ETV Bharat / state

దళిత బంధుపై సదస్సు.. హుజూరాబాద్‌ వాసులకు సీఎం ఆహ్వానం

author img

By

Published : Jul 23, 2021, 4:52 AM IST

రాష్ట్రంలో దళిత బంధు పథకంపై ఈ నెల 26న తొలి అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ప్రగతిభవన్​లో జరగనున్న ఈ భేటీలో.. హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన 412 మంది ఎస్సీలు పాల్గొననున్నారు.

దళిత బంధు పథకం
దళిత బంధు పథకం

ఈ నెల 26న దళిత బంధు పథకంపై అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో పాల్గొనే వారు ఈ నెల 26న హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల నుంచి వారి వారి మండల కేంద్రాలకు ఉదయం 7 గంటలకు చేరుకుంటారు. తమ మండల కేంద్రంలో అల్పాహార కార్యక్రమం ముగించుకుని అక్కడ నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి చేరుకుంటారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి.. మొత్తం 427 మంది పలు బస్సుల్లో హైదరాబాద్​కు బయలుదేరనున్నారు.

హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళల చొప్పున మొత్తం 412 మంది ఎస్సీ పురుషులు, మహిళలు సదస్సులో పాల్గొననున్నారు. వీరితోపాటు మరో 15 మంది రిసోర్స్ పర్సన్లు ఇలా.. మొత్తం 427 మంది ఉదయం 11 గంటల వరకు హైదరాబాద్​లోని ప్రగతి భవన్​కు చేరుకుంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం, పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణతో పాటు పథకాన్ని విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల మీద సీఎం కేసీఆర్ వారికి అవగాహన కల్పిస్తారు.

పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్​లో ప్రారంభం కానున్న దళిత బంధు పథకం రాష్ట్రంలోని దళితులందరి జీవితాల్లో గుణాత్మక మార్పునకు ఏ విధంగా దోహదపడుతుంది..? పైలట్ ప్రాజెక్టును హుజూరాబాద్​లో చేపట్టిన నేపథ్యంలో చారిత్రాత్మక పథకంలో ఆ ప్రాంత బిడ్డలుగా ఎలా లీనమై పని చేయాలి..? దళితుల సామాజిక ఆర్థిక గౌరవాన్ని ఉన్నత శిఖరాల్లో నిలబెట్టే దిశగా ప్రభుత్వం అమలు పరచనున్న దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశాలు ఏమిటి? ఈ పథకాన్ని దళితుల్లోకి ఏ విధంగా తీసుకుపోవాలి..? వారి జీవితాలను వారే అభివృద్ధి చేసుకునే దిశగా ఏ విధంగా అవగాహన కల్పించాలి..? అధికారులతో ఎట్లా సమన్వయం చేసుకోవాలి..? ఎట్లా కలిసి పోవాలి..? తదితర అంశాలను కార్యక్రమానికి హాజరైన వారికి సీఎం వివరించి అవగాహన కల్పించనున్నారు.

సదస్సుకు హాజరైన వారందరికీ మధ్యాహ్నం భోజన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి సమావేశాన్ని కొనసాగించి.. సాయంత్రానికి ముగించనున్నారు.

ఇదీ చూడండి: Telangana Rains: ప్రజలెవ్వరూ ఇళ్లలో నుంచి బయటకురావద్దు: సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.