ETV Bharat / state

Revanth reddy on KCR: 'వరి వేస్తే ఉరే అన్న కేసీఆర్​.. ఫామ్​హౌజ్​లో ఎలా పండిస్తున్నారు.?'

author img

By

Published : Dec 26, 2021, 6:10 PM IST

Updated : Dec 26, 2021, 7:52 PM IST

Revanth reddy on KCR: రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత.. రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. యాసంగి ధాన్యం కేంద్రం కొన్నా కొనకపోయినా రాష్ట్రం కొనాల్సిందేనని వ్యాఖ్యానించారు. సాగు చట్టాలపై కేంద్ర మంత్రి తోమర్​ వ్యాఖ్యలను ఖండించిన రేవంత్​.. మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమైందన్నారు. రేపు ఎర్రవల్లిలో నిర్వహించబోయే రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతులను కోరారు.

revanth reddy
రేవంత్​ రెడ్డి

Revanth reddy on KCR: రైతులు పండించే ప్రతి ధాన్యం గింజా కొనే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రం కొనుగోలు చేసినా చేయకపోయినా రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. రైతులు పండించే 23 పంటలకూ కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనుగోలు చేసేది లేదని చెప్పినప్పుడు కేసీఆర్​.. ఆయన ఫామ్​ హౌజ్​లో 150 ఎకరాల్లో వరి ఎలా పండిస్తున్నారని ప్రశ్నించారు. ఆ వడ్లను ఎవరు కొంటారని నిలదీశారు. వరి వేస్తే ఉరే అని రైతులను హెచ్చరించి.. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా వరి వేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్​లో మీడియా సమావేశం నిర్వహించిన రేవంత్​.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. రేపు ఎర్రవల్లిలో జరిగే రచ్చబండ కార్యక్రమంలో... ముఖ్యమంత్రి కేసీఆర్​ వరి పొలం కూడా చూపిస్తానని రేవంత్​ అన్నారు.

ప్రతి ధాన్యం గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి: రేవంత్​

ప్రచారమే.. పరిహారం లేదు..

మూడు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని రేవంత్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్​కు ప్రచార ఆర్భాటాలు తప్ప రైతుల గోస పట్టడం లేదని ధ్వజమెత్తారు. రైతు చట్టాలపై పోరాడి మృతి చెందిన 700 మంది రైతుల కుటుంబాలకు రూ. 3 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఇప్పటి వరకూ నయాపైసా ఇవ్వలేదని ఆరోపించారు. కనీసం రైతుల వివరాలు కూడా తెలుసుకోలేదని విమర్శించారు. మోదీ ప్రభుత్వం కార్పొరేట్​ కంపెనీలకు దాసోహమైందని.. సాగుచట్టాలను తీసుకొచ్చి రైతుల హక్కులను కాలరాసిందని ధ్వజమెత్తారు. ఉత్తరాదిలో ఎన్నికలకు భయపడి రైతులకు క్షమాపణ చెప్పి, ఆ నల్ల చట్టాలను మోదీ రద్దు చేశారని ఆరోపించారు. సాగుచట్టాలు తిరిగి తీసుకొస్తామని కేంద్ర మంత్రి తోమర్‌ అన్నారన్న రేవంత్ రెడ్డి.. మళ్లా సాగు చట్టాలు తీసుకొస్తే తెరాస సర్కారు ఎటువైపు ఉంటుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఎగుమతి చేయొచ్చు..

23 పంటలకు కేంద్రం కనీస మద్దతు ధర నిర్ణయించింది. దానిని రాష్ట్రాలు అమలు చేయాలి. ఆ విషయం చట్టమే చెబుతోంది. ముడి బియ్యం, ఉప్పుడు బియ్యం మధ్య వచ్చే తేడాను భరించలేకనే రాష్ట్ర ప్రభుత్వం వరి వేయొద్దని గగ్గోలు పెడుతోంది. ఇక్కడ తయారైన వ్యాక్సిన్​ను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు ఇక్కడ పండే బియ్యం.. విదేశాలకు ఎందుకు పంపించకూడదు.? కేంద్రం అనుమతితో బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. ఛత్తీస్​గఢ్​లో రూ. 2,540 మద్దతు ధర చెల్లించి ఆ రాష్ట్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోంది. వరి కాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులకు రూ. 9000 బోనస్​ ఇస్తోంది. అక్కడ అమలయ్యే విధానం తెలుసుకుని రాష్ట్రంలో పాటించాలి.

- రేవంత్​ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఆ మాత్రం ఖర్చు చేయలేరా.?

ముడి బియ్యానికి, ఉప్పుడు బియ్యానికి తేడా 15కిలోలు ఉంటుందని... ఆ కొరతను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే రైతుల సమస్య తీరిపోతుందని రేవంత్​ సూచించారు. రూ. 2 లక్షల కోట్లు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రంలో రూ. 3 వేల కోట్లు రైతుల కోసం వెచ్చించడం కష్టమా అని ప్రశ్నించారు. తమకు రూ. పది వేల కోట్లు ఇస్తే తాము రైతుల నుంచి కనీస మద్దతు ధర రూ.1950 కి ధాన్యం కొనుగోలు చేస్తామని చెప్పారు. ఎగుమతులు చేసి లాభాలు తెస్తామని రేవంత్‌ రెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి: TRS, Congress cadres Clash: సీఎం దత్తత గ్రామంలో తెరాస, కాంగ్రెస్​ శ్రేణుల మధ్య వాగ్వాదం

Last Updated : Dec 26, 2021, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.