ETV Bharat / state

రాష్ట్రంలో ఉత్సాహంగా ఫ్రీడమ్​ రన్‌.. వీధివీధినా విరబూసిన స్వాతంత్ర్య స్ఫూర్తి

author img

By

Published : Aug 11, 2022, 11:38 AM IST

Updated : Aug 11, 2022, 7:39 PM IST

Freedom Run
Freedom Run

Freedom Run: స్వరాజ్య స్ఫూర్తి చాటిచెప్పేలా రాష్ట్రవ్యాప్తంగా వజ్రోత్సవ ద్విస్వప్తాహ కార్యక్రమాలు అట్టహాసంగా సాగుతున్నాయి. బానిస సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛా వాయువులు పీల్చుతున్న భారతవణి 75వసంతాలు పూర్తి చేసుకున్న వేళ... రాష్ట్ర ప్రభుత్వం రోజువారీగా నిర్వహించే ప్రత్యేక కార్యక్రమాలు అంబరాన్నంటుతున్నాయి. నాల్గో రోజు ఫ్రీడమ్‌ రన్ పేరుతో పట్టణాల వీధుల్లో.... ఊరువాడల్లో నిర్వహించిన పరుగులు ఉత్సాహంగా సాగాయి. యువత, విద్యార్థులతో కలిసి ఫ్రీడమ్ రన్‌ పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు.... స్వాతంత్ర్య స్ఫూర్తిని భవిష్యత్‌ తరాలకు అందించాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ఉత్సాహంగా ఫ్రీడమ్​ రన్‌.. వీధివీధినా విరబూసిన స్వాతంత్ర్య స్ఫూర్తి

Freedom Run: జాతీయ జెండాలతో పల్లెలు, పట్టణాలు త్రివర్ణమయ్యాయి. స్వరాజ్య నినాదాలతో వీధులన్నీ మార్మోగాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా ఉత్సాహంగా సాగిన ఫ్రీడమ్ రన్‌లు జాతీయ భావాన్ని చాటిచెప్పాయి. వజ్రోత్సవ ద్విస్వప్తాహ కార్యక్రమాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఫ్రీడమ్ రన్‌లు....స్వాతంత్ర్య స్ఫూర్తిని తట్టిలేపాయి. రాష్ట్ర ప్రభుత్వ పిలుపు మేరకు కేంద్ర రక్షణ రంగ సంస్థ డీఆర్డీఓ ఆధ్వర్యంలో కేంద్రీయ విద్యాలయ విద్యార్థులు కంచన్‌బాగ్‌లో ఫ్రీడమ్‌ వాక్‌ నిర్వహించారు. డీఆర్డీఓ చీఫ్‌ స్టేట్‌ మేనేజర్‌ గౌస్‌ మొహియుద్దీన్‌ విద్యార్థులతో కలిసి జాతీయ జెండాలు ప్రదర్శిస్తూ... ముందుకుసాగారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం నుంచి ఎల్బీనగర్‌ కూడలి వరకు నిర్వహించిన పరుగులో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్ పాల్గొన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌ కమాన్ వద్ద జరిగిన 4కే రన్‌లో సినీనటుడు నిఖిల్‌ పాల్గొన్నారు. ఓయూ పోలీస్‌ ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పరుగులో జీహెచ్​ఎంసీ డిప్యూటీ మేయర్‌ శ్రీలత పాల్గొన్నారు.

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం వద్ద నుంచి చేపట్టిన "5కే రన్‌"ను హోంమంత్రి మహమూద్‌ అలీ జెండా ఊపి ప్రారంభించారు. కేబీఆర్​ పార్కు నుంచి ప్రారంభమైన ఈ పరుగులో మంత్రి తలసాని, సీఎస్​ సోమేశ్‌కుమార్, హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్‌, పోలీసులు, విద్యార్థులు పెద్దఎత్తున పాల్గొని.. జాతీయ ప‌తాక కీర్తిని న‌లుదిక్కులా చాటాలని పిలుపునిచ్చారు.

మహబూబ్ నగర్‌లోని జిల్లా పరిషత్ మైదానం నుంచి డైట్ కళాశాల వరకూ జరిగిన ఫ్రీడం రన్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వనపర్తిలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌లో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి.... బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారే నేడు దేశాన్ని పాలిస్తున్నారని ఆరోపించారు. స్వరాజ్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో ఘనంగా నగర సంకీర్తనచేపట్టారు. భద్రాద్రి రామయ్య సన్నిధిలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. సీతారాముల చిత్రపటంతో జాతీయ జెండాలతో ఆలయ ప్రదక్షిణ, గిరి ప్రదక్షిణ చేశారు.

హనుమకొండ కలెక్టరేట్ నుంచి జేఎన్​ఎస్​ మైదానం వరకు నిర్వహించిన ఫ్రీడం రన్ లో ప్రభుత్వ చీఫ్ విప్వినయ్ భాస్కర్, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ పాల్గొన్నారు. భూపాలపల్లిలోని అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన పరుగులో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో పాటు కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు. మహబూబాబాద్‌లో పోలీసులు నిర్వహించిన 2కే రన్‌ను గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. తొర్రూరులో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా చేపట్టిన ఫ్రీడమ్‌ రన్‌ను పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. పరుగులో భాగంగా విద్యార్థులు 75మీటర్ల జాతీయ పతాక ప్రదర్శన ఆకట్టుకుంది.

వజ్రోత్సవాల్లో భాగంగా బాన్సువాడలో 'ఫ్రీడమ్‌ రన్‌'లో శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం, స్థానిక థియేటర్‌లో ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి ఆయన వీక్షించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్వహించిన ఫ్రీడం రన్‌ మేయర్ సునీల్‌రావుతో కలిసి బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా దాదాపు వేయిమీటర్ల మేర జాతీయ పతాకాన్ని విద్యార్థులు ప్రదర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలను త్యాగం చేసిన యోధుల గురించి నేటి తరాలకు చెప్పాల్సిన బాధ్యత అందరిపై ఉందని గంగుల తెలిపారు.

నిర్మల్‌లోని శ్యాంఘ‌డ్ కోట నుంచి ఎన్టీఆర్​ స్టేడియం వ‌ర‌కు నిర్వహించిన పరుగులో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా థియేటర్‌లో ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి మంత్రి వీక్షించారు. ఆదిలాబాద్ పట్టణంలో నిర్వహించిన ఫ్రీడమ్ రన్ లో భాగంగా... ఇందిరా ప్రియదర్శిని క్రీడా మైదానం నుంచి జరిగిన పరుగులో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే జోగు రామన్న, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇవీ చదవండి: హైదరాబాద్‌లో తగ్గిపోతున్న గృహ అమ్మకాలు..

'సారూ.. ఈ తిండి ఎలా తినగలం?'.. నడిరోడ్డుపై ఏడ్చేసిన కానిస్టేబుల్​!

Last Updated :Aug 11, 2022, 7:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.