ్యుడు, రాచకొండ పరిధిలోని మేడిపల్లిలో మహారాష్ట్రకు చెందిన థార్​ ముఠా వరుస చోరీలకు పాల్పడింది. ఈ ముఠాలు ప్రస్తుత సమయాన్ని అవకాశంగా తీసుకునే ప్రమాదముందని అధికారులు భావిస్తున్నారు.

Robberies in Hyderabad in Festival Season : ముఖ్యంగా అంతర్​రాష్ట్ర ముఠాల ఆనవాళ్లు ఎక్కువగా శివారు ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఎల్బీనగర్​, బాలానగర్​, మల్కాజ్​గిరి, మాదాపూర్​, రాజేంద్రనగర్​, శంషాబాద్​ జోన్ల పరిధిలోని ప్రాంతాల్లో ఎక్కువ చోరీలు జరుగుతుంటాయని తెలిపారు. శివారు ప్రాంతాలు, దూరంగా విసిరేసినట్లు ఉండే కాలనీలపైనే దొంగలు ఫోకస్​ పెట్టారని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, పాత నేరస్తులు, ఇతర రాష్ట్రాలవారిపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు.

పండక్కి ఊరెళ్లేవారు ఇల్లు గుల్ల కాకుండా ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది..

  • ఊరెళ్లాల్సి వస్తే బంగారం, వెండి ఆభరణాలు, డబ్బు బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలి.
  • కాలనీల్లో ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, డయల్​ 100కు ఫోన్​ చేయాలి.
  • ఇంటికి సెక్యూరిటీ అలారం, మోషన్‌ సెన్సార్, సెంట్రల్‌ లాక్‌ సిస్టమ్‌ ఉండే తాళం అమర్చుకోవాలి.
  • వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోవాలి. చక్రాలకు గొలుసులతో తాళం వేయడం మంచిది.
  • అపార్ట్‌మెంట్ల దగ్గర నమ్మకమైన వాచ్‌మెన్‌లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోవాలి.
  • ఇంట్లో సీసీకెమెరాలను ఆన్‌లైన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి.
  • ఇంటి ముందు చెత్త చెదారం, దిన పత్రిక, పాల ప్యాకెట్లు జమవ్వకుండా చూడాలి. ఒకవేళ ఉంటే వాటిని గమనించి దొంగలు దొంగతనాలకు వస్తారు.
  • ప్రధాన ద్వారానికి తాళం వేసినా కనిపించకుండా పరదాలు అడ్డుగా ఉంచాలి.
  • ఇంటి లోపల, బయట కొన్ని లైట్లు వేసి.. తరచూ గమనించాలని ఇరుగుపొరుగు వారికి చెప్పాలి.
  • కాలనీల్లో దొంగతనాలు అరికట్టేందుకు స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి.

Theft at Hyundai Showroom : రెచ్చిపోయిన ముసుగు దొంగలు.. వాహన షోరూమ్​లలో చోరీ

రెచ్చిపోయిన దొంగలు.. ఒకే రాత్రి 16 ఇళ్లలో చోరీ.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.