ETV Bharat / state

సర్కారు ఖజానాకు రాబడి... వచ్చి తీరాలి!

author img

By

Published : Jun 25, 2021, 6:50 AM IST

సర్కారు ఖజానాకు రాబడి... వచ్చి తీరాలి!
సర్కారు ఖజానాకు రాబడి... వచ్చి తీరాలి!

బడ్జెట్‌ అంచనాల మేరకు ఆదాయ సమీకరణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రతినెలా శాఖలవారీగా సమీక్షలు నిర్వహించి ప్రభుత్వ ఖజానాకు అత్యధిక రాబడి ఎలా తేవాలో చర్చించుకోనున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో నిర్దేశించుకున్న ఆదాయాన్ని సాధించడమే లక్ష్యంగా కార్యాచరణను అమలుచేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం కంటే 2021-22లో పన్నులలో రూ.16 వేల కోట్లు, పన్నేతర రాబడిలో రూ.30,557 కోట్లు అదనంగా వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఖజానాకు అత్యధిక రాబడిని తేవడంలో కీలకమైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు-రిజిస్ట్రేషన్‌, రవాణా తదితర శాఖలు లక్ష్య సాధనలో ఎలా ముందుకు వెళ్లనున్నాయో ఆర్థికమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రిమండలి ఉపసంఘానికి వివరించాయి. ప్రతినెలా శాఖలవారీగా సమీక్షించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. కొవిడ్‌ పరిస్థితుల్లో మొదటి రెండు నెలలు అంచనాలకంటే ఆదాయం తగ్గినా మున్ముందు అదనంగా పొందేలా సంబంధిత శాఖలను సన్నద్ధం చేశారు.

కొంతమేర లాక్‌డౌన్‌ ప్రభావం

వాణిజ్యపన్నులశాఖ నుంచి రూ.57,500 కోట్ల రాబడిని ప్రభుత్వం అంచనా వేసింది. ఏప్రిల్‌లో ఆదాయం లక్ష్యం మేరకు ఉంది. మే నెలలో లాక్‌డౌన్‌ ప్రభావంతో అంచనాలకంటే రూ.1,000 కోట్లు తగ్గింది. ఏప్రిల్‌లో రూ.4,675 కోట్లు రాగా మే నెలలోలో రూ.3,618 కోట్లు వచ్చింది.

జీఎస్టీ, ఐజీఎస్టీల వసూళ్లు ఏప్రిల్‌ కంటే మే నెలలో రూ.1,057 కోట్లు తగ్గాయి. పెట్రోలు అమ్మకాల ఆదాయం కూడా రూ.80 కోట్లు క్షీణించింది. మద్యం అమ్మకం ద్వారా వచ్చే పన్ను మాత్రం ఏప్రిల్‌ కంటే మే నెలలో రూ.135 కోట్లు పెరిగింది.

మంత్రిమండలి సమావేశంలో ప్రస్తావన

వాణిజ్య పన్నుల శాఖను పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఇటీవల మంత్రిమండలి సమావేశంలో రాబడులపై వివరించారు. జీఎస్టీ వసూళ్లతో పాటు పాత బకాయిల వసూళ్లు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పన్ను ఎగవేతకు అడ్డుకట్టవేయడం వంటి విధానాలను మరింత పకడ్బందీగా అమలు చేయనున్నట్లు తెలిపారు.

రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయని ధీమా

స్టాంపులు రిజిస్ట్రేషన్‌ ద్వారా రూ.12,500 కోట్లు వస్తుందని అంచనా వేయగా ఇప్పటి వరకూ రూ.1,100 కోట్లు వచ్చింది. లాక్‌డౌన్‌ ప్రభావం పడింది. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుందని, రాబోయే నెలల్లో రిజిస్ట్రేషన్లు పుంజుకుంటాయని రాబడి అంచనాల మేరకే ఉంటుందని ఆ శాఖ అధికారులు భావిస్తున్నారు.

మొదటి విడత భూముల వేలంతో రూ.3,000 కోట్ల పైనే

పన్నేతర రాబడిలో ప్రభుత్వం రూ.30,557 కోట్లు అంచనా వేయగా ఇందులో భూముల విక్రయంతో రూ.16 వేల కోట్లను లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వం ఇప్పటికే ఇందుకు శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎండీఏ ద్వారా కోకాపేట పరిధిలో 49.92 ఎకరాలు, టీఎస్‌ఐఐసీ ద్వారా 15.01 ఎకరాల వేలానికి ప్రకటనలు ఇచ్చింది. మొదటి విడత వేలంలో రూ.3,000 కోట్లకు పైగా వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. గనులు, భూగర్భవనరులశాఖ నుంచి అనుకున్నంత రావడంలేదు. అక్రమ మైనింగ్‌తో పాటు నిబంధనల ఉల్లంఘన ప్రధాన కారణాలుగా అధికారులు పేర్కొంటున్నారు. ఖనిజాలతో సుమారు రూ.3 వేల కోట్లు, ఇసుక విక్రయంతో రూ.1,300 కోట్లను ప్రభుత్వం అంచనా వేసింది. రవాణా శాఖ ద్వారా రూ.5 వేల కోట్లు వస్తుందని అంచనావేశారు.

ఇదీ చూడండి: నేటి నుంచి విధుల్లోకి ఉపాధ్యాయులు, అధ్యాపకులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.