ETV Bharat / state

Data Theft Case: వ్యక్తిగత డేటా ఎవరెవరికి విక్రయించారు..?

author img

By

Published : Mar 27, 2023, 8:57 AM IST

SIT Investigation in Data Theft Case
SIT Investigation in Data Theft Case

SIT Investigation in Data Theft Case: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న 16.8 కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో సైబరాబాద్‌ ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్‌ మరింత లోతుగా విచారిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితులు డేటా ఎవరెవరికి విక్రయించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అరెస్టయిన ఏడుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించనున్నారు. ఈ వ్యవహారంలో డేటా ఎవరెవరికి చేరిందనే అంశంపై దృష్టి సారించారు.

డేటా చోరీ కేసు.. లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్‌

SIT Investigation in Data Theft Case: వ్యక్తిగత డేటా చోరీ కేసులో నిందితులు వేలాది మందికి సమాచారం విక్రయించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నాగ్‌పూర్‌కు చెందిన జియా ఉర్‌ రెహ్మాన్‌ నుంచి మిగిలిన ఆరుగురు డేటా కొనుగోలు చేశారు. దాదాపు ఏడాదిగా ఈ దందా కొనసాగిస్తున్నారు. నిందితులు దిల్లీ సమీపంలోని నోయిడాలో కాల్‌ సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఏడాది కాలంగా ఈ వ్యవహారం నడుస్తున్నా.. స్థానిక పోలీసులు గుర్తించలేకపోయారు.

Data Theft Case Updates: ప్రస్తుతం డేటా చోరీ బయటపడటంతో ఇతర రాష్ట్రాల పోలీసులు సైబరాబాద్‌ పోలీసులను సంప్రదిస్తున్నారు. దిల్లీ పోలీసులు సైబరాబాద్‌ పోలీసులతో మాట్లాడారు. భారత్‌లో జరిగే సైబర్‌ మోసాల్లో చైనా మూలాలుంటున్నాయి. ఈ క్రమంలో డేటా ఏమైనా చైనా సైబర్‌ నేరగాళ్లకు చేరిందా అనే విషయమై పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు ఉపయోగించిన బ్యాంకు లావాదేవీలను సిట్‌ అధికారులు పరిశీలిస్తున్నారు. లావాదేవీల కోసం ఇతరుల బ్యాంకు ఖాతాలు వినియోగించారా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.

డేటా విక్రయం ద్వారా కూడబెట్టిన ఆస్తుల గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే నిందితుడు కుమార్‌ నితీశ్‌ భూషణ్‌ నోయిడాలో ఇల్లు, బంగారం కొనుగోలు చేసినట్టు సిట్ గుర్తించింది. ఇతర నిందితులు కూడా ఇదే విధంగా ఏమైనా ఆస్తులు సమకూర్చుకున్నారా అనే అంశంపై పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. డేటా చోరీ కేసులో అరెస్టయిన నిందితుల పోలీసు కస్టడీ కోసం సిట్‌ అధికారులు కోర్టు అనుమతి తీసుకోవడానికి సిద్దమవుతున్నారు.

డెబిట్‌, క్రెడిట్‌ కార్డు డేటా ఎలా వచ్చింది: సేకరించిన డేటాలో పాన్​కార్డు కలిగిన వారి సమాచారాన్ని ఒక్కో విభాగంగా విభజించారు. డయిల్​లో డేటా ప్రొవైడర్ల పేరిట పేరు నమోదు చేసుకుని వారిని సంప్రదించిన వారికి మాత్రమే విక్రయిస్తున్నారు. ఫేస్​బుక్, నీట్, సీబీఎస్​ఈ, పలు బ్యాంకుల ఖాతాదారులు, సీనియర్ సిటిజన్లు, నెట్​ఫ్లిక్స్, ఫ్లిక్​కార్టు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, పాన్ కార్డు దారుల సమాచారాన్ని అంత ప్రత్యేకంగా పలు విభాగాలుగా విభజించారు. ఈ మేరకు డేటా చోరీకి మూలాధారమైన వ్యవస్థలను గుర్తించేందుకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టనుంది.

నిందితులు కోట్ల మంది డేటాను ఎలా పొందారనే కోణంలో సిట్ ఆరా తీస్తోంది. ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో జియా ఉర్ రెహ్మాన్ మిగిలి ఉన్న ఆరుగురికి డేటాను విక్రయించాడు. మిగిలిన వారు కాల్​సెంటర్ నిర్వహిస్తున్నారు. జియాను పోలీసులు విచారణలో ప్రశ్నించగా ముంబయికి చెందిన వ్యక్తి నుంచి డేటాను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ ముంబయి వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల దగ్గర ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారి డేటా ఉన్నట్లుగా సిట్ గుర్తించింది. బ్యాంక్ డెబిట్‌, క్రెడిట్‌ ఖాతాదారులకు సంబంధించి.. తెలంగాణలోని కొన్ని జిల్లాల డేటా వారి దగ్గర ఉన్నట్టు తేలింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.