ETV Bharat / state

Telangana Inflation rate 2022 : తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు

author img

By

Published : Feb 1, 2023, 8:19 AM IST

Telangana Inflation rate is High 2022-23 : ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో తెలంగాణ.. అత్యధిక ద్రవ్యోల్బణం రేటు నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధనం, వస్త్రాల ధరలేనని సర్వే స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఆర్థిక సర్వే ఈ వివరాలను వెల్లడించింది.

Central government released details of economic survey
ఆర్థిక సర్వే వివరాలను వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Telangana Inflation rate is High 2022-23 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ద్రవ్యోల్బణం రేటు విషయంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమబెంగాల్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన ఆర్థిక సర్వే ఈ వివరాలను వెల్లడించింది. ద్రవ్యోల్బణం పెరుగుదలకు ప్రధాన కారణం ఇంధనం, వస్త్రాల ధరలేనని సర్వే స్పష్టంచేసింది.

Telangana Logged Highest Inflation rate in 2022-23 : చాలా రాష్ట్రాల్లో పట్టణ ప్రాంతాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అత్యధిక ద్రవ్యోల్బణం రేటు నమోదైనట్లు పేర్కొంది. ఆహార పదార్థాల ధరల పెరుగుదలే ఇందుకు కారణమని వెల్లడించింది. హైదరాబాద్‌ మెట్రో నగరంలో స్థిరాస్తి భూం కొనసాగుతోందని సర్వే పేర్కొంది. తల్లుల మరణాలను తగ్గించడంలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉండగా, కుళాయిల ద్వారా ఇంటింటికీ రక్షిత తాగునీరు అందిస్తున్న నాలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని వెల్లడించింది. సర్వేలోని ముఖ్యాంశాలివీ..

ధరలు దంచేశాయి:

  • తెలంగాణలో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 7% ఉండగా 2022-23లో 8.5 శాతానికి పెరిగింది. గత ఏడాది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు వరకూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. సెప్టెంబరులో అత్యధికంగా నమోదయ్యాయి.

విద్యుత్‌ ఛార్జీల సవరణ:

  • ఈ ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, హరియాణా, కేరళ, అస్సాం సహా కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్‌ ఛార్జీలను పెంచాయి.
  • తెలంగాణ, తమిళనాడు, కేరళ ఆస్తిపన్ను రాబడులు పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాయి.

కర్మాగారాల్లో పనిచేసే వారిలో ఏడోస్థానం:

  • 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కర్మాగారాల్లో పనిచేసే వారి సంఖ్య పరంగా తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్ర మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ 7, ఆంధ్రప్రదేశ్‌ 9వ స్థానంలో ఉన్నాయి.
  • 2017-18తో పోలిస్తే 2020-21 నాటికి మహిళా కార్మిక శక్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్‌లో 2% పెరగ్గా, తెలంగాణలో 15% పెరిగింది.

ఎంఎంఆర్‌లో మూడోస్థానం:

  • ప్రసవ సమయంలో తల్లుల మరణాలు.. ప్రతి లక్ష ప్రసవాలకు 70 కంటే తక్కువగా ఉండాలనేది లక్ష్యం కాగా.. తెలంగాణ సహా 8 రాష్ట్రాలు దీనిని చేరుకున్నాయి. ఈ విషయంలో కేరళ (19 మరణాలు), మహారాష్ట్ర (33), తెలంగాణ (43), ఏపీ (45), తమిళనాడు (54) రాష్ట్రాలు తొలి 5 స్థానాల్లో నిలిచాయి.
  • ప్రజల వైద్యం కోసం తెలంగాణ ప్రభుత్వం చేసే వ్యయం 40.9 శాతంగా నమోదైంది.
  • తెలంగాణ, గుజరాత్‌, హరియాణా, గోవా రాష్ట్రాలు.. అండమాన్‌ నికోబార్‌ దీవులు, దాద్రానగర్‌హవేలీ, దమన్‌-దీవ్‌, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాలు వంద శాతం ఇంటింటికీ కుళాయి ద్వారా తాగునీటిని అందించే లక్ష్యాన్ని చేరుకున్నాయి.

లాజిస్టిక్స్‌లో అచీవర్స్‌ రాష్ట్రం తెలంగాణ:

  • సరకు రవాణా (లాజిస్టిక్స్‌) సులభతరం విషయంలో.. ‘సాధించిన’ రాష్ట్రాల (అచీవర్స్‌) జాబితాలో తెలంగాణ, యూపీ, తమిళనాడు, కర్ణాటక సహా 12 రాష్ట్రాలు నిలిచాయి. మిగతావి ‘వేగంగా ముందుకు’ వెళ్తున్నవి (ఫాస్ట్‌ మూవర్స్‌), ‘ఆశావహ’ రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి.

అహ్మదాబాద్‌, హైదరాబాద్‌ నగరాల్లో రియల్‌ భూం: ఇళ్ల ధరల సూచీలు హైదరాబాద్‌ సహా దేశంలోని 8 మెట్రో నగరాల్లో పెరిగాయి. హౌసింగ్‌ ప్రైస్‌ ఇండిసెస్‌ (హెచ్‌పీఐ) అసెస్‌మెంట్‌ ప్రైస్‌ సూచీ, మార్కెట్‌ ప్రైస్‌ సూచీ.. రెండింటిలోనూ అహ్మదాబాద్‌ మొదటి స్థానంలో ఉండగా తర్వాత స్థానంలో హైదరాబాద్‌ ఉంది. ‘ఇళ్ల ధరలు ఆయా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను చెబుతాయి. ధరలు- ఆర్థిక స్థిరత్వం, వృద్ధిరేటు అంచనాకు ఇళ్ల ధరల సూచికలు అద్దంపడతాయి’ అని సర్వే విశ్లేషించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.