ETV Bharat / state

Pre Budget meet : 'ప్రత్యేక గ్రాంటుతో పాటు బాకాయిలు విడుదల చేయాలి'

author img

By

Published : Dec 31, 2021, 5:58 AM IST

Pre Budget meet
Pre Budget meet

Pre Budget meet : ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫార్సు చేసిన రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంటు ఇవ్వడంతో పాటు వెనకబడిన జిల్లాల అభివృద్ధి కింద రావాల్సిన రూ.900 కోట్ల బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. హైదరాబాద్ మినహా కేంద్ర ఆర్థికశాఖ గుర్తించిన 32 జిల్లాల్లో మౌలికవసతుల కల్పనకు నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కాళేశ్వరం లేదా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు హోదా ఇవ్వాలని, ఐటీఐఆర్ ఏర్పాటు పునరుద్ధరణ సహా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.

Pre Budget meet : వార్షిక బడ్జెట్ రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమైన కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్... ఆయా రాష్ట్రాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. వివిధ అంశాలకు సంబంధించి అభిప్రాయాలు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం... తెలంగాణకు సంబంధించిన కొన్ని అంశాలను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచింది. కొవిడ్ కారణంగా దెబ్బతిన్న ఆర్థికవ్యవస్థ తిరిగి గాడిన పడే వరకు రాష్ట్రాల రుణపరిమితి ఐదుశాతానికి పెంపును కొనసాగించాలని... పెట్టుబడి వ్యయం కోసం గత రెండేళ్లుగా అమలు చేసిన ఆర్థికసాయాన్ని మరో ఐదేళ్ల పాటు అమలు చేయాలని కోరింది. వివిధ ఉత్పత్తులపై సెస్​ల విధింపుతో రాష్ట్రాలు ఆదాయాన్ని కోల్పోతున్నాయని... సెస్​లు, సర్​ఛార్జ్​లను నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలని సూచించింది. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో రాష్ట్రాలకు స్వేచ్ఛ ఇవ్వాలని... సీఎస్ఎస్ కింద కేంద్రం నుంచి ఇచ్చే మొత్తంతో రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

బకాయిలు ఇప్పించండి..

15వ ఆర్థికసంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన రూ.723 కోట్ల రూపాయల ప్రత్యేక గ్రాంటు విడుదల చేయాలని కోరిన సర్కార్... బీఆర్​జీఎఫ్ కింద రావాల్సిన రూ.900 కోట్ల బకాయిలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు కేంద్ర ఆర్థికశాఖ వెనకబడిన జిల్లాలుగా గుర్తించిందని... ఆయా జిల్లాల్లో మౌలికవసతులు అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2014లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్​ను పునరుద్ధరించాలని, విభజన చట్టం ప్రకారం పరిశ్రమలకు పన్ను రాయతీలు ఇవ్వాలని కోరింది.

ఏదొక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి..

కాళేశ్వరం లేదా పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల్లో ఏదో ఒక ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం ఆవిర్భావమైన మొదటి ఏడాది కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రానికి రావాల్సిన రూ.495 కోట్ల రూపాయలు పొరపాటున ఏపీ ఖాతాలోకి వెళ్లాయని... అవి రాష్ట్రానికి వచ్చేలా చూడాలని కోరింది. గిరిజన విశ్వవిద్యాలయం, ఉక్కు కర్మాగారం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తదితర విభజనచట్టంలోని హామీలు పెండింగ్​లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థికశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లింది.

ఇదీ చూడండి: తెలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం పిలుపు.. ఆ అంశాలపై చర్చించేందుకే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.