ETV Bharat / state

TSPSC పేపర్ లీకేజీ.. నిందితులను మరోసారి కస్టడీకి కోరుతూ సిట్ పిటిషన్

author img

By

Published : Mar 24, 2023, 8:29 PM IST

SIT Petition for Paper Leakage Accused Custody : టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరోసారి నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. నిన్న అరెస్టు చేసిన ముగ్గురితో కలిపి మొత్తం ఏడుగురిని సిట్ అధికారులు ఆరురోజులు కస్టడీకి కోరారు. ఈ పిటిషన్​పై రేపు నాంపల్లి కోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.

Tspsc Paper Leakage
Tspsc Paper Leakage

SIT Petition for Paper Leakage Accused Custody : రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతోనే ఈ వ్యవహారం నడిచిందంటూ ప్రతిపక్షాలు బీఆర్​ఎస్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ తనదైన శైలిలో నిరసన కార్యక్రమాలు చేపడుతుండగా.. మరోవైపు బీజేపీ రాష్ట్ర సర్కార్​పై పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు చేస్తూ ధర్నాలు చేపడుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం సిట్​ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులను ఆరు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించగా రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి.

అయితే నిన్నటితో నిందితుల కస్టడీ ముగియడంతో తాజాగా మరోసారి పేపర్ లీకేజీ కేసులో మరోసారి నిందితుల కస్టడీ కోసం కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్​రెడ్డి, డాక్యా, రాజేశ్వర్​తో పాటు నిన్న అరెస్టు చేసిన షమీం, రమేష్, సురేష్​ను కస్టడీకి కోరుతూ నాంపల్లి కోర్టులో సిట్ పిటిషన్ వేసింది. ఈ ఏడుగురిని ఆరు రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్​లో సిట్ అధికారులు కోరారు. సిట్ దాఖలు చేసిన ఈ పిటిషన్​పై రేపు నాంపల్లి కోర్టులో వాదనలు జరిగే అవకాశం ఉంది.

19మందిని సాక్షులుగా చేర్చిన సిట్​ : ఈ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులు 19 మందిని సాక్షులుగా చేర్చారు. టీఎస్​పీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మితోపాటు అదే కార్యాలయానికి చెందిన మరో ఇద్దరిని సాక్షులుగా చేర్చారు. వీళ్లలో ప్రవీణ్ వద్ద జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేసిన అనురాజ్ తోపాటు.. టీఎస్​టీఎస్ తరఫున టీఎస్​పీఎస్సీలో రాజశేఖర్ రెడ్డి సహోద్యోగిగా పనిచేస్తున్న హరీశ్ కుమార్‌ను సాక్షులుగా చేర్చారు. కర్మన్ ఘాట్​లోని ఆర్ స్క్వేర్ లాడ్జ్ యజమాని, ఇద్దరు సిబ్బందిని కూడా సాక్షులుగా చేర్చారు. ఈనెల 4వ తేదీన ఆర్- స్క్వేర్ లాడ్జ్‌లో... నీలేష్, గోపాల్​తో పాటు డాక్యా బస చేశారు. లాడ్జిలోఉన్న సీసీ దృశ్యాలను సిట్ అధికారులు సేకరించారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్ చెప్పిన వివరాల ఆధారంగా మరో ముగ్గురు టీఎస్​పీఎస్సీ ఉద్యోగులైన షమీమ్, రమేష్, సురేష్​లను అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో సిట్ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు నలుగురు టీఎస్​పీఎస్సీ ఉద్యోగులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. 13వ తేదీన ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్​ను అరెస్ట్ చేయగా... షమీమ్, సురేష్, రమేశ్​ను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.