ETV Bharat / state

అభ్యర్థి ఎవరైనా సహకరించండి... ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి

author img

By

Published : Jan 22, 2021, 5:12 AM IST

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ కార్యాచరణ ప్రారంభించింది. రెండు స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు వేగవంతం చేసింది. ఇవాళ ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ సీనియర్లతో సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. నాగార్జునసాగర్‌ అసెంబ్లీ ఉపఎన్నిక, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు సహా తాజా రాజకీయ పరిస్థితులు చర్చకు రానున్నాయి.

ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి... గెలుపే లక్ష్యంగా వ్యూహాలు
ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ గురి... గెలుపే లక్ష్యంగా వ్యూహాలు

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్నికల కోసం బలమైన అభ్యర్థులను బరిలోకి దించేందుకు కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. గతంలో పలుమార్లు సమావేశమై చర్చించిన సీనియర్ నేతలు తాజాగా గురువారం మరోసారి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల మండలి స్థానానికి పోటీ చేసేందుకు దరఖాస్తులు చేసిన ఆశావహులతో... రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణికం ఠాగూర్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు.

వారికి దీటుగా...

దాదాపు 20 మందితో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. అధికార తెరాస, భాజపా అభ్యర్థులకు దీటుగా నిలబడే వారినే బరిలో దించుతామని... పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థుల గెలుపు కోసం అంతా కలిసికట్టుగా పనిచేయాలని ఆయన నేతలకు సూచించినట్లు కాంగ్రెస్‌ వర్గాలు వెల్లడించాయి.

మరోమారు సమావేశం...

మాణికం ఠాగూర్‌ అభ్యర్థుల ఎంపికపై ఇవాళ సీనియర్లతో మరోమారు సమావేశం కానున్నారు. ఎన్నికలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరంగల్-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల మండలి అభ్యర్థి ఎంపికపై వారితో చర్చించనున్నారు. అనంతరం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికపై సమాలోచనలు చేయనున్నట్లు ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు.

మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలపై ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ స్థానానికి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న 25 మందితో వేర్వేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని నేతలు తెలిపారు.

ముగ్గురేసి నాయకులు...

మండలి ఎన్నికల బరిలో పోటీ చేసే అభ్యర్థుల పేర్ల ఎంపిక ఒకట్రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు. ఈ రెండు స్థానాలకు అందిన దరఖాస్తుల నుంచి ముగ్గురేసి నాయకుల పేర్లను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి మండలి స్థానానికి అధికంగా పోటీ ఉండడం వల్ల కసరత్తు మరింత ఎక్కువగా చేయాల్సి వస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అభిప్రాయ సేకరణ...

అక్కడ పోటీ పడుతున్న వారిలో ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులు ఉండడం వల్ల మూడు జిల్లాలకు చెందిన సీనియర్‌ నాయకులతో మరోసారి అభిప్రాయాలను తీసుకునే అవకాశముందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పీసీసీ స్థాయిలో మూడేసి పేర్లు పరిగణనలోకి తీసుకుని అధిష్ఠానానికి నివేదించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి: నిరుద్యోగ భృతి ఇవ్వాల్సిందే: భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.