ETV Bharat / state

పెండింగ్‌లో 7 బిల్లులు... రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించండి: గవర్నర్

author img

By

Published : Nov 7, 2022, 4:28 PM IST

Updated : Nov 7, 2022, 6:39 PM IST

తెలంగాణ గవర్నర్ మరోసారి ప్రభుత్వ తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వైఖరిపై యూజీసికి తమిళిసై ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయాల ఖాళీలు భర్తీ చేయాలని చెప్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.

Telangana Governor Tamilisai Letter to Govt on Joint Recruitment of Universities Bill
Telangana Governor Tamilisai Letter to Govt on Joint Recruitment of Universities Bill

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లుపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రాజ్‌భవన్‌కు వచ్చి బిల్లుపై చర్చించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి గవర్నర్‌ సూచించారు. ఈ బిల్లుపై అభిప్రాయం కోరుతూ యూజీసీకి సైతం గవర్నర్‌ లేఖ రాశారు.

తెలంగాణ శాసనసభ, మండలి ఇటీవల ఆమోదించిన 7 బిల్లులు ప్రస్తుతం గవర్నర్‌ వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. అందులో కీలకమైన విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బిల్లు ఒకటి. పెద్ద ఎత్తున ఉద్యోగ నియామకాలు, విశ్వవిద్యాలయాల్లోనూ అధ్యాపకుల భర్తీని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం ఉమ్మడి నియామక బోర్డును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకు అనుగుణంగా బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ, మండలిలో ఆమోదించింది. ఇప్పటివరకు గవర్నర్‌ ఆమోదం పొందకపోవడంతో ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు వీలు లేకుండా పోయింది. ఇటీవల విద్యార్థి సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లు ఆమోదంపై ఒత్తిడి వస్తోంది. రెండు రోజుల్లో బిల్లు ఆమోదించకపోతే రాజ్‌ భవన్‌ ముట్టడిస్తామని తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళిసై రాష్ట్ర ప్రభుత్వం, యూజీసీకి లేఖ రాశారు.

ఈ బిల్లు ఆమోదించడం ద్వారా ఏమన్నా న్యాయపరమైన సమస్యలు వస్తాయా? అలా జరిగితే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ప్రశ్నించారు. యూజీసీకి సైతం లేఖ రాసిన తమిళిసై.. బిల్లుపై అభిప్రాయాన్ని కోరారు. గత మూడేళ్లుగా ఖాళీలను భర్తీ చేయాలని పదేపదే చెబుతున్నా.. ఎందుకు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత 8 ఏళ్లుగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు ఉన్నప్పటికీ ఎందుకు భర్తీ చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పుడు కొత్తగా ఉమ్మడి నియామక బోర్డు తీసుకురావడం ద్వారా మళ్లీ న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయని.. నియామకాలు ఆలస్యమవుతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలు దెబ్బ తింటాయని లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి రాజ్‌భవన్‌ వచ్చి బిల్లుపై చర్చించాలని తమిళిసై సూచించారు.

ఇవీ చూడండి:

Last Updated : Nov 7, 2022, 6:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.