ETV Bharat / state

NIRANJAN REDDY: 'ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది'

author img

By

Published : Jul 30, 2021, 10:23 PM IST

'ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది'
'ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉంది'

ఆకలి దప్పుల తెలంగాణ అన్నపూర్ణగా మారడానికి ఏడేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి పేర్కొన్నారు. సాగు నీటి కల్పన, ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతన్నలకు అండగా నిలవడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని మంత్రి స్పష్టం చేశారు.

ధాన్యం సేకరణలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో ఓ సభ్యుడి ప్రశ్నకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ సమాధానం ఇచ్చిన నేపథ్యంలో మంత్రి స్పందించారు. 2020-21 ఖరీఫ్ సీజన్‌లో 141 లక్షల మెట్రిక్ టన్నులు, 2019-20 ఖరీఫ్‌ పంట కాలంలో 111.26 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తెలంగాణ నుంచి సేకరించినట్లు కేంద్రం వెల్లడించిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతో ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఆకలి దప్పుల తెలంగాణ అన్నపూర్ణగా మారడానికి ఏడేళ్లుగా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి చెప్పారు. సాగు నీటి కల్పన, ఉచిత కరెంట్‌, రైతుబంధు, రైతు బీమా పథకాలతో రైతన్నలకు అండగా నిలవడంతో సాగు విస్తీర్ణం పెరిగిందని గుర్తు చేశారు. ఏటా రూ.25 వేల కోట్లు సాగు నీటి ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు రైతుబంధు, రైతు బీమా, ఉచిత కరెంట్‌ వంటి పథకాల అమలు కోసం ప్రభుత్వం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తుందని అన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రం మారాలంటే.. 60 శాతం మంది ఆధారపడిన కీలక వ్యవసాయ రంగం బలపడాలన్న సీఎం కేసీఆర్ ముందు చూపుతోనే ఇది సాధ్యమైందని వివరించారు.

ఏకైక రాష్ట్రం తెలంగాణ..

దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో ప్రపంచంలో రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి చెప్పుకొచ్చారు. కరోనా విపత్తులోనూ రైతులు నష్టపోకూడదు.. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న రెక్కల కష్టానికి ఫలితం దక్కాలని 100 శాతం పంటలు సేకరించిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అని... ముమ్మాటికీ ఇది రైతు ప్రభుత్వమని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం, రైతాంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు.. రైతు పంటకు తగిన మద్దతు ధర దక్కాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతామని భరోసా ఇచ్చారు.

రాజ్యసభ సాక్షిగా వెల్లడైంది..

ఈ సందర్భంగా మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని రైతులకు పదే పదే విజ్ఞప్తి చేస్తున్న దృష్ట్యా పాటిస్తే బాగుంటుందని మంత్రి సూచించారు. దేశంలో ప్రత్యేకంగా రైతుల కోసం మార్కెట్ పరిశోధన విశ్లేషణ విభాగం నెలకొల్పిన ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ అని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ రంగంలో సాధించిన ప్రగతి రాజ్యసభ సాక్షిగా వెల్లడైందని మంత్రి నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: దేశంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.