ETV Bharat / state

Police Instructors: పోలీస్ బోధకుల కోసం సర్కార్ కసరత్తు

author img

By

Published : Apr 18, 2022, 8:26 AM IST

Police Instructors: పోలీసు ఉద్యోగాల కోసం అభ్యర్థులు పెద్దఎత్తున ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనంతరం ఇచ్చే శిక్షణపై దృష్టి సారించారు. అయితే బోధకుల కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది.

Police
Police

Police Instructors: పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఊపందుకోవడంతో తదనంతరం ఇచ్చే శిక్షణపై అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఒకేసారి 17వేల మందికి శిక్షణ ఇవ్వాలంటే అదే స్థాయిలో బోధకులు కూడా కావాలి. వీరికి పోలీసు శిక్షణలో బోధించాల్సిన అంశాలపై తర్ఫీదునివ్వాలి. ఇదంతా రోజుల తరబడి జరిగే ప్రక్రియ కాబట్టి అధికారులు ఇప్పటి నుంచే దృష్టి సారించారు. పోలీసు ఉద్యోగాలంటే దేహదారుఢ్యం, ఆయుధాలు పేల్చడం, దర్యాప్తు వంటి అనేక అంశాలను శిక్షణ కాలంలో బోధించాల్సి ఉంటుంది. 9 నెలలపాటు జరిగే శిక్షణలో పోలీసులను పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు. ఇంత పెద్ద కసరత్తు మరే ప్రభుత్వ ఉద్యోగానికీ ఉండదు.

ఖాళీలన్నీ భర్తీ!

అధికారుల అంచనా ప్రకారం భారీస్థాయిలో జరిగే నియామకాల్లో ఇదే చివరిది. భవిష్యత్తులో నియామకాలు జరిగినా ఈ స్థాయిలో మాత్రం ఉండవన్నది నిర్వివాదాంశం. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటి వరకూ రెండుసార్లు నిర్వహించిన నియామకాల ద్వారా దాదాపు 30 వేల మందిని పోలీసుశాఖలోకి తీసుకున్నారు. ఇప్పుడు సుమారు 17 వేల మంది నియామకం జరుపనున్నారు. తెలంగాణ పోలీసుశాఖ సిబ్బంది సంఖ్య 80 వేలు కాగా త్వరలోజరపబోయే నియామకాలతో దాదాపు ఖాళీలన్నీ భర్తీ అవుతాయి.

పదవీ విరమణ చేసిన వారి సేవలూ..

ఇప్పుడు ఎంపికవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక ప్రాతిపదికన బోధన సిబ్బందిని ఎంపిక చేసి వారికి తర్ఫీదు ఇవ్వాల్సి ఉంటుంది. వారి ద్వారా మరికొందరికి ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో చట్టాలు, దర్యాప్తులో వస్తున్న కొత్త మెలకువలు, సైబర్‌ నేరాల్లో కొత్త పోకడలు వంటి వాటిపై సిబ్బందిని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఇందుకోసం పోలీసుశాఖలో పనిచేస్తున్న వారితోపాటు పదవీ విరమణ చేసిన వారిని కూడా తీసుకోనున్నారు. నియామక ప్రక్రియ ఇప్పటికిప్పుడు మొదలుపెట్టినా పూర్తికావడానికి సుమారు ఆరు నెలలు పడుతుంది కాబట్టి అప్పటికల్లా బోధకులను సిద్ధం చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి : పోలీసు శాఖలో ‘జంట’ వేదన... కుటుంబాలకు దూరమై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.