ETV Bharat / state

పేపర్​ లీకేజీపై కాంగ్రెస్​ 'త్రిశూల వ్యూహం'.. నేడు తేలనున్న ఆ అంశం..!

author img

By

Published : Apr 2, 2023, 7:52 AM IST

PCC meeting in Hyderabad : టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే దిశగా కాంగ్రెస్‌ దూకుడు పెంచింది. మూడంచెల విధానంలో ముందుకెళ్తోంది. పార్టీపరంగా పోరాటం చేస్తూనే దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయడం, న్యాయపోరాటం చేయడం ద్వారా త్రిశూల వ్యూహం అనుసరిస్తోంది. ఇతర విపక్షాలను కలుపుకోవాలా లేదంటే ఒంటరిగానే పోరాడాలా అనే విషయం ఇవాళ్టి పీసీసీ భేటీలో తేల్చనున్నారు.

PCC meeting in Hyderabad
PCC meeting in Hyderabad

PCC meeting in Hyderabad : టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజి వ్యవహారంపై పోరాటాన్ని ఉద్ధృతం చేసే దిశగా కాంగ్రెస్‌ వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. ముందు నుంచి సిట్‌ దర్యాప్తుపై విశ్వాసం లేదని చెబుతూ వస్తున్న కాంగ్రెస్‌ నాయకులు సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ లీకేజిని తీవ్రంగా పరిగణించి నిరుద్యోగుల పక్షాన వాణి, బాణి గట్టిగా వినిపిస్తున్నారు. సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేదని కాంగ్రెస్‌ ఆరోపిస్తుంది. కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేయడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తలుపు తట్టింది.

మల్లు రవి ఆధ్వర్యంలో కమిటీ: సిట్‌ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఈడీ విచారించదగ్గ సెక్షన్లు ఉన్నందున తక్షణమే ఆ కేసును తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని కోరినట్లు రేవంత్‌ వెల్లడించారు. లీకేజీ అంశంలో దూకుడు పెంచేందుకు పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆధ్వర్యంలో ఉద్యమ కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. గాంధీభవన్‌లో సమావేశమైన కమిటీ బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వెళ్లి డీజీ రవిగుప్తాను కలిసి ఫిర్యాదు చేసింది. డబ్బులు చేతులు మారిన లీకేజీ వ్యవహారంలో జోక్యం చేసుకుని దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు మల్లు రవి వెల్లడించారు.

పేపర్‌ లీకేజ్‌ కేసు సీబీఐతో విచారణ జరపాలి: సిట్‌ దర్యాప్తుపై నమ్మకం లేనందున సీబీఐ గానీ సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ హైకోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఈనెల 11కు వాయిదా వేసింది. సిట్‌ విచారణ సమగ్ర నివేదిక తమకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

వైఎస్‌ షర్మిల ఫోన్‌పై చర్చ: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి ఫోన్ చేసిన వైఎస్సాఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పేపర్‌ లీకేజీ వ్యవహారంలో కలిసి పోరాడదామని కోరారు. పార్టీ సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని రేవంత్‌ తెలిపారు. ఇవాళ జరగనున్న పీసీసీ సర్వసభ్య సమావేశంలో పేపర్‌ లీకేజీ వ్యవహారంలో ఒంటరిగా పోరాడాలా..? లేదంటే కలిసొచ్చే ఇతర పార్టీలతో ముందుకెళ్లాలా అన్న అంశం తేలనుంది.

"ఇంతక ముందు సిట్‌ దర్యాప్తు చేసిన కేసుల విషయంలో నివేదిక ఇచ్చినట్లు.. వాటిపై చర్యలు తీసుకున్నట్లు ఎక్కడ జరగలేదు. అందువల్ల టీఎస్‌పీఎస్సీ కేసును సీబీఐ లేదా సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నాను." - మల్లు రవి, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు

నేడు పీసీసీ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు భేటీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.