ETV Bharat / state

గ్రేటర్‌లో అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వ్యూహం!

author img

By

Published : Sep 16, 2020, 6:55 AM IST

బల్దియా పోరుకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో గ్రేటర్‌ చుట్టూ అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీతోపాటు హెచ్‌ఎండీఏ, జలమండలి ఆధ్వర్యంలో పలు ప్రాజెక్టుల అడుగులు వేగంగా పడుతున్నాయి. గతంలో గ్రేటర్‌ వాసులకు ఇచ్చిన హామీల అమలుతోపాటు కొత్తగా అభివృద్ధి మంత్రం ఎత్తుకొని మళ్లీ గ్రేటర్‌పై పాగా వేయాలనేది అధికార పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.

Strategy for Greater elections with the mantra of development in Hyderabad
గ్రేటర్‌లో అభివృద్ధి మంత్రంతో ఎన్నికలకు వ్యూహం!

గ్రేటర్‌ ఎన్నికలు సమీపిస్తున్నందున బల్దియా చుట్టూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎండీఏ, జలమండలి కూడా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పట్టాలెక్కించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ ఆయా అధికారులతో పలుమార్లు సమావేశమై సమీక్షించారు. పెండింగ్‌ ప్రాజెక్టులు, వాటి స్థితిగతులు, నిధుల లభ్యత తదితర విషయాలపై ఆరా తీశారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే రెండు, మూడు నెలల్లో పనులకు శ్రీకారం చుట్టేలా తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. 2016 ఫిబ్రవరి 2న గ్రేటర్‌ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో తెరాస ఘన విజయం సాధించింది. 150గాను 99 స్థానాల్లో ఆ పార్టీ విజయఢంకా మోగించింది.

పాలక మండలి గడువు ఫిబ్రవరి 11తో ముగియనుంది. ఈ నేపథ్యంలో గతంలో గ్రేటర్‌ వాసులకు ఇచ్చిన హామీల అమలుతోపాటు కొత్తగా అభివృద్ధి మంత్రం ఎత్తుకొని మళ్లీ గ్రేటర్‌పై పాగా వేయాలనేది అధికార పార్టీ వ్యూహం. కరోనా నియంత్రణలోకి వచ్చి అన్నీ అనుకున్నట్లే జరిగితే ఈ ఏడాది ఆఖరు నాటికి బల్దియా ఎన్నికలు ఉంటాయని ఇప్పటికే ఆ పార్టీ నేతలకు పరోక్షంగా సంకేతాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేయనున్నారు. ఇప్పటికే పూర్తిచేసిన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, కొత్త పనులకు శంకుస్థాపనలు జరిగేలా నేతలు వ్యూహరచన చేస్తున్నారు.

గ్రేటర్‌ ఆధ్వర్యంలో..

  • వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ) కింద నగరం నలువైపులా పైవంతెనలు, రహదారులు అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పటికే రూ.2 వేల కోట్ల పనులు పూర్తిచేశారు. మరో రూ.2500 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇవి పూర్తయితే నగరం రూపురేఖలే మారనున్నాయి. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
  • 2016 ఎన్నికల సందర్భంగా లక్ష రెండు పడకల ఇళ్ల హామీ చాలా ప్రధానమైంది. ఇందులో భాగంగా 50 వేల ఇళ్లు దసరాకు సిద్ధం కానున్నాయి. డిసెంబరు నాటికి మరో 30 వేల ఇళ్లు పూర్తి కానున్నాయి.
  • ఇప్పటికే 196 బస్తీ దవాఖానాలు ప్రారంభించారు. కొత్తగా మరో 50 కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా పేద ప్రజలకు ప్రాథమిక వైద్యం అందించగలుగుతున్నామని నేతలు చెబుతున్నారు.
  • ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం, వన్‌టైం సెటిల్‌మెంట్‌ (ఓటీఎస్‌) పథకాలు కూడా ప్రజల్లో సానుకూల మార్పు తీసుకొస్తుందని అధికార పార్టీ అంచనా వేస్తోంది. ఓటీఎస్‌ గడువు అక్టోబరు వరకు పెంచడం కూడా కొంత మేలు చేస్తుందనుకుంటున్నారు.

జలమండలి ఆధ్వర్యంలో..

  • శివార్లలో మురుగు నీటి వ్యవస్థ తీర్చి దిద్దడానికి జలమండలి ఇప్పటికే ప్రణాళిక రూపొందించింది. దాదాపు 66 ప్రాంతాల్లో కొత్త ఎస్టీపీలు భూగర్భ మురుగు నీటి వ్యవస్థను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు.
  • దాదాపు 150 కిలోమీటర్ల అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ 3000 ఎంఎం డయాతో రింగ్‌మెయిన్‌ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఇప్పటికే 50 కిలోమీటర్ల మేర పనులు చేశారు. మిగతా పెండింగ్‌ ప్రాజెక్టులకు కూడా అడుగులు పడనున్నాయి.

హెచ్‌ఎండీఏ పరిధిలో..

  • అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన బాలానగర్‌ చౌరస్తా ప్రాంతంలో 1.13 కిలోమీటర్ల మేర ఆరు లైన్లలో పైవంతెన సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.387 కోట్లు వెచ్చించిన ఈ ప్రాజెక్టు నవంబరు లేదా డిసెంబరులో అందుబాటులోకి రానుంది.
  • పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండే నెక్లెస్‌ రోడ్డులో రహదారులను అభివృద్ధి చేస్తున్నారు. రూ.26 కోట్లతో ఐమాక్స్‌ రోటరీ నుంచి సైక్లింగ్‌ క్లబ్‌ వరకు రహదారిని తీర్చిదిద్దుతున్నారు. మరో రూ.14 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు.
  • అవుటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు త్వరలో శ్రీకారం చుట్టనున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులు పట్టాలెక్కించేందుకు ప్రణాళిక రూపొందించాలని మంత్రి కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.
  • దుర్గంచెరువుపై తీగల వంతెన ఆకట్టుకుంటోంది. త్వరలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. దాదాపు రూ.184 కోట్లతో దీనిని తీర్చిదిద్దారు. ఈ వంతెనతో హైటెక్‌ సిటీ, ఫైనాల్సియల్‌ జిల్లా ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది.
  • జలమండలిలో గృహ నీటి బకాయిలు రూ.600 కోట్లు వరకు ఉన్నాయి. వీటిపై వడ్డీ మాఫీకి ప్రభుత్వం అంగీకరించడంతో ప్రజలకు రూ.200 కోట్ల మేలు జరుగుతుంది.

ఇదీ చదవండిః అటవీ ప్రాంతాల్లో పచ్చదనం సాంద్రత పెంచాలి: పీసీసీఎఫ్​ శోభ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.