ETV Bharat / state

వ్యాపార దృక్పథంతోనే రాజకీయాల్లోకి.. శిల్పా కుటుంబంపై భూమా అఖిల ప్రియ ఫైర్​

author img

By

Published : Feb 4, 2023, 9:58 PM IST

tdp leader bhuma akhila priya
టీడీపీ నేత భూమా అఖిల ప్రియ

Akhila priya pressmeet: ఏపీలోని నంద్యాల ఎమ్మెల్యే శిల్ప కుటుంబంపై టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయాలను వ్యాపారమయం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి అవకాశం రాకపోతే టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని దుయ్యబట్టారు.

Akhila priya pressmeet on Shilpa: ఆంధ్రప్రదేశ్​లో నంద్యాల పాలిటిక్స్​ ఆసక్తి రేపుతున్నాయి. టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప కుటుంబంపై నిప్పులు చెరిగారు. సోమవారం ఆళ్లగడ్డ పట్టణంలోని ఆమె నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయాలలో నిబద్ధత ముఖ్యమని.. అది ఉన్నవారే ప్రజలకు మేలు చేయగలరని తెలిపారు. శిల్ప కుటుంబం వ్యాపార దృక్పథంతోనే రాజకీయాల్లో కొనసాగుతోందని, అలాంటివారు తమ స్వార్థం తప్ప ప్రజల సంక్షేమం అభివృద్ధి పట్టదని పేర్కొన్నారు.

బైపాస్ వస్తుందనే 50 ఎకరాలు కొనుగోలు : 2005లో అప్పటి ఎమ్మెల్యే శిల్పా మోహన్ రెడ్డి నంద్యాల బైపాస్ రహదారి మార్గాన్ని ముందుగానే నిర్ధారించి అక్కడ ఎకరా ఐదు లక్షల చొప్పున 50 ఎకరాలను కొనుగోలు చేశారన్నారని తెలిపారు. అనంతరం నంద్యాలలో మెడికల్ కళాశాల కోసం ప్రాంతీయ రైతు శిక్షణా సంస్థ స్థలాన్ని కేటాయించారన్నారు. ఆ ప్రాంతానికి అతి సమీపంలోనే శిల్పాకు చెందిన 50 ఎకరాలు ఉండటం ద్వారా భూముల విలువను మరింతగా పెంచుకున్నారన్నారు. ప్రజలకు, రైతులకు ఉపయోగపడే ప్రాంతీయ రైతు శిక్షణ సంస్థ భూములను మెడికల్ కళాశాలకు కట్టబెట్టారని ఆమె ఆరోపించారు.

నంద్యాలలో అనేక అక్రమాలు : నంద్యాలలోని మార్కెట్ కమిటీ దుకాణ సముదాయాలను సైతం తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్న ఘనత శిల్పా కుటుంబానిదని చెప్పారు. ఈ సముదాయంలో ఒక్కో దుకాణానికి రూ.22వేలు చొప్పున ఇతర వ్యక్తులు బాడుగ చెల్లిస్తుండగా శిల్ప మాత్రం తన సొంత ప్రైవేటు సంస్థ శిల్పా సహకార్ కోసం 20 దుకాణాలు బాడుగకు తీసుకుని కేవలం నెలకు మొత్తంగా కలిపి రూ.40,000 మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. నంద్యాలలో ఇలాంటి అక్రమాలు ఎన్నో ఉన్నాయని.. రాబోయే రోజుల్లో శిల్పాకు సంబంధించిన మరిన్ని అక్రమాలను విడతల వారీగా బయటపెడతానన్నారు.

టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు : శిల్పా రవిచంద్ర రెడ్డికి వైఎస్సార్సీపీ నంద్యాల టికెట్ ఇవ్వకుంటే అతడు వెంటనే టీడీపీ పంచన చేరేందుకు సిద్ధమవుతారన్నారు. ఈ అక్రమాలపై బహిరంగ చర్చకు తాను సిద్ధమై నంద్యాలకు వెళుతుంటే పోలీసులు అక్రమంగా అడ్డుకున్నారని.. పోలీసుల అండతో బహిరంగ చర్చ నుంచి ఎమ్మెల్యే తప్పించుకున్నారన్నారు. ధైర్యం ఉంటే తాను చేసిన ఆరోపణలు తప్పని నిరూపించుకోవాలని సవాల్ చేశారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించి తనకు మాత్రమే నోటీసులు ఇచ్చి గృహ నిర్బంధంలో ఉంచారన్నారు. దీనిపై హైకోర్టులో సవాలు చేయగా కోర్టు నిర్ణయం తమ పక్షాన వచ్చిందని, హైకోర్టు పోలీసుల తీరును తప్పు పట్టిందని తెలిపారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.