ETV Bharat / state

ఎఫ్​ఎస్​ఎల్ నివేదిక వస్తే కీలక విషయాలు తెలుస్తాయి

author img

By

Published : Mar 19, 2023, 5:11 PM IST

SIT Inquiry in TSPSC Paper leakage : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. నిన్న ప్రవీణ్​, రాజశేఖర్, రేణుకలను విడివిడిగా ప్రశ్నించిన సిట్ అధికారులు.. నేడు నిందితులకు సహకరించిన మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను విశ్లేషిస్తున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక వస్తే కీలక విషయాలు తెలుస్తాయని సిట్ పేర్కొంది.

SIT Inquiry in TSPSC Paper leakage
SIT Inquiry in TSPSC Paper leakage

SIT in Inquiry in TSPSC Paper leakage : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సిట్‌ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. శనివారం 9 మంది నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించిన అధికారులు... రెండోరోజు హిమాయత్‌నగర్‌లోని సిట్ కార్యాలయంలో విచారిస్తున్నారు. నిన్న ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి, రేణుకను విడివిడిగా ప్రశ్నించిన సిట్‌... నేడు ఏఈ పరీక్ష రాసిన నీలేష్, గోపాల్‌ను విచారిస్తున్నారు. విచారణ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేస్తున్నారు. నిందితులకు సహకరించిన మరో ముగ్గురిని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న కంప్యూటర్లను సైబర్ క్రైం పోలీసుల సాయంతో విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ హిమాత్‌నగర్ సిట్‌ కార్యాలయంలో నిందితుల కస్టడీ విచారణలో పాల్గొన్నారు. ఐపీ అడ్రస్‌ నుంచి లాగిన్ అయి ప్రశ్నాపత్రాలను పెన్ డ్రైవ్‌లలో కాపీ చేసిన వ్యహారాన్ని ఆరా తీస్తున్నారు. సిట్ చీఫ్ ఏఆర్‌ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతోంది. ఎఫ్​ఎస్​ఎల్ నివేదిక వస్తే కీలక విషయాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు.

టీఎస్​పీఎస్సీ లీకేజీ కేసులో శనివారం నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు ఈనెల 23 వరకు మొత్తం 6 రోజులపాటు ప్రశ్నించనున్నారు. నిన్న 9 మంది నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి తరలించిన పోలీసులు... కోఠి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం ఏడుగురిని సిట్‌ ఆఫీసుకు... ప్రవీణ్, రాజశేఖర్‌ను టీఎస్​పీఎస్సీ కార్యాలయానికి తీసుకెళ్లారు. నిందితులతో కలిసి నేరం జరిగిన తీరును తెలుసుకునేందుకు సిట్ అధికారులు సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు. ఐపీ అడ్రస్‌లు మార్చి కంప్యూటర్‌లోకి ఎలా చొరబడ్డారని విషయాలపై వారు ఆరా తీశారు. కంప్యూటర్ల ఐపీ అడ్రస్ ఎలా మార్చాననే విషయాన్ని ఈ కేసులో నిందితుడు అయిన రాజశేఖర్ రెడ్డి పోలీసులకు చూపించాడు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ లాగిన్ పాస్‌వర్డ్‌లను శంకర్ లక్ష్మి డైరీలో నుంచి దొంగిలించినట్లు ప్రవీణ్‌ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మూడోరోజు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.

హైకోర్టులో రేపు పిటిషన్ వేస్తాం: టీఎస్​పీఎస్సీ లీకేజీ వ్యవహారానికి నిరసనగా ఆదివారం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి జిల్లా గాంధారిలో నిరుద్యోగ నిరసన దీక్ష చేపట్టింది. దీక్షలో పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి.. లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షించడం సహా మొత్తం వ్యవహరంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై హైకోర్టులో రేపు పిటిషన్ వేస్తామన్నారు. పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి... కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని బీజేపీ రాష్ట్ర అ‍ధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు.ప్రశ్నపత్రాల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు. ప్రశ్నపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలన్న ఆయన... రేపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒంటిగంట వరకు దీక్షలు చేయనున్నట్లు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.