ETV Bharat / state

కొండకోనల్లో.. స్వర్గాన్ని సృష్టించారీ మహిళలు..

author img

By

Published : Jan 25, 2021, 10:07 AM IST

కొండకోనల్లో.. స్వర్గాన్ని సృష్టించారీ మహిళలు..
కొండకోనల్లో.. స్వర్గాన్ని సృష్టించారీ మహిళలు..

చుట్టూ ఎత్తైన మంచు కొండలతో...మెరిసిపోయే అందమైన ప్రాంతం హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితిలోయ. అక్కడ యాభై గడపలుండే ఓ చిన్న గిరిజన గ్రామం ఉంది. దాని పేరే ఖురిక్‌. ఇప్పుడు ఆ ఊరి పేరు ఆ చుట్టుపక్కల మారుమోగిపోతోంది. దానికి కారణం ఆ ఊరిని మద్యపానరహితంగా మార్చేశారు అక్కడి మహిళలు. అసలేం జరిగిందంటే...?

మద్యం తయారీ అనేది అక్కడ ప్రతి ఇంట్లోనూ సాధారణంగా జరిగే ఓ ప్రక్రియ. దాన్ని ఓ సంప్రదాయంగానూ భావిస్తుంటారు వారు. దాంతో చిన్నపిల్లలు సైతం దానికి బానిసలవ్వడం ఆ స్త్రీమూర్తులందరినీ కలచి వేసింది. అప్పటికే స్థానిక సమస్యల్ని పరిష్కరించుకునే దిశగా ‘ఖురిక్‌ మహిళామండలి’ని స్థాపించుకున్నారు. వీరంతా కలిసి సమావేశమైనప్పుడు మద్యపానం వల్ల ఎదురవుతున్న దుష్ఫలితాలను చర్చించారోసారి.

ప్రతి మహిళా తాను ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఇక్కడ పంచుకుంది. ఇక, కఠిన నిర్ణయం తీసుకోకపోతే...మరింత ఇబ్బందులు పడాల్సి వస్తుందని భావించి వారంతా మద్యనిషేధానికి నడుము కట్టారు. మద్యం తయారీతో పాటు దుకాణాల ఏర్పాటు, అమ్మకాలు, కొనుగోలు, తాగడం వంటివన్నీ ఇక్కడ నేరమని ప్రకటించారు. దీనికి విరుద్ధంగా ఎవరైనా ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే మహిళా సంఘానికి వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇలాంటి తీర్మానాలు తీసుకోవడం వీరికి కొత్త కాదు. గతంలో పర్యావరణ పరిరక్షణ దిశగా...చెట్లు నరికివేత, వన్యమృగాల వేట వంటివి చేయకూడదని నిర్ణయించారు. ఇంటింటా మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఆడపిల్లల్ని పాఠశాలలవైపు అడుగులు వేయిస్తున్నారు. వీరు చేస్తున్న కృషి చుట్టుపక్కల గ్రామాల వారికి స్ఫూర్తిమంతంగా నిలుస్తోంది.

ఇదీ చదవండి : మిషన్ భగీరథ వాటర్ బాటిళ్లు.. సీఎం ప్రశంసలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.