'పెద్దల పేర్లు చెప్తే ఎన్‌కౌంటర్‌ చేస్తామని లీకేజీ కేసు నిందితులను బెదిరించారు'

author img

By

Published : Mar 19, 2023, 3:17 PM IST

Updated : Mar 19, 2023, 4:23 PM IST

Revanthreddy

Revanthreddy Speech at Unemployement Strike: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. జైలులో లీకేజీ కేసు నిందితులను పెద్దల పేర్లు చెప్తే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారని రేవంత్​ మండిపడ్డారు. దర్యాప్తు జరగకుండానే ఇద్దరే తప్పు చేశారని కేటీఆర్‌ ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు.

Revanthreddy Speech at Unemployement Strike : నిరుద్యోగుల పాలిట రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద సమస్యగా మారిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మండిపడ్డారు. పేపర్ లీకేజీలతో పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసిందన్న ఆయన.. ఈ తప్పిదాలకు ప్రభుత్వాన్నే రద్దు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయన్నారు. ఈ వ్యవహారంపై కేటీఆర్​ తనకేం సంబంధం అని అతి తెలివిగా ప్రశ్నిస్తున్నారని ధ్వజమెత్తారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా.. కామారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న రేవంత్‌రెడ్డి.. ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారిలోని శివాజీ చౌక్‌లో వద్ద చేపట్టిన నిరుదోగ్య నిరాహార దీక్షలో పాల్గొన్ని పేపర్ లీకేజీ ఘటనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

పెద్దల పేర్లు చెప్తే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారు : పేపర్ లీక్ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారిని కస్టడీలోకి తీసుకుని వివరాలు ఎందుకు సేకరించలేదని రేవంత్​ ప్రశ్నించారు. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌లో 100 మార్కులు దాటినవారిని విచారించాలని పేర్కొన్నారు. లీకేజీలో అధికారి శంకరలక్ష్మి పాత్ర ఏంటో బయటపెట్టాలని పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జైలులో లీకేజీ కేసు నిందితులను బెదిరించారని వివరించారు. పెద్దల పేర్లు చెప్తే ఎన్‌కౌంటర్‌ చేస్తామని బెదిరించారని అన్నారు. దర్యాప్తు జరగకుండానే ఇద్దరే తప్పు చేశారని కేటీఆర్‌ ఎలా చెప్తారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమైనా విచారణ అధికారా అని మండిపడ్డారు.

'2016 గ్రూప్‌1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయి. అమెరికా నుంచి వచ్చి నేరుగా గ్రూప్‌-1 రాసిన మాధురికి ఫస్ట్ ర్యాంక్‌ వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగి రజనీకాంత్‌ రెడ్డికి 4వ ర్యాంక్‌ వచ్చింది. మాధురి, రజనీకాంత్‌రెడ్డి ఎవరి వల్ల ఉద్యోగాలు పొందారో తేల్చాలి. గ్రూప్‌-2లో ఒకేచోట రాసిన 25 మందికి ఉద్యోగాలొచ్చాయి. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, ఏఆర్ శ్రీనివాస్‌కు ఉన్న బంధమేంటి?.పేపర్ లీకేజీ వ్యవహారంపై హైకోర్టులో రేపు వాదనలు వినిపిస్తాం.'-రేవంత్‌, టీపీసీసీ అధ్యక్షుడు

కేటీఆర్‌ ఆఫీసు నుంచే లీకేజీ వ్యవహారం నడిచింది : టీఎస్‌పీఎస్సీలో పనిచేస్తున్నవారికి పరీక్షలు రాసే అర్హత లేదన్న రేవంత్‌.. అందులో పని చేస్తున్న 20 మంది పరీక్షలు ఎలా రాశారని ప్రశ్నించారు. గతంలో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగి రజినీకాంత్‌ గ్రూప్‌-1కు ఎంపికయ్యారని వివరించారు. గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీలో కేటీఆర్‌ పీఏ తిరుపతిది కీలకపాత్రని ఆరోపించారు. కేటీఆర్‌ ఆఫీసు నుంచే లీకేజీ వ్యవహారం నడిచిందని విమర్శించారు. కేటీఆర్‌ పీఏకు నిందితుడు రాజశేఖర్‌రెడ్డికి సంబంధం ఉందని ఆక్షేపించారు. తిరుపతి, రాజశేఖర్‌రెడ్డివి పక్కపక్క గ్రామాలేనని రేవంత్‌రెడ్డి తెలిపారు. తిరుపతి చెబితేనే కేటీఆర్‌ రాజశేఖర్‌రెడ్డికి ఉద్యోగమిచ్చారని పేర్కొన్నారు. కేటీఆర్‌ పీఏ ప్రాంతానికి చెందిన 100 మందికి గ్రూప్‌-1లో 100కుపైగా మార్కులు వచ్చాయని ఆరోపించారు.

2016 గ్రూప్‌1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయి : రేవంత్​రెడ్డి

'ఈ ఆరోపణల నుంచి మంత్రి కేటీఆర్ తప్పించుకోలేరు. 2016 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నిరుద్యోగుల పట్ల సీఎంకు ఇంత బాధ్యతారాహిత్యమా ? కేటీఆర్​ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు... ఇప్పుడు ప్రశ్నాపత్రాల కొనుగోలు. అక్కడ కేసీఆర్.. ఇక్కడ కేటీఆర్ పాత్రదారులు. 21న గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేసి.. తక్షణమే వారిని ప్రాసిక్యూట్ చేయాలని కోరతాం. నిరుద్యోగుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేద్దాం.. తండ్రీ కొడుకులను చంచల్​గూడ జైలుకు పంపిద్దాం.'-రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారిలోని శివాజీచౌక్‌లో చేపట్టిన నిరుద్యోగ నిరాహార దీక్ష సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ దీక్షలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, మల్లు రవి సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Mar 19, 2023, 4:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.