ETV Bharat / state

ఆదాయపెంపు మార్గాలపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి.. వచ్చే ఏడాది లక్ష్యం ఎంతంటే?

author img

By

Published : Jan 9, 2023, 7:39 AM IST

Telangana government
Telangana government

Revenue Of Commercial Taxes Department: రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిముఖ్యమమైన వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంపుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టిపెడుతోంది. ఆ శాఖ ద్వారా ప్రస్తుతం 60 వేల కోట్లకుపైగా వస్తుండగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో రూ.10 వేల కోట్లు సమకూర్చుకునేలా కసరత్తు చేస్తోంది. జీఎస్​టీ పరిధిలోకి వచ్చే వ్యాపారుల సంఖ్య పెంచడం, రిటర్నుల దాఖలు సక్రమంగా జరిగేలా చూడటం, జీరో వ్యాపారానికి అడ్డుకట్ట వేయడం, పాతబకాయిలు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘాకు పదునుపెడుతోంది.

వాణిజ్య పన్నుల శాఖ రాబడి పెంపుపై సర్కార్‌ ప్రత్యేక దృష్టి

Revenue Of Commercial Taxes Department: వాణిజ్య పన్నులశాఖ ఆదాయపెంపు మార్గాలపై సర్కార్‌ ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 12 వాణిజ్య పన్నుల శాఖ సర్కిళ్లు ఉన్నా అత్యధిక రాబడి హైదరాబాద్, రాజధానితో ముడిపడి ఉన్న డివిజన్ల నుంచే వస్తోంది. ఆయాడివిజన్ల నుంచి వాస్తవంగా రావాల్సినంత రావట్లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. ప్రధానంగా హైదరాబాద్‌లోని అబిడ్స్, చార్మినార్‌ హైదరాబాద్‌ గ్రామీణ, పంజాగుట్ట డివిజన్లతోపాటు రాష్ట్ర సరిహద్దులు కలిగి ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్‌ డివిజన్ల నుంచి వసూళ్లు బాగా తగ్గుతున్నాయని తేల్చారు.

అంతర్రాష్ట్ర సరకు రవాణాపై నిఘా ఉండట్లేదని బాధ్యులైన అధికారులు ఉదాసీనంగా ఉండటం వల్ల రాష్ట్ర ఖజానాకు చిల్లుపడుతోందని నిర్ధారణకు వచ్చారు. ప్రధానంగా హైదరాబాద్‌ కేంద్రంగా జీరోవ్యాపారం జోరుగా సాగుతోంది, ఇతరరాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న సరకులను పన్ను చెల్లించకుండానే విక్రయిస్తుండటమే ఈ పరిస్థితికి కారణమనే అంచనాకు వచ్చారు. ముఖ్యంగా స్టీలు, ఎలక్ట్రానిక్‌ వస్తువుల విక్రయాల్లో భారీగా పన్ను ఎగవేత జరుగుతోందని తేల్చారు. నిఘా పెంపుతో పాటు అమ్మకాలపైనా ప్రత్యేక దృష్టిసారించాలని నిర్ణయానికి వచ్చారు.

పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘా: పన్ను వసూళ్లు తక్కువగా ఉన్న డివిజన్లలో ఉన్నతాధికారులను బాధ్యులను చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు. రూపంలో రాష్ట్రానికి రావాల్సిన మొత్తం వచ్చేలా చూడటంతోపాటు, పన్ను ఎగవేతదారులపై ప్రత్యేక నిఘావంటి అంశాలకు వాణిజ్య పన్నుల శాఖ పదునుపెడుతోంది. వాణిజ్య పన్నులశాఖలో మొండి బకాయిల వసూలుకు ఇప్పటికే వన్‌టైం సెటిల్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. వెయ్యి కోట్ల రాబడి లక్ష్యంగా ఆ కార్యక్రమం చేపట్టారు. కొన్ని సంస్థలు చెల్లింపులకు ముందుకొచ్చినా చివరికి చేతులెత్తేశాయి.

దీంతో లక్ష్యం నెరవేర లేదు. ఈ నేపథ్యంలో చెల్లింపులకు అంగీకరించి ఆయా సంస్థలు ఎందుకు చెల్లించడం లేదు అనేది శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని భావిస్తున్నారు. డివిజన్ల వారీగా అదనపు ఆదాయానికి ఉన్న మార్గాలపై ఉన్నతాధికారులు ఇటీవల అధ్యయనం చేశారు. జీరోవ్యాపారంతోపాటువేబిల్లుల దుర్వినియోగం, రిటర్ను దాఖలులో ఉదాసీనంగావ్యవహరించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించాలని నిర్ణయించారు.

వాహన తనిఖీలు ముమ్మరం: రిటర్నుల దాఖలు సమయంలో వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడం వల్ల వందల కోట్ల రాబడిని రాష్ట్రం కోల్పోతోందని విశ్లేషించారు. జీఎస్​టీ లైసెన్సుదారుల అక్రమాలు నిలువరించేలా వేబిల్లుల జారీ, వాహన తనిఖీలు ముమ్మరం చేయడంతోపాటు రిటర్నులు దాఖలు చేయని వారు ఎవరనేది గుర్తించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.