ETV Bharat / state

స్థానిక సంస్థల్లోని ఖాళీల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ కసరత్తు

author img

By

Published : Apr 8, 2022, 3:21 AM IST

Elections: రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల్లోని ఖాళీలకు ఎన్నికల నిర్వహణా కసరత్తును రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఆయా ఖాళీలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ముందస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇవాళ వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదాలు విడుదల చేయనున్నారు. అభ్యంతరాలు, వినతులు పరిష్కరించి ఈ నెల 21న తుది జాబితాలు ప్రకటించనున్నారు.

స్థానిక సంస్థల్లోని ఖాళీల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ కసరత్తు
స్థానిక సంస్థల్లోని ఖాళీల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ కసరత్తు

స్థానిక సంస్థల్లోని ఖాళీల ఎన్నికల నిర్వహణకు ఎస్‌ఈసీ కసరత్తు

Elections: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన పదవులకు గత కొన్నాళ్లుగా ఎన్నికలు నిర్వహించలేదు. న్యాయస్థాన వివాదాలు, ఇతర కారణాల రీత్యా మరికొన్నింటికి ఎన్నికలు జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా 3 జడ్పీటీసీ స్థానాలు, 92 ఎంపీటీసీ స్థానాలు, 215 సర్పంచ్ స్థానాలతో పాటు 5 వేల 334 వార్డు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. 19 జిల్లాల పరిధిలోని 19 గ్రామపంచాయతీల పాలకవర్గాలకు మొత్తం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లోనూ 16 స్థానాలు ఖాళీలున్నాయి. మూడు కార్పొరేషన్ల పరిధిలోని 3 కార్పొరేటర్ స్థానాలతో పాటు పురపాలికల పరిధిలోని 13 కౌన్సిలర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి.. ముందస్తు ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే శ్రీకారం చుట్టింది. వార్డుల వారీ ఓటర్ల జాబితా తయారీకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నికలు జరగాల్సిన స్థానాల్లో ఇవాళ వార్డుల వారీ ఓటర్ల జాబితా ముసాయిదాలను సిద్ధం చేసి విడుదల చేయాల్సి ఉంది.

21న వార్డుల వారీ ఓటర్ల తుది జాబితా.. కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల ప్రకటించిన ఓటర్ల జాబితాను ప్రామాణికంగా తీసుకొని వార్డుల వారీ ఓటర్ల జాబితాను రూపొందించాలి. వాటిపై ఈ నెల 16 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలి. ఆయా స్థానికంగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేసి ముసాయిదాపై వారి నుంచి కూడా అభ్యంతరాలు, వినతులు స్వీకరించాలి. వాటన్నింటిని పరిష్కరించి ఈ నెల 21న వార్డుల వారీ ఓటర్ల తుది జాబితాలు ప్రకటించాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జడ్పీ సీఈఓలు, డీపీఓలతో పాటు సంబంధిత మున్సిపల్ కమిషనర్లతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ఇప్పటికే దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లు లేకుండా ఓటర్ల జాబితాను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు.

మే లేదా జూన్​లో ఎన్నికలు: ఓటర్ల జాబితా ప్రచురించాక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఖరారు ప్రక్రియను చేపడతారు. ఇందుకోసం ఎస్ఈసీ విడిగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఎన్నికల నిర్వహణ కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కార్ నుంచి వచ్చే అనుమతి ఆధారంగా... మే లేదా జూన్ నెలల్లో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎస్ఈసీ భావిస్తోంది. వీటితో పాటు ఒక జడ్పీ ఉపాధ్యక్ష పదవికి, 6 ఎంపీపీ పదవులు, మూడు ఎంపీపీ ఉపాధ్యక్ష పదవులు, రాష్ట్ర వ్యాప్తంగా 343 ఉపసర్పంచ్ పదవులకు కూడా పరోక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది.

ఇదీ చదవండి: కేంద్రంపై తెరాస వరిపోరు.. రాష్ట్రవ్యాప్తంగా నిరసనల హోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.